Polytechnic College: డోన్‌లో ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల
నంద్యాల(సెంట్రల్): ఉద్యాన రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మరోసారి రుజువైంది. నంద్యాల జిల్లాలో డోన్ ప్రాంతం ఉద్యాన పంటల సాగుకు పేరుగాంచింది. అయితే అన్నదాతలు సాధించిన దిగుబడుల్లో వృథా ఎక్కువ ఉండటంతో పాటు, నిల్వ, ప్రాసెసింగ్, పంపిణీ, వినియోగంలో సరైన నైపుణ్యాలు లేక గిట్టుబాటు ధరలు పొందలేకపోతున్నారు. ఈ ప్రతికూలతలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ మేలిమి ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా డోన్ ప్రాంతంలో రైతులు కోత అనంతరం ఎదుర్కొంటున్న సమస్యల్ని క్షుణ్నంగా పరిశీలించి తగు నివేదిక ఇవ్వాలని వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ (వెంకటరామన్న గూడెం–పశ్చిమ గోదావరి)ను ఆదేశించింది. ఆయన క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసి ఓ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేశారు. నివేదికలోని అంశాల్ని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం డోన్‌లో ఉద్యాన ఆహారశుద్ధి పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించి అందుకు సంబంధించిన జీవో–7 ను శుక్రవారం విడుదల చేసింది. ఈ మేరకు ప్రధాన కమిషనర్ (ఆర్‌బీకేలు), ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సంబంధిత ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా ఇది ఏర్పాటు కానుంది.