Female SI Candidates: మహిళా ఎస్‌ఐ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): గుంటూరు పోలీస్ పరేడ్‌గ్రౌండ్స్‌లో బుధవారం మహిళా ఎస్‌ఐ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఏపీ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ అతుల్‌సింగ్, గుంటూరు రేంజ్ ఐజీ జి.పాలరాజు, ఎస్పీలు కె.ఆరిఫ్‌హఫీజ్ (గుంటూరు జిల్లా), మల్లికగర్గ్ (ప్రకాశం జిల్లా) పరీక్షలను పర్యవేక్షించారు. మహిళా అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు, నకళ్లను తనిఖీ చేశారు. అనంతరం బయోమెట్రిక్, చాతీ, ఎత్తు, 1,600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతుల్‌సింగ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రేంజ్ పరిధిలో ప్రాథమిక రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 25 నుంచి సెప్టెంబర్ 15 వరకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. గుంటూరు రేంజ్ పరిధిలో వర్షం వల్ల వాయిదా పడిన పరీక్షలను సెప్టెంబర్ 16, 19 తేదీల్లో నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షల ఏర్పాట్లపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఏఎస్పీలు అంకితా సూరన (ఒంగోలు), కె.సుప్రజ (గుంటూరు), హైమావతి (ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు) పలువురు మహిళా పోలీస్ అధికారులు, ఐజీ కార్యాలయపు సీఐ సుధాకర్, నగరంపాలెం పీఎస్ సీఐ హైమారావు, ఆర్‌ఐలు, పలువురు సీఐలు మినిస్టీయల్, పోలీస్ సిబ్బంది పరీక్షలు నిర్వహించారు.