Korukonda Sainik School: ప్రగతిపథంలో కోరుకొండ సైనిక్ స్కూల్
![Korukonda Sainik School in progress Students of Korukonda Sainik School excelling in all fields](/sites/default/files/images/2024/06/25/sainik-school-1719307252.jpg)
విజయనగరం రూరల్: కోరుకొండ సైనిక్ స్కూల్ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, పాఠశాల పురోగతి బాగుందని తూర్పునౌకాదళం(విశాఖ) కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ రాజేష్ పెంథాల్కర్ అన్నారు. కోరుకొండ సైనిక్ స్కూల్‌లో సోమవారం నిర్వహించిన స్కూల్ 135వ లోకల్ బోర్డు ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ ఏడాది పాఠశాల విద్యాభివృద్ధికి తీసుకుబోయే చర్యలు, పరిపాలనా అంశాలపై చర్చించారు. పలు నిర్ణయాలు తీసుకున్నారు. బోర్డు పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ, యూపీఎస్సీ, క్రీడల్లో సాధించిన విజయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎన్‌డీఏ ప్రవేశాలకు సంబంధించిన విజయాలపై ప్రశంసలు కురిపించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో ఉన్న స్విమ్మింగ్ పూల్, విద్యార్థినుల కోసం నిర్మించిన భవనం, ఆల్మెడా హాల్, మోటివేషన్ హాల్, సైకోర్ మ్యూజియం తదితర భవనాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రాజేష్ పెంథాల్కర్‌కు ప్రిన్సిపాల్, గ్రూప్ కెప్టెన్ ఎస్.ఎస్.శాస్త్రి జ్ఞాపికను అందజేశారు. సమావేశంలో లెఫ్ట్‌నెంట్ జనరల్ కె.జి.కృష్ణ, డీఆర్వో డి.అనిత, డీటీఅండ్ ఏఓ ఆర్.కుమార్, డిప్యూటీ డీఈఓ కె.వాసుదేవరావు, ఏయూ రిజిస్ట్రార్ ఎం.జేమ్స్ స్టీఫెన్, కోరుకొండ సైనిక్ స్కూల్ హెచ్‌ఎం కేశవన్, నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్ వి.దుర్గప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.