Nitish Rajput: యూట్యూబ్‌లో వీడియో పెడతాడు.. రూ.కోట్లు కొడతాడు.. నితిష్ ‘నాలెడ్జ్ ఈజ్ పవర్’ ఇదే!!
నితిష్ రాజ్‌పుట్‌కు నెలకు 25 లక్షలు సంవత్సరానికి ఎంత లేదన్నా 3 కోట్లు వస్తాయి. ‘నాలెడ్జ్ ఈజ్ పవర్’ అన్నారు. సామాజిక అంశాలపై విస్తృత సమాచారం అందిస్తూ అతడు చేసే వీడియోల వల్లే ఈ ఆదాయం. నితిష్ సక్సెస్ స్టోరీ ఇదే..
2022లో మన దేశంలో పాన్‌మసాలా వ్యాపార లావాదేవీల మొత్తం ఎంతో తెలుసా? 43,410 కోట్లు. ఊహకు అందని భారీ వ్యాపారం. అందుకే పాన్‌మసాలా సంస్థలు తమ బ్రాండ్ పేరు జనం నాలికల మీద తద్వారా వారి పొగాకు ఉత్పత్తులు జనాల నోళ్ల లోపలకు వెళ్లాలంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలతో ఎలా యాడ్స్ చేయిస్తాయో నితిష్ రాజ్‌పుట్ తన 30 నిమిషాల వీడియోలో వివరిస్తాడు.
ఎలాగైతే ఆల్కహాల్ కంపెనీలు తమ బ్రాండ్ ప్రచారం కోసం మంచి నీళ్లు, మ్యూజిక్ సీడీలను తమ బ్రాండ్‌తో యాడ్స్ చేస్తాయో.. పాన్ మసాలా కంపెనీలు కూడా అదే దారిలో సినిమా స్టార్స్‌ను పెట్టి లాఘవంగా ‘ఇలాచీ’, ‘గులాబ్’ అంటూ దొంగ యాడ్స్ చేస్తాయని వివరిస్తాడు. అమ్మేది మాత్రం పొగాకు ఉత్పత్తులనే అని తెలుపుతాడు. అంతేకాదు పొగాకు ఉత్పత్తుల్లో నేరుగా ప్రభుత్వం ఎలా భాగస్వామ్యం అయి ఉందో కూడా చెప్తాడు. ఇంత సవివరంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా దాదాపుగా రాయదు. అందుకే నితిష్ రాజ్‌పుట్ వీడియోలకు అంత డిమాండ్.
Alakh Pandey Success Story: మొదటి సంపాదన రూ.5 వేలు.. ప్రస్తుతం రూ.5 కోట్లు.. దేశంలో అత్యధికంగా సంపాదిస్తున్న టీచర్ ఈయనే!!
అన్ని వైపుల సమాచారం..
నితిష్ రాజ్‌పుట్ 2020లో తన పేరు మీద ‘నితిష్ రాజ్‌పూట్ యూట్యూబ్ చానెల్’ను మొదలుపెట్టాడు. అందులో తనే మాట్లాడుతుంటాడు. ఏం మాట్లాడతాడు? ఒరిస్సాలో ట్రైన్ యాక్సిడెంట్‌కు కారణాలేమిటి? మణిపూర్‌లో ఏం జరుగుతోంది? ఖలిస్తాన్ ఉద్యమంలో వాస్తవం ఎంత? తాలిబన్‌లంటే ఎవరు? క్రెడిట్ కార్డ్స్‌లో మోసం ఎలా జరుగుతుంది... ఇలాంటి అంశాలతో వీడియోలు చేస్తాడు. అయితే ఇవి పైపైన చేసే వీడియోలు కాదు. దాదాపు పరిశోధనాత్మక జర్నలిజం స్థాయిలో ఉంటాయి.
తీసుకున్న అంశంలో ఏదో ఒక పక్షం వహించకుండా అన్ని పక్షాల వైపు నుంచి సమాచారాన్ని రాసి పోస్ట్ చేస్తాడు. అంతే కాదు చరిత్రలో జరిగిపోయిన కొన్ని ఘటనలను కూడా వివరిస్తాడు. ఉదాహరణకు ఇజ్రాయిల్– పాలస్తీనాల మధ్య గొడవ. ఇలా ఒకటనేముంది మ్యూచువల్ ఫండ్స్ దగ్గరి నుంచి స్టాక్ మార్కెట్ పాఠాల వరకూ అన్నీ చెబుతాడు. అందుకే రెండేళ్ల కాలంలోనే అనూహ్యమైన విజయం సాధించాడు.
ఉత్తరప్రదేశ్ కుర్రాడు..
నితిష్ రాజ్‌పుట్ ఉత్తర ప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ అనే చిన్న ఊళ్లో పుట్టాడు. ఇప్పుడు అతనికి 33 ఏళ్లు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బి.టెక్. చేసి ఐ.టి. కంపెనీల్లో పని చేశాడు. కాని తనకంటూ ఒక సొంత అస్తిత్వం, ఆర్థిక అంతస్తు ఉండాలని ఆశించి 2020లో వీడియో చానల్ ప్రారంభించాడు. సగటు మనిషికి నిత్యం కనిపించే విషయాలే లోతుగా తెలియచేయడం అతడు ఎంచుకున్న ఫార్ములా.
ఉదాహరణకు బిట్‌కాయిన్ కథా కమామిషు ఏమిటి అనే వీడియో చూస్తే దాని గురించి మనకు దాదాపుగా ఓ సమగ్ర అవగాహన వస్తుంది. ఎయిర్‌పోర్ట్‌లు ఎలా ఆదాయం గడిస్తాయి అనేది అతని మరో వీడియో. బాలీవుడ్‌లో భారీ సినిమాలు ఫ్లాప్ అయినా డబ్బులెందుకు వస్తున్నాయి అనేది మరో వీడియో. స్పష్టంగా, డేటా విజువల్స్‌తో మంచి ఎడిటింగ్‌తో అతను ధారగా చెప్పుకుపోతాడు.
50 లక్షల ఫాలోయెర్లు..
నితిష్ రాజ్‌పుట్ యూట్యూబ్ చానల్‌కు 35 లక్షల మంది సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఇవన్నీ కలిపి మొత్తం 50 లక్షల మంది అతణ్ణి ఫాలో అవుతున్నారు. నితిష్ రాజ్‌పుట్ యూట్యూబ్‌లో ఇప్పటి వరకూ చేసిన వీడియోలకు 25 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోల్లో యాడ్స్ ప్లే అవుతాయి కనుక యూట్యూబ్ నుంచి అలాగే ప్రాడెక్ట్స్ ప్రమోషన్ వల్ల నెలకు అతడు 25 లక్షలు సంపాదిస్తున్నాడు. సంవత్సరానికి 3 కోట్ల ఆదాయం గడిస్తున్నాడు. రెండేళ్లల్లో సాధించిన విజయం అంటే ఆశ్చర్యమే.