Skip to main content

CM Revanth Reddy- 15 రోజుల్లో 15వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

Chief Minister Revanth Reddy   announcement of 15,000 police job vacancies in Telangana    CM Revanth Reddy Notification for 15,000 police jobs 15000 cop jobs in next 15 days

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వచ్చే పదిహేను రోజుల్లో 15 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. గ్రూప్‌–1లో 60 కొత్త ఖాళీల భర్తీ చేపడతామని తెలిపారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులు పోటీపరీక్షలకు సిద్ధం కావాలని, ఉద్యోగ నియామకాల కోసం ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు.

ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో.. 441 మంది సింగరేణి కార్మికుల వారసులకు కారుణ్య నియామక పత్రాలను సీఎం అందజేశారు. అనంతరం మాట్లాడారు. గత ప్రభుత్వంలో సింగరేణి   తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, తాము అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు.

ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా, అంబేడ్కర్‌ సాక్షిగా నియామక పత్రాలను అందజేస్తున్నామన్నారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్రను ఎవరూ తగ్గించలేరని, పార్టీలు విఫలమైన సమయంలోనూ కార్మికులు రాష్ట్రం కోసం అనేక పోరాటాలు చేశారని గుర్తుచేశారు. 


సింగరేణి అండగా నిలిచింది 
రాష్ట్రంలోని గత ప్రభుత్వం సింగరేణిని ఖాయిలా పడేలా చేసిందని, కేంద్రం కూడా సింగరేణికి అనేక అడ్డంకులు సృష్టించిందని సీఎం ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతం కాంగ్రెస్‌కు అండగా నిలిచి ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించిందన్నారు.

కారుణ్య నియామకాల వయసు సడలింపు?

సింగరేణిలో 80శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని ఆదేశించామని చెప్పారు. ఈ ప్రాంతంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించే అంశంపై చర్చించి, సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. కారుణ్య నియామకాల వయసు సడలింపు అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు.

కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, మక్కన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్, ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్, కోవ లక్ష్మి, ప్రభుత్వ సీఎస్‌ శాంతికుమారి, సింగరేణి ఎండీ బలరాం నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Published date : 08 Feb 2024 11:14AM

Photo Stories