Andhra Pradesh: దీని వల్ల పాఠశాలలు మూతపడవు... ఎందుకంటే ?
విద్యార్థులు మాత్రమే ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు వెళ్తారని తెలిపారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా చేపడుతున్న పాఠశాలల మ్యాపింగ్ కార్యక్రమంపై మూడు రోజులపాటు జరిగిన అవగాహన సదస్సులు శనివారం ముగిశాయి. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన చివరి రోజు సదస్సుకు అనంతపురం, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
పాఠశాలలు రద్దు కావని..
ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. స్కూళ్ల మ్యాపింగ్ ద్వారా ఏదో జరిగిపోతోందని కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పాఠశాలలు రద్దు కావని.. ఇప్పుడున్నవి ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, హైస్కూల్, హైస్కూల్ ప్లస్‌గా రూపాంతరం చెందుతాయన్నారు. దీనిపై అవగాహన కల్పించడానికే మూడురోజులపాటు అన్ని జిల్లాల ప్రజాప్రతినిధులకు సదస్సులు నిర్వహించామని తెలిపారు. త్వరలోనే జిల్లాలవారీగా కూడా అధికారులు సదస్సులు నిర్వహిస్తారని చెప్పారు.
పాఠశాలల మ్యాపింగ్ తర్వాత ఎక్కడెక్కడ అదనపు తరగతి గదులు, ఇతర మౌలిక వసతులు అవసరమో గుర్తిస్తామని వివరించారు. నాడు–నేడు పథకం కింద పనులు పూర్తి చేస్తామన్నారు. మన రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుతోపాటు వారి ఆరోగ్య భద్రత కూడా చూసుకుంటూ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ.. ఉర్దూ పాఠశాలల మ్యాపింగ్ సమయంలో స్థానిక ప్రజాప్రతినిధుల సూచనల మేరకు ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, కమిషనర్ సురేష్ కుమార్, ఎస్పీడి వెట్రిసెల్వి, మౌలిక వసతుల సలహాదారు మురళి, తదితరులు పాల్గొన్నారు.
సెలవులపై తగ్గెదేలే...?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్రంలో స్కూళ్లకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని మంత్రి స్పష్టం చేశారు. కొన్ని యూనివర్శిటీలు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయన్నారు.కోర్టు కూడా పరీక్షలకు అనుమతి ఇచ్చిందన్నారు. పిల్లలకు కరోనా సోకితే ఆ స్కూల్‌ను మాత్రమే మూసివేసి తర్వాత ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య భద్రత తో పాటు భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేశామని, 15 నుంచి 18 సంవత్సరాల వయసు విద్యార్థులకు కూడా దాదాపు 92 శాతం వ్యాక్సిన్ వేయడం జరిగిందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పాఠశాలలను యధావిధిగా నడపాలని ఆలోచిస్తూనే వారి ఆరోగ్య భద్రత పై కూడా డేగ కన్నుతో నిఘా ఉంచడం జరిగిందన్నారు. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పాఠశాలలను నడిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. ఇప్పటికైతే పాఠశాలలకు సెలవులు ప్రకటించే ఆలోచన లేదని భవిష్యత్తులో కేసుల తీవ్రతను బట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు ఆలోచిస్తామని ఆయన చెప్పారు.