Amazonలో లేఆఫ్స్.. తొలగించిన ఉద్యోగుల్ని తిరిగి వెనక్కి తీసుకుంటున్న ఈకామర్స్ దిగ్గజం!
ఆస్థిర ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో అమెజాన్‌లో ఉద్యోగాల కోత కొనసాగుతుంది. అయితే, వేలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేస్తున్న అమెజాన్..ఇప్పటికే తొలగించిన వారిని విధుల్లోకి తీసుకుంటుంది. ఈ ఏడాది అమెజాన్ 18,000 మంది సిబ్బందిని ఫైర్ చేసింది. వారిలో అమెజాన్ ప్రాడక్ట్ మేనేజర్ పైజ్ సిప్రియాని ఒకరు.
సంస్థలో ప్రొడక్ట్ మేనేజర్‌గా చేరిన నాలుగు నెలలకే సిప్రియాని తొలగిస్తున్నట్లు అమెజాన్ యాజమాన్యం మెయిల్ పెట్టింది. దీంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురైంది. ‘ఇది అత్యంత కఠినమైన సమయం. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాను. నాకు నేను సర్ధి చెప్పుకుంటున్నా. కానీ ఇంకా బాధగానే ఉంది. ఎందుకంటే? అమెజాన్‌లో నా కెరియర్ ప్రారంభమైంది ఇప్పుడే. అంతలోనే ఉద్యోగం పోగొట్టుకోవడాన్ని తట్టుకోలేకపోతున్నా. సంస్థలో చాలా విలువైన క్షణాల్ని గడిపాను. అత్యద్భుతమైన సహచర ఉద్యోగుల్ని పొందాను. అందుకు తోడ్పడిన యాజమాన్యానికి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపింది.
ఈ క్రమంలో పైజ్ సిప్రియాని మరోసారి లింక్డిన్‌లో తన జాబ్ గురించి అప్‌డేట్ చేశారు. విచిత్రంగా అమెజాన్‌లో పోగొట్టుకున్న జాబ్‌ను తిరిగి పొందగలిగాను. సంతోషంగా ఉంది. జనవరిలో సోషల్ మీడియా ప్రొడక్ట్ మార్కెటింగ్ మేనేజర్ విధులు నిర్వహిస్తుండగా అమెజాన్ పింక్ స్లిప్ ఇచ్చిందని గుర్తు చేశారు. అనూహ్యంగా మళ్లీ ఇప్పుడే అదే విభాగంలో, ప్రొడక్ట్ మార్కెటింగ్ మేనేజర్‌గా రీజాయిన్ అయ్యాను అంటూ సంతోషం వ్యక్తం చేశారు.
9,000 మంది ఉద్యోగుల తొలగింపు
తాజాగా, ప్రపంచ వ్యాప్తంగా ఆ సంస్థలో విధులు నిర్వహిస్తున్న మొత్తం 9,000 వేల మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు సీఈవో యాండీ జెస్సీ ప్రకటించారు. వారిలో 500 మంది భారతీయ ఉద్యోగులు సైతం ఉన్నారు.