Skip to main content

Jobs: ఈ అర్హ‌త‌లు ఉన్న వారికి తక్షణమే 21000 ఉద్యోగాలు ఇవ్వ‌డానికి రెడీగా ఉన్నాం.. ఇక మీదే ఆల‌స్యం..

సాక్షి, అమరావతి: పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం మీ చేతుల్లో ఉంటే తక్షణం ఉద్యోగాలు ఇవ్వడానికి ఆయా సంస్థలు సిద్ధంగా ఉన్నాయి.
job opportunities
job opportunities

రాష్ట్రంలోని 1,275 కంపెనీలు ఈ ఏడాదికి వివిధ అంశాల్లో నైపుణ్యం కలిగిన 21 వేల మందికి ఉపాధి కల్పించడానికి సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంలో భాగంగా ఈ ఏడాదికి పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల అవసరాల వివరాలను పరిశ్రమల శాఖ సేకరించింది.

1,275 కంపెనీలు..
ప్రతి జిల్లాలోనూ పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్లు అక్కడి పరిశ్రమలను సంప్రదించి ఈ ఏడాదికి ఏయే నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఏ మేరకు కావాలన్న వివరాలను సేకరించారు. ఈ సర్వేలో 1,275 కంపెనీలు సుమారు 21 వేల ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని, ఇందుకోసం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి ఆయా సంస్థలకు అవసరమైన మానవ వనరుల్ని అందించే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ వీఆర్‌వీఆర్‌ నాయక్‌ ‘సాక్షి’కి తెలిపారు.

సుమారు 180కి పైగా నైపుణ్య కోర్సుల్లో..
ఇందుకోసం పాలిటెక్నిక్, ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ‘స్కిల్‌ హబ్స్‌’ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. పరిశ్రమలకు అవసరమైన సుమారు 180కి పైగా నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇచ్చేవిధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.

ఈ విద్యా సంవత్సరం నుంచే..
రాష్ట్రంలో 68 కంపెనీలు తమ ప్రాంగణాల్లోనే ఉద్యోగార్థులకు శిక్షణ ఇచ్చి, శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగాల్లో చేర్చుకోవడానికి ముందుకు వచ్చినట్లు నాయక్‌ తెలిపారు. మిగిలిన పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే విధంగా స్కిల్‌ హబ్‌ల్లో కోర్సులను రూపొందిస్తున్నట్లు పరిశ్రమ ప్రతినిధులు, విద్యారంగ నిపుణులతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీ ఎస్‌ఎస్‌డీసీ), నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ, ఐటీ ఈ–సీ ప్రత్యేక కార్యదర్శి జి.జయలక్ష్మి పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.

Published date : 29 May 2022 12:45PM

Photo Stories