Admissions In AP Model Schools: మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తుల వెల్లువ
పుట్టపర్తి అర్బన్: ఏపీ మోడల్ స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశానికి దరఖాస్తులు వెల్లు వెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ‘నాడు–నేడు’ కింద వసతులు కల్పించి కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మోడల్ స్కూళ్లను తీర్చిదిద్ది, నాణ్యమైన విద్యనందిస్తోంది. దీంతో ఇక్కడ చేరేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు.
అనంతపురం జిల్లాలో గార్లదిన్నె ,గుత్తి, కళ్యాణదుర్గం, కణేకల్లు, పామిడి, పుట్లూరు, రాప్తాడు, రాయదుర్గం, శెట్టూరు, తాడిపత్రి, ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు, యాడికి, చిలమకూరులో, శ్రీసత్యసాయి జిల్లాలోని అగళి,అమడగూరు, అమరాపురం, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, హిందూపురం, కనగానపల్లి, దేవిరెడ్డిపల్లి, జగరాజుపల్లి, రామగిరిలో మోడల్ స్కూళ్లు ఉన్నాయి.
ఒక్కో పాఠశాలలో ఆరో తరగతికి 100 సీట్లు కేటాయించారు. మొత్తం 25 పాఠశాలల్లో 2,500 సీట్లకు గాను 5,137 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా రాయదుర్గంలో 485, గుత్తి 471, ధర్మవరం 359, పామిడి 348, గార్లదిన్నె 305, తాడిపత్రి 297, కళ్యాణదుర్గం 281, రాప్తాడు మోడల్ స్కూల్‌కు 271 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 21న ఆయా పాఠశాలల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించి అర్హులైన విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు.