School teacher wears student uniform: అచ్చం విద్యార్థుల్లాగే యూనిఫాం ధరిస్తోన్న టీచర్... వైరల్‌గా మారిన రాయపూర్ స్కూల్ వీడియో
రాయ్‌పూర్ (చత్తిస్‌గఢ్)లోని గోకుల్‌రామ్ వర్మ ప్రైమరీ స్కూల్ అనే ప్రభుత్వబడిలో వారమంతా పిల్లలు ఉత్సాహంగా ఉంటారు. శనివారం ఇంకా ఉత్సాహంగా ఉంటారు. దానికి కారణం ఆ రోజు ఆ స్కూల్ టీచర్ జాహ్నవి యదు వారిలాగే తయారయ్యి వారిలాగే యూనిఫామ్ వేసుకుని వస్తుంది. ఆ రోజు కుర్చీలో కూచోదు. వారి మధ్య కూచుని పాఠాలు, కబుర్లు చెబుతుంది. వారితో సంభాషిస్తుంది. అందుకే పిల్లలందరికీ జాహ్నవి యదు టీచర్ అంటే ఇష్టం.
ఇవీ చదవండి: ఉద్యోగాలు కోల్పోనున్న కోటి మంది మహిళలు... ఏఐతో వీరికి తప్పని ముప్పు...!
కొత్త ఆలోచన
గోకుల్ రామ్ వర్మ ప్రైమరీ స్కూల్‌లో 1 నుంచి 5 వరకూ చదివే 350 మంది పిల్లలు ఉన్నారు. వారంతా ఆ చుట్టుపక్కల బస్తీవాసుల పిల్లలు. వారి తల్లిదండ్రులకు పెద్దగా చదువు లేదు. పిల్లలకు క్రమశిక్షణ అంటే తెలియదు. స్కూల్‌కు రోజూ రావడం ఇష్టం ఉండదు. యూనిఫామ్ వేసుకోరు. గత సంవత్సరం ఇదే బడిలో టీచర్‌గా చేరిన 30 ఏళ్ల జాహ్నవి యదు ఇదంతా గమనించింది. వారితో తిప్పలు పడింది. దారిలో పెట్టలేక సతమతమయ్యింది. ఈ సంవత్సరం అంటే 2023 జూన్‌లో స్కూల్ రీ ఓపెన్ అయినప్పుడు జాహ్నవి యదు కొత్త ఆలోచన చేసింది.
ఇవీ చదవండి: కూలీనాలీ చేసుకుంటూ చదువుకున్నా.. ఇప్పుడు గర్వంగా పీహెచ్‌డీ సాధించా...
హఠాత్తుగా ఒకరోజు వారిలాగా యూనిఫామ్ వేసుకుని వచ్చింది. పిల్లలు ఆశ్చర్యపోయారు. గుమిగూడారు. నవ్వారు. ఆనందించారు. ‘ఎందుకు టీచర్ ఇలా వేసుకొచ్చావ్’ అనంటే ‘స్కూల్‌కి మీరు ఇలాగే రావాలి. అందుకని వేసుకొచ్చా. మనందరం ఒక టీమ్. మనందరం సూపర్‌గా చదువుకోవాలి’ అని వారిని ‘మనం’ చేశాక వాళ్లు సంతోషించారు. టీచర్‌లా యూనిఫామ్ వేసుకురావాలని వారికీ అనిపించింది. టీచర్ కోసం రోజూ స్కూల్‌కి రావాలని కూడా.
అన్నీ ప్రశంసలే
జాహ్నవి యదు వారానికి ఒకరోజు అంటే ప్రతి శనివారం స్కూల్ యూనిఫామ్‌లో రావడం రాయ్‌పూర్ అంతా పెద్ద వార్త అయ్యింది. జాహ్నవి యదు చర్య వల్ల పిల్లలు బెరుకు లేకుండా తమ మనసుల్లో ఉన్నది చెప్పుకుంటున్నారని స్కూల్ అనేది టీచర్లు చావబాదే స్థలం కాదని తెలుసుకుని క్లాసులకు హాజరవుతున్నారని ఊరు మొత్తం తెలిసింది. అందరూ జాహ్నవి యదును అభినందిస్తున్నారు. ‘టీచర్లూ పిల్లలూ బడిలో సమానమే అనే భావన వ్యాప్తి చేయడమే నా ఉద్దేశం’ అని జాహ్నవి యదు చెప్పింది. అయితే ఇలాంటి బట్టల్లో రావడానికి ఆమె కొంచెం ఆలోచించింది– అత్తామామలు ఏమంటారోనని. కాని వారు అంగీకరించి దూసుకుపో కోడలు పిల్లా అని ఉత్సాహపరిచారు. దాంతో జాహ్నవి యదు పిల్లలతో ఆడిపాడుతున్నట్టుగా కనిపిస్తూ వారికి పాఠాలు చెబుతూ దారిలో పెడుతోంది.
ఇవీ చదవండి: కళ్లులేవని వెక్కిరించారు... లెక్కచేయక లక్ష్యాన్ని చేరుకుని ఆదర్శంగా నిలుస్తున్నారిలా...
ఫేవరెట్ టీచర్
కొందరు టీచర్లు తమ కెరీర్ మొత్తం ఏ క్లాస్‌కీ ఫేవరెట్ టీచర్ కాకుండానే రిటైర్ అయిపోతారు. కొందరు టీచర్లు ప్రతి సంవత్సరం ఎంతోమంది పిల్లలకు ఫేవరెట్ టీచర్ అవుతారు. పిల్లలతో బంధం వేసుకోవడం టీచర్‌కు చాలా ముఖ్యం. అందులో ఎంతో ఆత్మతృప్తి ఉంటుంది. ఇప్పుడు స్కూల్ మొత్తానికి ఫేవరెట్ టీచర్ అయిన జాహ్నవి యదుని చూసి తాము కూడా పిల్లల కోసం ఏదైనా చేద్దామా అనుకుంటున్నారు మిగిలిన టీచర్లు. అది చాలదూ?