Free education in private schools: పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్స్‌లో ఉచిత విద్య
భీమవరం: ప్రైవేట్ పాఠశాలల్లో విద్యనభ్యసించాలనుకునే పేదలకు ఫీజుల భారం లేకుండా ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉచితంగా విద్యనభ్యసించే అవకాశం ప్రభుత్వం కల్పించింది. విద్యా, ఉపాధి రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు సైతం ప్రైవేట్ స్కూల్స్‌లో ఉచిత విద్యను అందించేందుకు గత రెండేళ్లుగా కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషితో ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేరే విద్యార్థులకు ఒక్క పైసా ఖర్చు లేకుండా పూర్తిగా ప్రభుత్వమే ఫీజులు చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నారు.
జిల్లాలో 383 ప్రైవేట్ పాఠశాలలు
జిల్లాలో 383 ప్రైవేట్ పాఠశాలల్లోని సీట్లసంఖ్యలో 25 శాతం ప్రభుత్వం కల్పించే ఉచిత విద్యకు సీట్లు కేటాయించాల్సి ఉంది. ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో కల్పించే ఉచిత విద్యను పొందడానికి ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. 5 ఏళ్లు నిండి ఆరేళ్ల లోపు పిల్లలకు మాత్రమే ఒకటో తరగతిలో ప్రవేశం కల్పిస్తారు. ఉచిత నిర్బంద విద్యాహక్కు చట్టం సెక్షన్–12(1), (సి)ని అనుసరించి 2024–25 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో ప్రవేశించే విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించనున్నారు. రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లను ఆడ పిల్లలు, హెచ్‌ఐవీ బాధితకుటుంబంలోని పిల్లలు, దివ్యాంగులకు 5 శాతం సీట్లు, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 6 శాతం సీట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నిబంధనలు ఇలా
ప్రైవేట్ స్కూల్స్‌లో ప్రవేశం లభించాలంటే విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.14 లక్షలుగా నిర్ణయించారు. ప్రవేశం కల్పించే స్కూల్స్ యాజమాన్యాలకు అర్బన్ పరిధిలోని పాఠశాలల్లో ఒక్కో అడ్మిషన్ కు రూ.5 వేలు, రూరల్ పరిధిలో రూ.6,500 ఫీజును ప్రభుత్వం నిర్ణయించగా ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థులకు ప్రభుత్వం ఏటా ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తుండగా ప్రైవేటు స్కూళ్లకు ఎంపికై న విద్యార్థులకు అమ్మఒడి డబ్బుల్లోనే ఫీజు చెల్లించి మిగిలిన మొత్తాన్ని విద్యార్థి తల్లి లేదా సంరక్షకుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు
ప్రైవేట్ పాఠశాలలో చేరాలనుకునే విద్యార్థులు ఈనెల 25 వరకూ ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. విద్యార్థులు నివాస ఉండే ప్రాంతం నుంచి కిలో మీటరు దూరంలో ఉన్న పాఠశాలకు సీట్లు కేటాయింపులో మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాత మూడు కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలలకు కేటాయిస్తారు.
పటిష్టంగా విద్యాహక్కు చట్టం అమలు
జిల్లాలో విద్యాహక్కు చట్టం పటిష్టంగా అమలు చేస్తున్నాం. ఈ చట్టం ద్వారా పేద విద్యార్థులకు ప్రభుత్వం ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేరికకు కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెల 25 వరకూ ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అవకాశం ఉంది. ప్రైవేట్ విద్యాసంస్థలో విద్యనభ్యసించాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
– ఆర్.వెంకటరమణ, జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం