Skip to main content

తెలంగాణ తొలిదశ ఉద్యమం

నిజాం నిరంకుశ పాలనలో ఉన్న హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. దీని కోసం ఆనాటి ఉపప్రధాని, హోం మంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ విశేష కృషి చేశారు. హైదరాబాద్ రాజ్యంపై భారతసైన్యం మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి నాయకత్వంలో 1948 సెప్టెంబర్ 13న సైనిక చర్య చేపట్టింది. దీన్ని ‘ఆపరేషన్ పోలో’గా వ్యవహరిస్తారు. కాలక్రమంలో ఇది ‘పోలీస్ చర్య’గా ప్రసిద్ధి చెందింది. భారత సైన్యాన్ని నిలువరించలేక నిజాం రాజు ఉస్మాన్ అలీఖాన్ ఓటమిని అంగీకరించాడు.
 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాజ్యం భారత్‌లో విలీనమైంది. సెప్టెంబర్ 18న జె.ఎన్.చౌదరి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సైనిక (మిలటరీ)పాలన ప్రారంభమైంది.1949 డిసెంబర్ 1 వరకు మిలటరీ పాలన కొనసాగింది. ఆ సమయంలోనే తెలంగాణలో కమ్యూనిస్టుల సాయుధ పోరాటం ఉధృతమైంది. పరిస్థితులను చక్కదిద్దడానికి ఐసీఎస్ అధికారి ఎం.కె.వెల్లోడి నాయకత్వంలో హైదరాబాద్‌లో పౌరపాలనను ప్రారంభించారు. నూతన భారత రాజ్యాంగం ప్రకారం హైదరాబాద్ రాష్ర్టంగా ఏర్పడింది. నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1950 జనవరి 26 నుంచి హైదరాబాద్ రాష్ర్ట రాజ్ ప్రముఖ్‌గా బాధ్యతలు చేపట్టాడు. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడే వరకు నిజాం ఆ పదవిలో కొనసాగాడు. 1952 ఫిబ్రవరిలో హైదరాబాద్ రాష్ర్టంలో ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటు కోసం శాసనసభ ఎన్నికలు జరిగాయి. అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ 1952 మార్చి 6న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. నిజాం రాజ్యంలోని తెలుగు, కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడే ప్రజలున్న ప్రాంతాలు హైదరాబాద్ రాష్ర్ట పాలన కిందకు వచ్చాయి. అప్పటి మద్రాస్ రాష్ర్టంలోని రాయలసీమ, కోస్తాంధ్ర వారు ప్రత్యేక రాష్ర్టం కోసం  ఉద్యమించారు. పొట్టి శ్రీరాములు
 1952 అక్టోబర్ 19న మద్రాస్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 58 రోజుల అనంతరం డిసెంబర్ 15న ఆయన మరణించాడు. ఆ సంఘటనతో కేంద్రం దిగివచ్చి 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఆంధ్రరాష్ర్ట మొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం ఎన్నికయ్యారు. గవర్నర్‌గా సీఎం త్రివేది నియమితులయ్యారు.  తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఒకే రాష్ర్టంగా ఏర్పడాలనే డిమాండ్‌తో ఆంధ్ర రాష్ర్టం నుంచి ‘విశాలాంధ్ర’ ఉద్యమం ఊపిరిపోసుకుంది. ఆంధ్రుల ఈ డిమాండ్‌ను విస్తృతం చేయడానికి కమ్యూనిస్టు పార్టీ విశేష కృషి చేసింది.
 
రాష్ట్రాల పునర్విభజన కమిషన్
 ఆనాటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ  1953 డిసెంబర్ 22న రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌ను ఏర్పాటు చేశారు. సయ్యద్ ఫజల్ అలీ అధ్యక్షులుగా హృదయనాథ్ కుంజ్రూ, కె.ఎం. ఫణిక్కర్ సభ్యులుగా ఈ కమిషన్ ఏర్పాటైంది. యధార్థ పరిస్థితులను నిష్పక్ష పాతంగా అధ్యయనం చేసి భారత యూనియన్‌లో నూతన రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకతను పరిశీలించాలని ఈ కమిటీకి నిర్దేశించారు.  ఈ కమిషన్ 1954 జూన్-జూలైల్లో హైదరాబాద్‌ను సందర్శించింది. ఆంధ్ర రాష్ర్టంలో తెలంగాణ ప్రాంతాన్ని విలీనం చేయడంపై తెలంగాణ ప్రజల్లో ఆందోళన ఉందని, తెలంగాణ వలస ప్రాంతంగా మారుతుందనే సంకోచం వారిలో ఉందని పేర్కొంది. హైదరాబాద్ రాష్ట్రాన్ని విభజించి తెలుగు మాట్లాడే ప్రాంతం (తెలంగాణ)ను ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పాటు చేయాలని సూచించింది. కన్నడ ప్రాంతాన్ని మైసూర్‌లో, మరాఠీ ప్రాంతాన్ని బొంబాయి రాష్ర్టంలో కలపాలని నివేదించింది. రెండు తెలుగు ప్రాంతాలను కలపడం ఆవశ్యమైతే 1961లో జరిగే శాసనసభ ఎన్నికల తర్వాత తెలంగాణ శాసనసభలోని 2/3వ వంతు మంది సభ్యుల ఆమోదంతో ఆంధ్రాలో విలీనం చేయాలని ఫజల్ అలీ కమిషన్ పేర్కొంది.
 
పెద్ద మనుషుల ఒప్పందం
 రాష్ట్రాల పునర్విభజన కమిషన్ నివేదిక అంశాలకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆంధ్ర, తెలంగాణలను కలపాలని నిర్ణయించింది. ఆంధ్ర, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు, అనుమానాల నివృత్తికి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని హైదరాబాద్ అతిథి గృహంలో 1956 ఫిబ్రవరి 20న సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీనికి తెలంగాణ  నుంచి హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, మంత్రులు కె.వి.రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, హైదరాబాద్  కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జేవీ.నరసింగరావు హాజరయ్యారు. ఆనాటి ఆంధ్ర రాష్ర్ట ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి, ఉపముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, రాష్ర్టమంత్రి గౌతు లచ్చన్న, ఆంధ్ర రాష్ర్ట కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అల్లూరి సత్యనారాయణ రాజు పాల్గొన్నారు. 14 అంశాలతో  రూపొందించిన ఒప్పందంపై నాయకులందరూ సంతకాలు చేశారు. దీన్నే పెద్ద మనుషుల ఒప్పందంగా పిలుస్తారు.
 ఈ ఒప్పందంలోని అంశాలను రాష్ర్ట పునర్ వ్యవస్థీకరణ చట్టంలో చేర్చారు. విశాలాంధ్ర  పేరును కమ్యూనిస్టులు ప్రతిపాదించడం వల్ల కాంగ్రెస్ వారికి అది నచ్చలేదు. భారత పార్లమెంట్‌కు సమర్పించిన ముసాయిదా బిల్లులో ‘ఆంధ్ర- తెలంగాణ’ రాష్ర్టంగా పేరు పెట్టారు. ఈ బిల్లును పార్లమెంట్ సెలెక్ట్ కమిటీకి నివేదించారు. సెలెక్ట్ కమిటీ సభ్యులపై ఆంధ్ర నాయకులు ప్రాబల్యం చూపి ‘ఆంధ్రప్రదేశ్’ రాష్ర్టంగా పేరు మార్చారు.
 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా, సీఎం త్రివేది గవర్నర్‌గా నియమితులయ్యారు.  ఉప ముఖ్యమంత్రి పదవిని తెలంగాణ వారికి ఇవ్వాలనే అంశాన్ని నీలం సంజీవరెడ్డి పట్టించుకోలేదు.  పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఆదిలోనే ఉల్లంఘించారు.

1969 ఉద్యమం
 పెద్ద మనుషుల ఒప్పందంలో ఉల్లంఘనలు, ముల్కీ నిబంధనలు అమలు చేయకపోవడంతో విద్యా, ఉద్యోగ అవకాశాల్లో తెలంగాణ వారికి అన్యాయం జరిగింది. దీంతో ఆంధ్ర నాయకుల పాలనపై తెలంగాణలో అసంతృప్తి మొదలైంది. తెలంగాణ స్థానికత (ముల్కీ) నిబంధనను 12 నుంచి 4 సంవత్సరాలకు తగ్గించడంతో తెలంగాణ యువకులు నిరాశ చెందారు. తెలంగాణ విద్యాసంస్థల్లో ఆందోళన చెలరేగింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొట్టమొదట పాల్వంచ (ఖమ్మం జిల్లా)లో 1969 జనవరిలో ప్రారంభమైంది. జనవరి 19 నాటికి ఆందోళన తీవ్రమైంది. ఆ రోజే 17 మంది తెలంగాణ విద్యార్థులు పోలీస్ తూటాలు తగిలి గాయాలపాలయ్యారు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. అధికార పార్టీ సభ్యుడు కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. మదన్మోహన్, మల్లికార్జున్, పులివీరన్న వంటి విద్యార్థి నాయకులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి 1969 ఫిబ్రవరి 28న ఎ.మదన్మోహన్ కన్వీనర్‌గా ‘తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్)’ ఏర్పడింది. ఇది 1970 డిసెంబర్‌లో రాజకీయ పార్టీగా మారింది. దీనికి మర్రి చెన్నారెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
 1969లో తెలంగాణ ఉద్యమ రూపం హింసాత్మకంగా మారింది. ఈ పోరాటంలో 370 మంది విద్యార్థులు పోలీస్ కాల్పులకు బలయ్యారు. సుమారు 70,000 మందిని అరెస్ట్ చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తీవ్ర అణచివేత చర్యలకు పాల్పడ్డాడు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జోక్యం చేసుకొని 1969 ఏప్రిల్ 11న పార్లమెంట్‌లో ‘8 సూత్రాల పథకాన్ని’ ప్రకటించారు. తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ పథకంలో  ఐదు ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు.అవి..
 1. తెలంగాణ మిగులు నిధుల నిర్ధారణ కమిటీ
 2. తెలంగాణ అభివృద్ధి కమిటీ
 3. ప్రణాళికా అమలు పర్యవేక్షణ కమిటీ
 4. తెలంగాణ ప్రజల రక్షణపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో ఏర్పాటైన కమిటీ
 5. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే కమిటీ
 తెలంగాణ సమాజం ఈ 8 సూత్రాల పథకానికి సంతృప్తి చెందక ఉద్యమాన్ని కొనసాగించింది. ఉద్యమాన్ని అదుపు చేయడానికి 1969 జూన్ 4న  సైన్యాన్ని రంగంలోకి దించారు. జూన్ 10న ఉద్యోగులు ప్రత్యేక తెలంగాణ కోసం సమ్మె ప్రారంభించారు. తెలంగాణలోని విద్యాలయాలు వరుసగా 9 నెలలపాటు తెరుచుకోలేదు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తీవ్ర అణచివేత చర్యలకు పాల్పడడంతో ఉద్యమం ఆగిపోయింది.  అయినా 1971లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తమ ఆకాంక్షను చాటారు. మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో టీపీఎస్ పార్టీ (పార గుర్తు) 10 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించింది. కానీ ఆనాడు తెలంగాణ కల సాకారం కాలేదు. చివరకు 2014 జూన్ 2న  29వ రాష్ర్టంగా తెలంగాణ ఆవిర్భవించింది.
Published date : 28 Sep 2015 04:32PM

Photo Stories