Job Opportunities: నిరుద్యోగ సమస్య పరిష్కారానికే జాబ్‌మేళాలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): యువతకు వారి విద్యార్హతకు తగిన విధంగా స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రతి నెలా తమ శాఖ ఆధ్వర్యంలో జాబ్‌మేళాలను నిర్వహిస్తున్నామని ఉపాధి కల్పన శాఖ డెప్యూటీ డైరెక్టర్ వి.హిమబిందు చెప్పారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా బుధవారం జరిగింది. జాబ్‌మేళాకు హాజరైన అభ్యర్థులను ఉద్దేశించి హిమబిందు మాట్లాడారు. యువతకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమశాఖ అందించే సేవలన్నింటినీ ఎంప్లాయిమెంట్ వెబ్‌పోర్టల్ ద్వారా అందిస్తున్నామని చెప్పారు. రీజనల్ ఎంప్లాయిమెంట్ అధికారి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా నిరుద్యోగ సమస్య అనేది ఉండకూడదనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా ఉపాధి అధికారి దేవరపల్లి విక్టర్‌బాబు మాట్లాడుతూ యువత తమలోని నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలన్నారు.
53 మందికి ఉద్యోగాలకు ఎంపిక
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 210 మంది యువతీ యువకులు ఈ జాబ్‌మేళాకు హాజరయ్యారు. వారికి ప్రైవేటు కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. 53 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని ఉమ్మడి కృష్ణాజిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్‌బాబు చెప్పారు.