Skip to main content

Alakh Pandey Success Story: మొదటి సంపాదన రూ.5 వేలు.. ప్ర‌స్తుతం రూ.5 కోట్లు.. దేశంలో అత్యధికంగా సంపాదిస్తున్న టీచర్ ఈయ‌నే!!

సాధారణంగా ప్రైవేటు టీచర్లంటే చిన్నచూపు ఉంటుంది.
Alakh Pandey Success Story

తక్కువ జీతం ఉంటుందని, పెద్దగా సంపాదన ఉండదని భావిస్తారు. కానీ టీచింగ్‌తోనే ఎడ్‌టెక్‌ సంస్థలు పెట్టి రూ.కోట్లు సంపాదిస్తున్న వారూ ఉన్నారు. వారిలో దేశంలోనే రిచెస్ట్‌ టీచర్‌గా నిలిచిన ఓ వ్యక్తి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..

ప్రస్తుతం ఫిజిక్స్‌వాలా (PhysicsWallah) వ్యవస్థాపకుడు భారతదేశంలో అత్యంత సంపన్న ఉపాధ్యాయుడిగా నిలిచారు. సీఈవో అలఖ్ పాండే (Alakh Pandey). అయితే దేశంలో రిచెస్ట్‌ టీచర్‌ బైజూస్‌ రవీంద్రన్ అని చాలా మంది వాదించవచ్చు. కానీ ఇప్పుడు ఆ టైటిల్‌ ఆయనది కాదు. ఫోర్బ్స్ ప్రకారం బైజూస్ పతనం తర్వాత, దాని నికర విలువ కూడా రూ.830 కోట్లకు పడిపోయింది. అంటే రూ.2000 కోట్ల కంటే ఎక్కువ నెట్‌వర్త్‌ ఉన్న అలఖ్ పాండేనే దేశంలోనే అత్యంత ధనిక ఉపాధ్యాయుడు.

AlakH Pandey

ప్రముఖ ఉపాధ్యాయుడు, ఎంటర్‌ప్రిన్యూర్‌గా పేరొందిన అలఖ్ పాండే సాధారణంగా లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటారు. కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖలో ఈ స్టార్టప్ నమోదై ఆయన వార్షిక వేతనం వెల్లడి కావడంతో వార్తల్లోకి వచ్చారు. భారతీయ టెక్‌, స్టార్టప్‌ సంస్థల సమాచారం అందించే ‘Inc42’ నివేదిక ప్రకారం.. అలఖ్ పాండే వేతనం 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.9.6 కోట్లు. దీంట్లో ఆయన రూ.5 కోట్లను తగ్గించుకున్నారు. అయినప్పటికీ 2023 ఆర్థిక సంవత్సరంలో అలఖ్ పాండే వేతనం రూ.4.57 కోట్లు. ఇంత ఆదాయం ఉన్న అలఖ్ పాండే మొదటి సంపాదన ఎంతో తెలుసా.. కేవలం రూ.5 వేలు. అది కూడా చాలా మంది పిల్లలకు ట్యూషన్లు చెప్పడం ద్వారా వచ్చేది.

Alakh Pandey Success Story

యాక్టర్‌ కావాలనుకున్నాడు..
దేశంలో 101వ యునికార్న్ కంపెనీ ఫిజిక్స్‌వాలాను స్థాపించిన అలఖ్ పాండే ఒక టీచర్‌గానే చాలా మందికి తెలుసు. అయితే యాక్టర్‌ కావాలన్నది తన కల అని ఎంత మందికి తెలుసు? అలహాబాద్‌లో జన్మించిన అలఖ్ పాండే యాక్టర్‌ అవ్వాలనే కోరికతో నుక్కడ్ నాటకాల్లో పాల్గొనేవాడు. అయితే ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో 8వ తరగతి నుంచే ట్యూషన్లు చెప్పడం ప్రారంభించాడు. అలఖ్ పాండే, ఆయన సోదరి చదువుల కోసం వారి తల్లిదండ్రులు తమ ఇంటిని అమ్మేశారు. అలఖ్ పాండే చాలా చురుకైన విద్యార్థి. 10వ తరగతిలో 91 శాతం, 12వ తరగతిలో 93.5 శాతం మార్కులు వచ్చాయి.

Alakh Pandey Success Story

కోటి మందికిపైగా సబ్‌స్క్రైబర్లు..
ఐఐటీలో చేరాలనుకున్న అలఖ్ పాండే కాన్పూర్‌లోని హార్కోర్ట్ బట్లర్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకున్నాడు. అయితే, కోర్సు మూడవ సంవత్సరం తర్వాత కాలేజీ మానేశాడు. 2017లో యూపీలో ఒక చిన్న గది నుంచి యూట్యూబ్ వీడియోలను రూపొందించడం ప్రారంభించాడు. కోవిడ్‌ మహమ్మారి సమయంలో అలాఖ్ పాండే వీడియోలు చాలా విజయవంతమయ్యాయి. ఎంతగా అంటే ఓ ఎడ్-టెక్ కంపెనీని ప్రారంభించేంతలా. ఇందులో ఇప్పుడు 500 మందికి పైగా టీచర్లు, 100 మంది టెక్నికల్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. యూట్యూబ్‌లో ఫిజిక్స్‌వాలా చానల్‌కు కోటి మందికిపైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

Anandi Singh Rawat: పిల్లల మనసులను చదవాలి.. వారిని అర్థం చేసుకోవడమే ముఖ్యం

Published date : 15 Feb 2024 05:19PM

Photo Stories