Geochemistry Job opportunities: జియో కెమిస్ట్రీ రంగంలో ఉద్యోగ అవకాశాలు మెండు
విజయనగరం అర్బన్: భూవిజ్ఞాన, రసాయనిక శాస్త్రాలపై పరిశోధన చేసిన వారికి ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ టీవీ కట్టిమణి అన్నారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో ‘వికసిత భారత్ –2047 ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ జియో కెమిస్ట్రీ అండ్ జియో కెమికల్ ఎనాలిసిస్ అనే అంశాలపై’ గురువారం నిర్వహించిన ఒక్క రోజు సదస్సును ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం 2020 ద్వారా మల్టీడిస్సిప్లినరీ విద్యా ప్రాధాన్యత సంతరించుకుందని ఈ అవకాశాన్ని యువత అంది పుచ్చుకోవాలని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ ఎన్‌జీఆర్‌ఐ విశ్రాంత ఎమిరిటస్ సైంటిస్ట్ డాక్టర్ బలరాం మాట్లాడుతూ భూవిజ్ఞాన శాస్త్రంలో ముఖ్య భాగమైన జియో కెమికల్ సైన్స్ విద్యార్థులకు, పరిశోధకులకు, పర్యావరణ ప్రేమికులకు భూరసాయనిక శాస్త్ర అధ్యాపకులు ఎదుర్కొనే సమస్యలను సమాధానం చెబుతుందన్నారు.
కార్యక్రమంలో జియాలజీ విభాగ సహాయ అధ్యాపకుడు ప్రతిష్టాత్మక స్ప్రింగర్ పబ్లికేషన్ ద్వారా సంకలనం చేసి ప్రచురించిన ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇన్ వాటర్ సప్లై కన్సర్వేషన్ అండ్ మేనెజ్‌మెంట్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైస్ చాన్సలర్ సంకలన కర్త డాక్టర్ ప్రసాద్‌ను అభినందించారు.
జియాలజీ విభాగాధిపతి డాక్టర్ కలిదిండి సురేష్‌బాబు, ఉమెన్స్ సెల్ చైర్‌పర్సన్ డాక్టర్ పరికిపండ్ల శ్రీదేవి, డాక్టర్ లతాకల్యంపూడి, డీన్ ప్రొఫెసర్ శరత్ చంద్రబాబు, ఏఓ డాక్టర్ ఎన్‌వీ సూర్యనారాయణ, డాక్టర్ గంగునాయుడు, డాక్టర్ బాలుమూరి వెంకటేశ్వర్లు, డాక్టర్ పడాల కిషోర్, డాక్టర్ నారాయణ, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.