14న మెగా జాబ్‌మేళా
ఈ జాబ్‌మేళాను స్థానిక సీబీఎస్‌ఈ పాఠశాల జ్ఞానభారతిలో ఉదయం 9 గంటల నుంచి నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ జాబ్‌మేళాలో సుమారుగా 16 కంపెనీలు 1300 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయని వివరించారు. ఈ జాబ్‌మేళాలో విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఎన్‌సీసీ విద్యార్థులకు
ప్రశంసా పత్రాలు
టెక్కలి: దేశ రక్షణ విభాగంలో చేరాలనే యువ త ఆలోచనకు మొదటి మెట్టు ఎన్‌సీసీ అని కమాండింగ్ అధికారి అమిత్‌బెనర్జీ అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం నుంచి 5 బెటాలియన్లకు చెందిన 731 మంది ఎన్‌సీసీ విద్యార్థులకు టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో గత వారం రోజులుగా జరుగుతున్న ఎన్‌సీసీ శిక్షణ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కమాండింగ్ అధికారి అమిత్ బెనర్జీ చేతుల మీదుగా ఎన్‌సీసీ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెడల్స్‌ను అందజేశారు. కార్యక్రమంలో సుభేదార్ సుభాష్‌చంద్, ట్రైనింగ్ అధికారి నానాజీ, క్యాంప్ డిప్యూటీ కమాండెంట్ లెఫ్టినెంట్ వై.పోలినాయుడు, డి.విష్ణుమూర్తి, టి.సోమేశ్వరరావు, బి.రేవతి, బి.శరత్‌కుమార్, డి.పుష్పలత పాల్గొన్నారు.
ఆదిత్యునికి విశేష పూజలు
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణమూర్తిని ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. ఎండల వల్ల భక్తులు ఇబ్బంది పడ్డారు. అయితే ఇన్‌చార్జి సూపరింటెండెంట్ కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో సిబ్బంది తగు చర్యలు చేపట్టారు. విశిష్ట, ప్రత్యేక దర్శనాల క్యూలైన్లతో పాటు ఉచిత దర్శనాల క్యూలైన్ల వద్ద మంచినీరు, ఉచితంగా మజ్జిగలను పంపిణీ చేశారు. అలాగే ఆలయంలోపల మండపం వద్ద ఉచిత ప్రసాదాలను అందజేశారు. ఆలయ మండపాల్లోనూ, బయట మండపంలోనూ ఆరోగ్యం కోసం సూర్యనమస్కార పూజలు చేయించుకున్నారు. ఆలయ పాలక మండలి సభ్యులు ద్వారపు అనూరాధ కుటుంబంతో సహా ఆదిత్యున్ని దర్శించుకుని భక్తులకు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. ఆదివారం ఒక్కరోజున ఆలయానికి రూ.6,22,719 వరకు ఆదాయం లభించినట్లుగా ఇన్‌చార్జి సూపరింటెండెంట్ కృష్ణమాచార్యులు తెలియజేశారు. వివిధ దర్శనాల టిక్కెట్ల విక్రయాల ద్వారా రూ.3,51,700, విరాళాలు రూపంలో రూ.56,019, ప్రసాదాల రూపంలో రూ.2.15 లక్షలు వరకు ఆదాయం లభించినట్లుగా చెప్పారు.
క్రీడలకు ప్రాధాన్యత
ఎచ్చెర్ల క్యాంపస్: విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం (ట్రిపుల్ ఐటీ) రాష్ట్ర చాన్స్‌లర్ కేసీ రెడ్డి అన్నారు. గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న అంతర ట్రిపుల్ ఐటీ విశ్వవిద్యాలయాల స్పోర్ట్స్ మీట్ ఆదివారం ముగిసింది. ఈ టోర్నమెంట్‌లో క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ క్రీడాంశాల్లో పురుషులకు క్రీడల పోటీలు నిర్వహించగా, ఇడుపులపాయ, నూజివీడు, శ్రీకాకుళం, ప్రకాశం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ల జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో వాలీబాల్, కబడ్డీ క్రీడల్లో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ జట్టు విజేతగా నిలిచింది. క్రికెట్ పోటీల్లో ఇడుపులపాయ జట్టు విజేతగా నిలిచింది. ఇక్కడ ఉత్తమ ప్రదర్శన ఆధారంగా ఏర్పాటు చేసిన జట్లను జాతీయ, సౌత్‌జోన్ పోటీలకు పంపిస్తారు. విజేతలకు ట్రోఫీలను అందజేసిన చాన్స్‌లర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్రీడల్లో రాణించే వారికి మంచి గుర్తింపు, భవిష్యత్ ఉంటుందని వివరించారు.
బృందావనంలో అష్టమి వేడుకలు
గార: రామచంద్రాపురం పంచాయతీ జొన్నలపాడు కాలనీ సమీపంలోని బృందావనంలో ఆదివారం అష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. ముందుగా శ్రీకృష్ణునికి క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు చౌదరి దుర్గారావు దంపతులు నిర్వహించారు. అనంతరం శ్రీకాకుళం నగరానికి చెందిన సింహాద్రి శ్రీనివాస్ బృందంచే భజన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి శ్రీరంగం మధుసూదనరావు పాల్గొన్నారు.