Aided Schools : త్రీమెన్ కమిటీ ఏర్పాటు.. విద్యాశాఖ ఆదేశాలు!!

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుకోవాలని గత మూడేళ్లుగా చెబుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎయిడెడ్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులను పాఠశాల విద్య డైరెక్టరేట్ ఆదేశించింది.
త్రీమెన్ కమిటీ
2024-25 విద్యా సంవత్సరం యూడైస్ ఆధారంగా 40 కంటే ఎక్కువ మంది విద్యార్థులను పెంచుకోలేని ఎయిడెడ్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అలాంటి స్కూళ్లపై ఇప్పటికే చర్యలు తీసుకుని ఉంటే నివేదిక పంపాలని కోరింది. దీంతోపాటు ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పరిశీలించేందుకు మండల స్థాయిలో త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఇందులో డీవైఈవో, ఎంఈవో, సీనియర్ హెచ్‌ఎం సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే యూడైస్, వాస్తవ హాజరులో తేడా ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు ఎయిడెడ్ పాఠశాలల్లోని ప్రవేశ రిజిస్టర్లు, విద్యార్థుల రికార్డులను ఒకటికి రెండుసార్లు త్రీమెన్ కమిటీ పరిశీలించనుంది.
595 ఎయిడెడ్ పాఠశాలలు..
త్రీమెన్ కమిటీ ఇచ్చే సమాచారం ఆధారంగా జిల్లా అధికారులు పాఠశాలలు, మండలాలు, జిల్లాల వారీగా వాస్తవ హాజరు నమోదు ఎంత అనేది నిర్ధారించి రాష్ట్ర పాఠశాల విద్య డైరెక్టరేట్‌కు నివేదిక అందిస్తారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 595 ఎయిడెడ్ పాఠశాలలు కొనసాగుతుండగా, 3,010 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 40 మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్లు 126 కాగా, అసలు విద్యార్థులే లేకుండా 80 స్కూళ్లు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కూళ్లపై విద్యాశాఖ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
'ఎయిడెడ్ టీచర్లకు న్యాయం చేయాలి'
ఎయిడెడ్ ఉపాధ్యాయులను స్థానిక ప్రభుత్వ పాఠశాలలకు బదలాయించి న్యాయం చేయాలని, మొత్తం ఎయిడెడ్ సెక్టార్‌ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ కోరారు. ఎయిడెడ్ స్కూళ్లల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలకు సర్దుబాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.చిట్టిబాబు, ఎల్‌కే చిన్నప్ప, ప్రతినిధి సీహెచ్ ప్రభాకర్‌రెడ్డి కోరారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- aided schools
- AP government
- Education Department
- number of students in aided schools
- three men committee
- aided schools and teachers
- ap aided schools
- students education
- ap government orders
- aided school teachers request
- transfer of aided school teachers
- ap govt school teachers
- Local government school
- teachers counselling
- Andhra Pradesh Teachers Guild
- AP Aided Schools
- Education News
- Sakshi Education News