Skill Hub Centres: నిరుద్యోగ యువతకు బాసట.. 1537 మంది నిరుద్యోగ యువత శిక్షణ
నరసన్నపేట: స్కిల్ హబ్ సెంటర్లు నిరుద్యోగ యువతకు బంగారు బాటను చూపిస్తున్నాయి. ఉన్నత చదువులతో పాటు టెన్త్ నుంచి డిగ్రీ, పీజీ చేసి ఉద్యోగాన్వేషణలో విసిగి వేసారిన గ్రామీణ యువతకు ఈ స్కిల్ హబ్ కేంద్రాలు చుక్కానిలా నిలిచాయి. నరసన్నపేటతో పాటు మిగిలిన 7 నియోజకవర్గ కేంద్రాల్లో స్కిల్ హబ్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు.
454 మందికి ప్లేస్‌మెంట్లు
జిల్లాలో గత ఏడాది ఫిబ్రవరి 16 నుంచి స్కిల్ హబ్ కేంద్రాలు నడుస్తున్నాయి. ఇప్పటి వరకూ 1537 మంది నిరుద్యోగ యువత శిక్షణ పొందగా 885 మంది వివిధ రంగాల్లో అసెస్‌మెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 454 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. వీరు విశాఖపట్నంతో పాటు ఇతర పట్టణాల్లో పలు కంపెనీల్లో పనిచేస్తున్నారు. ఒక్కొక్కరూ నెలకు రూ. 12 వేల నుంచి రూ. 30 వేల వరకూ జీతం తీసుకుంటున్నారని నైపుణ్యాభివృద్ధి అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 8 కేంద్రాల్లో 380 మంది శిక్షణ పొందుతున్నారు.
10 కేటగిరీల్లో శిక్షణ..
స్కిల్ హబ్ కేంద్రాల్లో ప్రస్తుతం 10 కేటగిరీల్లో యువతకు శిక్షణ ఇస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్స్, బీపీఓ, సేవింగ్ మిషన్ ఆపరేటర్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్స్, ఫిట్టర్ ఫేబ్రికేషన్, ఫోర్ వీలర్స్ టెక్నిక్స్‌తో పాటు మరో మూడు కేటగిరీల్లో శిక్షణ లభిస్తోంది.