Skip to main content

UPSC Civil Services Final Results 2023: నాలుగుసార్లు ఫెయిల్‌.. ఐదో ప్రయత్నంలో సివిల్స్‌ సాధించిన కానిస్టేబుల్‌ కుమార్తె

UPSC Civil Services Final Results 2023

బోనకల్‌: తండ్రి ప్రోత్సాహానికి తోడు అపజయాలు ఎదురైనా వెనుదిరగని పట్టుదల ఆమెను విజేతగా నిలబెట్టింది. సివిల్స్‌లో నాలుగు పర్యాయాలు విజయం దరి చేరకున్నా కుంగిపోకుండా మరింత శ్రద్ధగా సిద్ధం కావడంతో బోనకల్‌ మండలం గోవిందాపురం(ఎల్‌) గ్రామానికి చెందిన రావూరి అలేఖ్య ఐదో పర్యాయం 938వ ర్యాంకు సాధించింది. బుధవారం యూపీపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో ఆమె ర్యాంకు సాధించినట్లు వెల్లడి కాగా స్వగ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

కానిస్టేబుల్‌ కుమార్తె
గోవిందాపురం(ఎల్‌)కు చెందిన రావూరి ప్రకాశరావు మధిర టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రకాశ్‌రావు – పద్మశ్రీ దంపతుల కుమార్తె అలేఖ్య ప్రాథమిక విద్య ఖమ్మంలోని త్రివేణి స్కూల్‌, తల్లాడ, నేలకొండపల్లి, కొత్తూరులోని ప్రైవేట్‌ స్కూళ్లలో పూర్తిచేశారు. తండ్రి ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో చదివిన ఆమె ఇంటర్మీడియట్‌ విజయవాడలోని శ్రీచైతన్య కాలేజీలో, ఉస్మానియా యూని వర్సిటీ బీఏ పూర్తిచేశాక వారణాసిలోని బెనారస్‌ యూనివర్సిటీ నుంచి రూరల్‌ డెవలప్‌మెంట్‌లో పీజీ చదివి గోల్డ్‌మెడల్‌ సాధించింది.

అనంతరం హైదరాబాద్‌లో సీబీసీఎస్‌బీలో సివిల్స్‌ కోచింగ్‌ తీసుకున్న అలేఖ్యకు నాలుగు పర్యాయాలు విజయం దక్కలేదు. అయితే, ఆమెను తండ్రి ప్రకాశ్‌రావు అడుగడుగునా ప్రోత్సహించడంతో పాటు ఐఏఎస్‌ కావాలనే చిన్నప్పటి లక్ష్యం, పేదలకు సేవ చేయాలనే తపనతో మరింత పట్టుదలతో సిద్ధమై 938వ ర్యాంకు సాధించింది. కాగా, అలేఖ్యకు ఎస్టీ కేటగిరిలో ఐపీఎస్‌ వచ్చే అవకాశముందని తెలిసింది. కాగా, ఆమెను ఎంపీలు నామా నాగేశ్వరావు, వద్దిరాజు రవిచంద్ర, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, జెడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, బోనకల్‌ ఎస్సై మధుబాబు తదితరులు అభినందించారు.

Published date : 17 Apr 2024 10:31AM

Photo Stories