Work From Home Town: వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్
ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని అన్ని పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రాల్లో 25 డబ్ల్యూఎఫ్‌హెచ్‌టీలను అమల్లోకి తీసుకువస్తున్నట్లు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలు మరో రెండేళ్లపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు వారి సొంత ఊళ్ల నుంచే పని చేసుకునేలా.. 30 మంది కూర్చునే విధంగా కోవర్కింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. 30 డెస్క్‌టాప్‌లు, హైస్పీడ్ ఇంటర్‌నెట్, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, డేటా భద్రత వంటి అన్ని వసతులతో కోవర్కింగ్ స్టేషన్లు ఉంటాయి. తొలి దశలో ఏపీ నైపుణ్యాభివృద్ధికి చెందిన సీఎం ఎక్స్‌లెన్స్ సెంటర్లు, ఏపీ ఇన్నోవేటివ్ సొసైటీ కేంద్రాలను వినియోగించుకుంటారు. మూడు నెలలపాటు వాటి పనితీరు పరిశీలిస్తారు. తర్వాత మరిన్ని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కోవర్కింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు.
మూడు దశల్లో అమలు
కంపెనీలకు, ఉద్యోగులకు ప్రయోజనం కలిగేలా వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ విధానాన్ని మూడు దశల్లో అమలు చేయడానికి ఐటీ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. నిర్వహణ వ్యయం తగ్గించుకునేలా అందుబాటులో ఉన్న నైపుణ్యాభివృద్ధి, ఇన్నోవేషన్ సొసైటీ, ఇంజనీరింగ్ కళాశాలలు, గ్రామ డిజిటల్ లైబ్రరీలు, ఏపీఐఐసీ భవనాలను వినియోగించుకోనున్నారు. ఈ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించడానికి ఒక్కో కేంద్రానికి రూ.6,67,500 మూలధన వ్యయమవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. అలాగే ఒక్కో కేంద్రం నిర్వహణకు ప్రతి నెలా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో రూ.1,25,000, తృతీయ శ్రేణి పట్టణాల్లో రూ.1,04,000 వ్యయమవుతుందని అంచనా. వడ్డీ చెల్లింపులతో కలుపుకొని ప్రతి సీటు నిర్వహణకు లాభాపేక్ష లేకుండా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో రూ.4,600, తృతీయ శ్రేణి పట్టణాల్లో రూ.3,900 వ్యయమవుతుందని అంచనా.