Flagship Exams: యూపీఎస్‌సీ ఆధ్వర్యంలో ఫ్లగ్‌షిప్ పరీక్షలు.. షెడ్యూల్ ఇలా..!
అనంతపురం అర్బన్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈనెల 21న జరగనున్న ఫ్లాగ్‌షిప్ పరీక్షలు అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జెడ్పీ సీఈఓ వైఖోమ్ నిదియాదేవి, నగర పాలక కమిషనర్ మేఘ స్వరూప్, డీఆర్‌ఓ జి.రామకృష్ణారెడ్డితో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు సెషన్లుగా జరిగే నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ), నావెల్ అకాడమీ (ఎన్‌ఏ) పరీక్షకు 187 మంది, మూడు సెషన్లుగా జరిగే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ (సీడీఎస్) పరీక్షకు 136 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. కేఎస్‌ఎన్ ప్రభుత్వ యూజీ, పీజీ బాలికల కళాశాల కేంద్రంగా ఎన్‌డీఏ, ఎన్‌ఏ పరీక్ష పేపర్–1 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్–2 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరుగుతుందన్నారు. జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కేంద్రంగా సీడీఎస్ పరీక్ష పేపర్–1 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు, పేపర్–2 మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు, పేపర్–3 మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరుగుతుందన్నారు.
M. Tech Results: ఎంటెక్ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..
పరీక్షల నిర్వహణకు ప్రత్యేకంగా అధికారులను నియమించామన్నారు. కేంద్రాల వద్ద జామర్లను ఒకరోజు ముందే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జామర్ల ఏర్పాటుకు బీఈఎల్ ప్రతినిధి ఉత్తమ్‌ను యూపీఎస్‌సీ నియమించిందన్నారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు నిర్దేశిత సమయం కంటే అర గంట ముందే చేరుకోవాలని సూచించారు. కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, స్మార్ట్, డిజిటల్ గడియారాలు, పుస్తకాలు అనుమతించమన్నారు. ఈ–అడ్మిట్ కార్డు చూపిస్తేనే కేంద్రాల్లోకి అనుమతిస్తారని స్పష్టం చేశారు.