Skip to main content

తెలంగాణ ఉద్యమం.. జేఏసీలు.. ప్రజా సంఘాల పాత్ర

తెలంగాణ ఉద్యమం.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష.. దాన్ని సాకారం చేసుకోవడంలోజాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ)లు.. ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థుల పాత్ర అనిర్వచనీయం. 1969 మొదలు 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నిర్ణయం వెలువడిన దశ వరకు ఇవి ఎంతో క్రియా శీలకంగా వ్యవహరించాయి. రాజకీయ పార్టీలను సైతం ఈ జేఏసీలు, ప్రజా సంఘాలు ప్రభావితం చేశాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించాయి. 2009 డిసెంబర్ 24న ఏర్పడిన రాజకీయ జేఏసీకి నేతృత్వం వహించి.. సహాయ నిరాకరణ, మిలియన్ మార్చ్, మానవ హారం, సకల జనుల సమ్మె, సాగర హారం, జైల్‌భరో, రైల్‌రోకో, వంటా వార్పు వంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన ప్రొఫెసర్ ఎం.కోదండరాం.. తెలంగాణ ఉద్యమంలో జేఏసీలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఇతర ప్రజా సంఘాల పాత్రపై అందిస్తున్న ప్రత్యేక వ్యాసం..
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోని వివిధ దశల్లో అనేక సంయుక్త కార్యాచరణ కమిటీలు (జేఏసీలు) ఏర్పడి తెలంగాణ ప్రజల ఆశలు- ఆకాంక్షల స్ఫూర్తిగా పోరాడాయి. తెలంగాణకు నదీజలాలు, ఉద్యోగాలు, విద్యావకాశాల విషయంలో అన్యాయం జరగడం, రాష్ట్ర ఆదాయాన్ని పంపిణీ చేసుకోవడంలో వివక్షలు, భారీ స్థాయిలో భూ ఆక్రమణలు, సాంస్కృతిక దురాక్రమణ, తెలంగాణ ప్రజల పట్ల చిన్నచూపు, ఇతర ఆధిపత్య ధోరణుల కారణంగా ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవాలనే నిర్దిష్ట లక్ష్యంతో జేఏసీలు ఏర్పడ్డాయి. దశాబ్దాల చరిత్ర ఉన్న తెలంగాణ ఉద్యమంలో తొలి నుంచీ జేఏసీలు, ప్రజా సంఘాలే కీలక పాత్ర పోషించాయి.
1969 ఉద్యమంలో సైతం వీటి పాత్రే కీలకం. అప్పట్లో ప్రత్యేకంగా విద్యార్థి, ఉద్యోగ సంఘాలు చేసిన పోరాటం.. తెలంగాణ ప్రాంతంలోని మిగతా అన్ని వర్గాలను తెలంగాణ ఉద్యమం దిశగా కదిలించింది.
ఎన్‌జీవోలు.. విద్యార్థులు.. ప్రజాసమితి..
తెలంగాణ ఉద్యమంలో ఎన్‌జీవోలు, విద్యార్థులది ఘనమైన పాత్ర. 1968లో విద్యార్థులు, ఎన్‌జీవోలు ఒక్కతాటిపై నిలిచి హైదరాబాద్‌లో పీపుల్స్ కన్వెన్షన్‌ను నిర్వహించారు. ఈ సదస్సు తర్వాతి క్రమంలో ప్రజా సమితిగా మారింది. విద్యార్థి, ఉద్యోగ సంఘాలు ఇచ్చిన స్ఫూర్తితో ఏర్పడిన ప్రజా సమితి.. 1969 ఫిబ్రవరిలో తెలంగాణ ప్రజా సమితి(టీపీఎస్)గా రూపొందింది. దీనికి అప్పటి కాంగ్రెస్ నేత చెన్నారెడ్డి నేతృత్వం వహించారు. కాంగ్రెస్ పార్టీ నుంచే తెలంగాణ వాదం వినిపించిన పలువురు నేతలు ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి తెలంగాణ ప్రజా సమితిలో చేరారు. ప్రజా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష దిశగా ఎన్నో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. తెలంగాణ ఉద్యోగుల సంఘం 1969 జూన్ 10న సమ్మె నిర్వహించింది. చెన్నారెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రజా సమితి తర్వాత క్రమంలో రాజకీయ పార్టీగా నమోదు చేసుకుంది. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. తర్వాత కూడా అదే స్ఫూర్తి కొనసాగించింది. ముఖ్యంగా 1969 జూన్‌లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ హైదరాబాద్‌కు వచ్చి ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ నిర్ణయంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. దాంతో  తెలంగాణ ప్రజా సమితి 1971 పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా పోటీ చేసింది. దీనికి తెలంగాణ ప్రాంతంలోని అన్ని వర్గాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా మద్దతు లభించింది. తెలంగాణ ప్రాంతంలోని 14 పార్లమెంట్ సీట్లకు గాను 10 స్థానాల్లో టీపీఎస్ విజయం సాధించింది. తర్వాత కాలంలో తెలంగాణ ప్రజా సమితిలోని నాయకులు తిరిగి కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీ మనుగడ సాగించలేకపోయింది.
1996.. ముందుకొచ్చిన ఉద్యమం
ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష, ఆ దిశగా మలి దశ ఉద్యమం 1996లో మొదలైంది. దీనికి ప్రధాన కారణం అప్పటి ప్రభుత్వం అనుసరించిన ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాలే. ఉపాధి కల్పన, జీవనోపాధి, ప్రజల సంక్షేమం పరంగా ప్రభుత్వం నుంచి అంతగా ఆశించకూడదని పేర్కొనడం, ప్రైవేటు వర్గాలకు చేయూతనిచ్చే విధంగా వ్యహరించడం జరిగింది. దీంతో అప్పటికే తాము వివక్షకు గురవుతున్నామనే భావనలో ఉన్న తెలంగాణ ప్రజలు.. ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ విధానాల వల్ల తాము మరింత వివక్షకు గురవుతామని, విద్యా, ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయని ఆందోళన చెందారు. దీనికి పరిష్కారం ప్రత్యేక తెలంగాణ సాధనే అనే అభిప్రాయానికి వచ్చారు. దీంతో మలి దశ ఉద్యమం మొదలైంది. ఈ క్రమంలోనూ విద్యార్థులు కీలక పాత్ర వహించారు. తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్; తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వంటి సంఘాలు ఆవిర్భవించాయి.
మలిదశలోనూ.. ప్రజా సంఘాలే
మలి దశ తెలంగాణ ఉద్యమంలోనూ ప్రజా సంఘాలు, విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులదే ముఖ్య పాత్ర అని చెప్పాలి. తొలుత 1989లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఏర్పాటయింది. దీని ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బసంత్ టాకీస్‌లో భారీ సభ జరిగింది. 1969 ఉద్యమంలో పాల్గొన్న నేతలంతా ఈ సభకు హాజరై.. పెద్ద మనుషుల ఒప్పందం, ముల్కీ నిబంధనలు, వాటికి ఆంధ్ర నేతల అడ్డంకుల గురించి చర్చించారు. ఈ చర్చలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరడంతో తెలంగాణ ఆకాంక్ష మరింత తీవ్రమైంది. ఉద్యమంలో పల్లె స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవడం ప్రారంభమైంది. 1970ల తర్వాత విద్యావకాశాలు విస్తృతమయ్యాయి. రిజర్వేషన్లు, ఇతర కారణాల వల్ల ఆర్థిక కోణంలో మధ్యతరగతి వర్గం పెరిగింది. ఈ వర్గం నుంచి విద్యావంతుల సంఖ్య పెరిగింది. దాంతో తెలంగాణ ప్రజలు వివక్షకు గురవుతున్న విధానంపై మరింత చైతన్యం వచ్చింది. వారంతా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. క్రమేణా 1990ల నాటికి ఈ పౌర సంఘాలు బలపడ్డాయి. మలి దశ ఉద్యమంలో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాయి. తెలంగాణ మహా సభ, తెలంగాణ జన సభ, తెలంగాణ ఐక్య వేదిక ఇలా ఎన్నో సంఘాలు ఏర్పడ్డాయి.
ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో సభ
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల జేఏసీ ఆధ్వర్యంలో 1993 ఆగస్టులో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై జాతీయ స్థాయి సెమినార్‌ను నిర్వహించారు. ఇందులో జార్జి ఫెర్నాండెజ్, జస్టిస్ మాధవ రెడ్డి, సురేంద్ర మోహన్ వంటి జాతీయ స్థాయి రాజకీయ, మేధావి వర్గాల వారు పాల్గొన్నారు. ఆ తర్వాత 1996లో తెలంగాణ జర్నలిస్ట్‌లు, రచయితల నేతృత్వంలోని ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ పేరుతో సభ జరిగింది. 1996 నవంబర్ 1న వరంగల్‌లో తెలంగాణ ప్రజా సమితి నిర్వహించిన సభ ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను ప్రస్ఫుటం చేసింది. ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా హాజరయ్యారు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి, తీవ్రతరం చేయడంలో వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థుల పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల జేఏసీ, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థుల జేఏసీ ఉద్యమాన్ని క్రియాశీలకంగా నడపడంలో కృషి చేశాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా విద్యార్థి జేఏసీ
2009లో చలో అసెంబ్లీకి పిలుపు ఇచ్చింది. అలాగే 2010 జనవరిలో విద్యార్థి జేఏసీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిరసనకు ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే, హైకోర్టును ఆశ్రయించి భారీ ప్రదర్శనను విజయవంతంగా నిర్వహించింది. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు మొదటి నుంచీ ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతో క్రీయాశీలంగా వ్యవహరించారు. 
టీఆర్‌ఎస్ ఆవిర్భావం
మలిదశ తెలంగాణ ఉద్యమంలో అత్యంత ప్రత్యేక పరిణామం.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఏర్పాటు. అప్పటివరకు ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష దిశగా ఈ ప్రాంత ప్రజలు చేపట్టిన అనేక ఆందోళన కార్యక్రమాలను, ఇతర నిరసనలను ప్రభుత్వాలు తమ అధికారంతో అణచివేశాయి. తెలంగాణ ఆకాంక్షను రాజ్యంగబద్ధంగా తెలపాలనే ఉద్దేశంతో అప్పటివరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న కె.చంద్రశేఖరరావు.. ప్రత్యేక తెలంగాణ అంశమే ఎజెండాగా 2001లో టీఆర్‌ఎస్ పార్టీని నెలకొల్పారు. దీంతో ఉద్యమంలో రాజకీయ ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఏదో ఒక విధంగా ఉద్యమ కార్యక్రమాలు జరగడం, వాటిలో విద్యార్థులు, మేధావులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు.. ఇలా అన్ని వర్గాలు మమేకమయ్యాయి. మలి దశలో 1990ల నుంచి 2009 వరకు వేర్వేరుగా ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించిన వర్గాలు..  2009లో ఐక్యమవడం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దిశగా కీలక పరిణామం. 2009 నవంబర్ 29 నుంచి టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఆమరణ నిరాహారదీక్ష నేపథ్యంలో మళ్లీ పౌర సంఘాల పాత్ర తెరపైకి వచ్చింది. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల ఐక్య వేదికలు కేసీఆర్ దీక్షకు సంఘీభావంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమాలను అణచివేయాలని అప్పటి ప్రభుత్వం ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల్లోని విద్యార్థులపై చేసిన లాఠీచార్జీ, కాల్పుల కారణంగా సాధారణ ప్రజానీకం సైతం ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు.
2009 నాటికి ప్రాధాన్యం గుర్తించిన అన్ని పార్టీలు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు దిశగా రాజకీయ పార్టీలు విభిన్న శైలుల్లో వ్యవహరించాయి. 1999 ఎన్నికల సమయంలో కాకినాడ ప్లీనరీలో ‘ఒక ఓటు-రెండు రాష్ట్రాలు’ నినాదం చేసిన భారతీయ జనతాపార్టీ తర్వాత ఏకాభిప్రాయం పేరుతో వెనుకడుగు వేసింది.
2001లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం కూడా తెలంగాణకు వ్యతిరేకంగానే ఉంది. ఈ తీర్మానం అస్పష్టంగా ఉంది. రెండో ఎస్సార్సీని వేయాలని తీర్మానం చేసి ఎన్‌డీఏ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను గుర్తించడం గమనార్హం. 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం దిశగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన రాజకీయ పార్టీలు.. 2009 నాటికి దీని ప్రాధాన్యం, ఆవశ్యకతను గుర్తించాయి.
ముఖ్యంగా ఆ సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తమకు అభ్యంతరం లేదని చెప్పడంతోపాటు ఈ దిశగా ముందుకెళతామని పేర్కొంది. తెలుగుదేశం పార్టీ మాత్రం మొదటి నుంచి పూర్తి వ్యతిరేకతతో వ్యవహరించింది. 2012 డిసెంబర్ 28న ఆల్ పార్టీ మీటింగ్‌లో తెలంగాణకు మద్దతు తెలిపినా.. రాజకీయంగా మాత్రం వ్యతిరేకంగా వ్యవహరించింది. ఎంఐఎం పార్టీ మాత్రం నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీకే వదిలేసింది.
చివరికి 2014లో పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టగా అధికార, విపక్ష సభ్యులు మద్దతు తెలిపారు! 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభ, 2014  ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లును 2014 మార్చి1న రాష్ట్రపతి ఆమోదించారు. దశాబ్దాల పోరాటం ఫలించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా, భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది!!
పొలిటికల్ జేఏసీ.. ఇలా:
తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు తెలంగాణ ఉద్యమ క్రమంలో అత్యంత ప్రత్యేకమైన పరిణామం. కె.చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్ష నేపథ్యంలో డిసెంబర్ 9, 2009న అప్పటి కేంద్ర హోం శాఖ మంత్రి పి.చిదంబరం ‘తెలంగాణ ఏర్పాటు దిశగా అవసరమైన చర్యల ప్రక్రియను ప్రారంభిస్తున్నాం’ అని ప్రకటించారు. అయితే డిసెంబర్ 23 నాటికి పరిస్థితి తలకిందులైంది. డిసెంబర్ 9 ప్రకటనకు భిన్నమైన ప్రకటన విడుదలైంది. అన్ని పార్టీలను సంప్రదించిన తర్వాతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని ఆ ప్రకటన సారాంశం. దీంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఆయా పార్టీల్లోని తెలంగాణ ప్రాంత నేతలు ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి. దీంతో డిసెంబర్ 24, 2009న అన్ని రాజకీయ పార్టీల నేతలంతా కలిసి రాజకీయ ఐక్య వేదిక(జేఏసీ)ను ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు - ఆవశ్యకతపై 2010 ఫిబ్రవరి 10న కేంద్రం ఐదుగురు  సభ్యులతో శ్రీ కృష్ణ కమిటీని నియమించింది.
ప్రధానంగా జేఏసీ నేతృత్వంలో సహాయనిరాకరణ, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె చరిత్రలో నిలిచిపోయేలా జరిగాయి. తెలంగాణ ప్రత్యేక ఉద్యమ క్రమంలో తెలంగాణ ఉద్యోగులు, పౌర సంఘాలు నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో.. 2011 ఫిబ్రవరి 17 నుంచి 16 రోజుల పాటు ఉద్యోగుల సహాయ నిరాకరణ; తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో 2011 మార్చి 10న మిలియన్ మార్చ్; 2011 సెప్టెంబర్ 13 నుంచి 42 రోజులపాటు జరిగిన సకల జనుల సమ్మె; 2011 సెప్టెంబర్ 24, 25 తేదీల్లో సడక్ బంద్; 2012 సెప్టెంబర్ 30న సాగర హారం నిర్వహణ ముఖ్య ఘట్టాలుగా పేర్కొనొచ్చు.
Published date : 29 Sep 2015 06:26PM

Photo Stories