Aakarshana Satish Success Story: ఆ ఆహ్వానం అందుకున్న ఒకే ఒక్క అమ్మాయి.. 12 ఏళ్లలో 15 లైబ్రరీలు
ఈ ఏడాది స్వాతంత్య్ర వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం అందుకున్నఇరవై మందిలో విద్యార్థులు ఆరుగురు. వారిలో అమ్మాయి ఒకే ఒక్కరు. ఆ సరస్వతి పుత్రిక పేరు ఆకర్షణ. లైబ్రరీలు స్థాపిస్తూ సాహిత్యాన్ని సామాన్యులకు దగ్గర చేస్తున్న ఆమె అక్షరసేవకు జాతీయ స్థాయిలో అందిన గుర్తింపు ఇది.
‘‘హైదరాబాద్ హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్‌మాస్టర్ నుంచి 12వ తేదీన నాన్నకు ఫోన్ వచ్చింది. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా 15వ తేదీన ఢిల్లీలో జరిగే వేడుకలకు హాజరుకావలసిందిగా మీ అమ్మాయి ఆకర్షణకు ఆహ్వానం వచ్చిందని చెబుతూ అభినందనలు తెలియచేశారు’’ అంటూ తాను లైబ్రరీ వ్యవస్థాపకురాలిగా మారిన వివరాలను సాక్షి ఫ్యామిలీతో పంచుకున్నారు ఆకర్షణ సతీష్.
కోవిడ్ వచ్చినప్పుడు..
‘‘హైదరాబాద్‌లో స్థిరపడిన తమిళ కుటుంబం మాది. నాన్న సతీశ్ క్యాన్సర్ ఎక్విప్‌మెంట్ తయారీ కంపెనీ ఉద్యోగి. నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాను. పుస్తక పఠనం నా హాబీ కావడంతో వెయ్యికి పైగా పుస్తకాలతో ఇంట్లోనే నాకు సొంత లైబ్రరీ ఉంది. ఇతరుల కోసం లైబ్రరీ స్థాపించాలనే ఆలోచన కోవిడ్ సమయంలో వచ్చింది.
Job Mela: ఈనెల 27న జాబ్‌మేళా.. నెలకు రూ. 25వేల వరకు వేతనం
తొలి లైబ్రరీ క్యాన్సర్ హాస్పిటల్‌లో..
నాన్న ఉద్యోగరీత్యా క్యాన్సర్ హాస్పిటళ్లకు టచ్‌లో ఉంటారు. కోవిడ్ సమయంలో ఎమ్‌ఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ వాళ్లు ‘కోవిడ్ కారణంగా వంటవాళ్లు డ్యూటీకి రావడం లేదు. పేషెంట్‌లకు ఆహారం అందించడానికి ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేసి పెట్టవలసింది’గా కోరడంతో నాన్న వాళ్ల కోసం రోజూ భోజనం వండించి తీసుకెళ్లి ఇచ్చేవారు.
నాకు స్కూల్ లేకపోవడంతో రోజూ నాన్నతోపాటు హాస్పిటల్‌కి వెళ్లేదాన్ని. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న పేషెంట్‌లలో నా ఏజ్ గ్రూప్ వాళ్లతో స్నేహం ఏర్పడింది. వాళ్లు కొంతమంది చదువుకోవడానికి పుస్తకాలు తెచ్చిపెట్టమని అడిగారు. రోజూ నా పుస్తకాలు కొన్ని తీసుకెళ్లి ఇస్తూ ఉన్నప్పుడు హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జయలత గారు... ‘హాస్పిటల్‌కి చికిత్స కోసం ఎప్పుడూ కొత్తవాళ్లు వస్తుంటారు.
హాస్పిటల్‌లోనే లైబ్రరీ ఉంటే బావుంటుంది’ అన్నారు. వారి ఆలోచనే నా లైబ్రరీ ఉద్యమానికి నాంది. నా పుస్తకాలతోపాటు మా స్కూల్, అపార్ట్‌మెంట్ స్నేహితుల నుంచి సేకరించిన వెయ్యికి పైగా పుస్తకాలతో తొలి లైబ్రరీ అలా మొదలైంది. ఇప్పటికి 9,836 పుస్తకాలతో 15 లైబ్రరీలు ఏర్పాటు చేయగలిగాను.
పదకొండు వేల పుస్తకాలు..
నాలుగేళ్లలో పదకొండు వేల పుస్తకాలు సేకరించాను. అందులో రెండు వేల పుస్తకాలు ప్రధాని నరేంద్రమోదీగారిచ్చారు. ఈ ఏడాది మార్చి 18న కోయంబత్తూరులో ఆయనను కలిసే అవకాశం వచ్చింది. ఆ సందర్భంగా ఆయన 25 లైబ్రరీలు స్థాపించమని, 25 లైబ్రరీ స్థాపనకు స్వయంగా హాజరవుతానని చె΄్పారు. భారత రాష్ట్రపతి గత ఏడాది శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కి వచ్చినప్పుడు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కలిశాను.
అప్పుడామె ‘ప్రజల్లో రీడింగ్ హ్యాబిట్ తగ్గుతోంది, పుస్తక పఠనాన్ని ్రపోత్సహించడానికి దోహదం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని కొనసాగించ’మని చెప్పి ఆమే స్వయంగా 74 పుస్తకాలిచ్చారు. ఈ ఏడాది ఢిల్లీ, కర్తవ్య పథ్‌లో జరిగిన 75వ రిపబ్లిక్ డే ఉత్సవాలకు ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరయ్యాను. ఇదే ఏడాది స్వాతంత్య్రదినోత్సవం వేడుకలకు కూడా హాజరయ్యే అవకాశం కలగడం సంతోషంగా ఉంది’’ అంటూ 25 లైబ్రరీల లక్ష్యాన్ని పూర్తి చేస్తానని చెప్పింది ఆకర్షణ సతీశ్. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి