Skip to main content

IT Employees: ఉద్యోగులకు ఏమైంది..? కంపెనీ ఎందుకు మారడం లేదు..

IT Employees   Impact of global uncertainties on IT sector
IT Employees

ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు 2-3 ఏళ్లు కుదురుగా ఒక కంపెనీలో పనిచేశాక సంస్థ మారడం ఆనవాయితీగా వస్తోంది. అందుకు చాలాకారణాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా కొత్త కంపెనీ భారీగా వేతనం ఆఫర్‌ చేస్తుండడమే. కానీ ప్రస్తుత రోజుల్లో ఆ పద్ధతి మారుతోంది. రెండేళ్ల క్రితం వరకైతే ఐటీ ఉద్యోగులు తరచూ కంపెనీలు మారుతూ ఉండేవారు. ఇప్పుడు ఈ ధోరణిలో మార్పు కనిపిస్తోంది. గతంలో లాగా కంపెనీ మారినప్పుడు, వేతనాల్లో పెంపు భారీగా ఉండకపోవడంతో ఉద్యోగులు సంస్థలు మారడం లేదని తెలుస్తుంది.

అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో ఐటీ పరిశ్రమ ప్రస్తుతం విభిన్న పరిస్థితులను ఎదుర్కొంటోంది. కొత్తగా వస్తున్న ప్రాజెక్టులు తగ్గడంతో నియామకాలు తగ్గిస్తున్నారు. కొన్ని విభాగాల్లో చూస్తే, కావాల్సిన నిపుణుల లభ్యతా తక్కువగానే ఉంటోంది. కృత్రిమ మేధ (ఏఐ), ప్రాంప్ట్‌ ఇంజినీరింగ్‌, మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), డేటా అనలిటిక్స్‌ నిపుణులకు ఇప్పుడు గిరాకీ పెరుగుతోంది. మరో వైపు, అమెరికాలాంటి దేశాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాల కోత మొదలయ్యింది. 

జీతం పెరగకపోయినా అదే కంపెనీలో..
చాలాకాలంపాటు ఒకే కంపెనీలో పనిచేస్తే వేతనం పెద్దగా పెరగదు అని ఐటీ నిపుణులు భావిస్తుంటారు. అందుకే, తరచూ ఉద్యోగాలు మారేందుకు సిద్ధం అవుతారు. సంస్థలు మారినప్పుడల్లా 15-20 శాతం వేతనం అధికంగా వచ్చేలా చూసుకుంటారు. ఇప్పుడా పరిస్థితులు మారాయి. నియామకాలు అంతగా లేకపోవడంతో, ఉన్న కంపెనీలో కొనసాగేందుకే ప్రయత్నిస్తున్నారు. అధునాతన నైపుణ్యాలున్న వారికి మాత్రం ఈ బాధ లేదు. ఏఐ, ఎంఎల్‌ నైపుణ్యాలున్న వారికి, సంప్రదాయ కోడింగ్‌లో మంచి పట్టు ఉన్న వారికీ మంచి అవకాశాలు వస్తున్నాయి.

ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఎంత..?
ఐటీ రంగంలో ఉద్యోగాలు తగ్గుతున్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఇది 2019 స్థాయిలోనే ఉన్నాయని ఐటీ రంగ నిపుణులు వెల్లడించారు. 2020 తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అధిక సంఖ్యలో ఐటీ ఉద్యోగాల సృష్టి జరిగింది. ఆ తర్వాత క్రమంగా ఇవి నెమ్మదించాయి. ముఖ్యంగా ఫ్రెషర్ల(తాజా ఉత్తీర్ణుల) నియామకంపై ప్రభావం కనిపిస్తోంది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి అని అనుకుంటున్నారు. కృత్రిమ మేధ(ఏఐ) అన్ని రంగాల్లోనూ విస్తరిస్తోంది. ఇది కొత్త ఉద్యోగాలను సృష్టిస్తోంది మినహా, ఉన్న ఉద్యోగాలను తగ్గించే స్థాయికి చేరుకోలేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. 

కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిందే..
మారుతున్న ప్రాజెక్ట్‌లు, టెక్నాలజీ కారణంగా పాత ఉద్యోగులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏటా కొత్తగా ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్నారు. వీరు ఇప్పటికే కొత్త తరం సాంకేతికతలను నేర్చుకుంటున్నారు. దీంతో పాత వారికి వీరి నుంచి పోటీ ఎదురవుతోంది. మరోవైపు గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన వారు, తొందరగా ఏదో ఒక ఉద్యోగంలో చేరాలని భావిస్తున్నారు.

Published date : 18 Mar 2024 01:47PM

Photo Stories