Skip to main content

Inspirational Story: రూపాయి ఖర్చు లేకుండా స్కాట్లాండ్‌కు.... బంపర్‌ చాన్స్‌ కొట్టిన తెలంగాణ అమ్మాయిలు

కలలో కూడా ఊహించని అదృష్టం ఆ అమ్మాయిలకు దక్కింది. మన భాషలో చెప్పాలంటే నక్కతోక తొక్కినట్లే. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా స్కాట్లాండ్‌కు వెళ్లే చాన్స్‌ దక్కించుకున్నారు.

రెండు వారాల పాటు అక్కడ పర్యటించనున్నారు. వీసా, ఫ్లైట్‌ ఖర్చులు, వసతి, రవాణా ఖర్చులు.... ఇలా అన్నీ ఫ్రీనే. ఆ విద్యార్థులు ఎవరు... ఎలా ఫ్రీగా చాన్స్‌ దక్కించుకున్నారో తెలుసుకుందామా..!
15 మంది విద్యార్థినులు... ఇద్దరు ఫ్యాకల్టీ
తెలంగాణ ప్రభుత్వం, బ్రిటిష్‌ కౌన్సిల్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన స్టడీ ప్రోగామ్‌కు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నుంచి 15 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నుంచి ఐదుగురు, సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడిన్షియల్‌ కాలేజీల నుంచి ఐదుగురు, ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ కళాశాలల నుంచి మరో ఐదుగురు చొప్పున ఎంపిక చేశారు. అలాగే వీరితో పాటు ఇద్దరు ఫ్యాకల్టీ కూడా స్కాట్లాండ్‌కు వెళ్లనున్నారు.

British Council


పూర్తిగా మెరిట్‌ ఆధారంగానే..!
డిగ్రీ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థులను ఈ ప్రోగ్రామ్‌కి ఎంపిక చేశారు. ఫస్ట్‌ ఇయర్‌లో అత్యంత ప్రతిభ కనబర్చిన టాప్‌ 15 మందిని సెలెక్ట్‌ చేశారు. వీరంతా అమ్మాయిలే కావడం విశేషం. ఎంపికైన విద్యార్థినులంతా చిన్న నాటి నుంచి ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లోనే చదువుకోవడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.
14 రోజుల పాటు సర్టిఫైడ్‌ కోర్సు!
స్కాలర్‌షిప్‌ ఫర్‌ ఔట్‌ స్టాండింగ్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ టాలెంట్‌(స్కౌట్‌) ప్రోగ్రామ్‌కు ఎంపికైన వీరంతా రెండు వారాల పాటు స్కాట్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ గ్లాస్గోలో ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేయనున్నారు. అక్కడ ‘‘హౌ టు బీ మోర్‌ రేషనల్‌: క్రిటికల్‌ థింకింగ్, లాజిక్‌ అండ్‌ రీజనింగ్‌’’ అంశంపై సర్టిఫైడ్‌ కోర్సును అభ్యసించనున్నారు. 
మొదటగా తెలంగాణలోనే....!
బ్రిటిష్‌ కౌన్సిల్‌ దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంతోనే భాగస్వామ్యం చేసుకుంది. ఫస్ట్‌ ఇయర్‌ కేవలం 15 మందిని మాత్రమే ఎంపిక చేశారు. వచ్చే ఏడాది నుంచి ఈ సంఖ్యను పెంచే అవకాశాలు ఉన్నాయి. అలాగే యూనివర్సిటీలలో చదివే డిగ్రీ విద్యార్థులకు కూడా అవకాశం కల్పించాలనే డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.

Published date : 04 Feb 2023 07:08PM

Photo Stories