Skip to main content

ముల్కీ నియమాలు - పూర్వాపరాలు

‘మన ఉద్యోగాలు మనకు కావాలి’ ఇది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్ నినాదాల్లో అతి ముఖ్యమైంది. ఈ నినాదం నిన్నమొన్న పుట్టింది కాదు, అసఫ్ జాహీల కాలంలో హైదరాబాద్ సంస్థానంలో అప్పటి ప్రధాని సాలార్‌జంగ్ సంస్కరణల నుంచి 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు ప్రతి అంశం ముల్కీ నియమాలతో ముడిపడి ఉంటుంది. వీటి ఉల్లంఘనలే ముఖ్య కారణంగా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఏర్పడింది. తర్వాత 1969లో ఉద్యమం ప్రారంభమైంది. స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని అందుకు ప్రత్యేక రాష్ట్ర సాధన ఒక్కటే శరణ్యమని.. ఆ దిశగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.
ముల్కీపై అవగాహన ఏర్పడితే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ప్రతి అంశం అర్థమవుతుంది. రాజులు ఇతర రాజ్యాలను జయించినప్పుడు.. ఆయా ప్రాంతాల్లో తమ వాళ్లను ఉన్నత ఉద్యోగాల్లో నియమిస్తారు. ఉదాహరణకు ఔరంగజేబు కుతూబ్ షాహీల నుంచి గోల్కొండ రాజ్యాన్ని (హైదరాబాద్ సంస్థానాన్ని) జయించినప్పుడు ఇక్కడ ఉత్తర భారత దేశానికి చెందిన వ్యక్తులను పరిపాలన బాధ్యతల్లో నియమించాడు. దాంతో స్థానికులు.. తాము పరాయి పాలనలో ఉన్నామనే అసంతృప్తికి గురయ్యారు.

సాలార్ జంగ్..
1853లో సాలార్‌జంగ్ (మీర్ తురబ్ అలీ ఖాన్) ప్రధాన మంత్రిగా నియమితుడయ్యేనాటికి హైదరాబాద్ సంస్థానం విపత్కర ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో సాలార్‌జంగ్ అనేక సంస్కరణలు చేపట్టారు. పరిపాలన, రెవెన్యూ, విద్య, పోలీస్,  న్యాయ మొదలైన సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. అలీగఢ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడైన సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్, అమీనుద్దీన్ ఖాన్‌లను తనకు సలహాదారులుగా నియమించుకున్నాడు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీగఢ్ యూనివర్సిటీలో ‘సైంటిఫిక్ సొసైటీ’ని ఏర్పాటు చేసి.. పాశ్చాత్య విజ్ఞానాన్ని ఉర్దూ భాషలోకి తర్జుమా చేయించి అక్కడి విద్యార్థులకు అందించాడు. అక్కడ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందిన విద్యార్థులు సమర్థంగా పనిచేస్తారనే అహ్మద్ ఖాన్ సలహా మేరకు వారిని సాలార్‌జంగ్ హైదరాబాద్ సంస్థానంలో ఉన్నత ఉద్యోగాల్లో నియమించాడు. స్థానికేతరులు ఉద్యోగాలు పొందడంపై స్థానికుల్లో అసంతృప్తి  మరింత పెరిగింది. 

విద్యా సంస్కరణలు..
సాలార్‌జంగ్ 1855లో దారుల్ ఉల్ ఉలూమ్ ఆంగ్ల పాఠశాలను స్థాపించాడు. 1873లో మదరస ఇ ఆలియ పాఠశాలను నవాబుల పిల్లల (నోబుల్స్) విద్య కోసం ఏర్పాటు చేశాడు. రాచకుటుంబంలోని పిల్లల కోసం మదరస ఇ ఐజా అనే పాఠశాలను 1978లో స్థాపించాడు. 1870లో సిటీ హైస్కూల్, 1872లో చాదర్‌ఘట్ హైస్కూల్ ఏర్పాటయ్యాయి. పబ్లిక్ వర్క్స్ శాఖకు సాంకేతిక నిపుణులను అందించడం కోసం 1870లో ఇంజనీరింగ్ కళాశాలను  స్థాపించారు.

మానవ వనరుల కొరత...
సాలార్ జంగ్  పరిపాలన సంస్కరణలు చేపట్టాడు. 1855లో మొదటిసారి ట్రెజరీ ఏర్పాటు చేసి గుత్తేదారుల స్థానంలో వేతనంపై పనిచేసే తాలుక్‌దార్లను, ఇతర ఉద్యోగులను నియమించాడు. 1865లో ‘జిలాబంది’ విధానం ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం రాజ్యాన్ని 4 సుబాలుగా, 17 జిల్లాలుగా విభజించాడు. ప్రతి జిల్లాకు అవ్వల్ తాలూక్‌దార్‌ను, అతని సహాయార్థం దోయుం తాలూక్‌దార్లు, సోయుం తాలుక్ దార్లు, తహశీల్దార్లను ఏర్పాటు చేశాడు. ఇలాంటి సందర్భంలో రెవెన్యూతోపాటు జ్యుడీషియల్, హోం, విద్య మొదలైన వివిధ రంగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఉత్తర భారత దేశం నుంచి ముఖ్యంగా అలీగఢ్ యూనివర్సిటీ నుంచి ఎక్కువ మందిని తీసుకున్నారు. ఆ విధంగా 1868 నాటికే అన్ని డిపార్టుమెంటుల్లో నాన్‌ముల్కీలు విధుల్లో చేరారు. అప్పుడు ఎలాంటి ముల్కీ నిబంధనలు లేకపోవడంతో డిపార్‌‌టమెంట్ హెడ్‌లుగా ఉన్న నాన్‌ముల్కీలు కొత్త పోస్టులు సృష్టించి తమ ప్రాంతానికి చెందిన వారిని ఉద్యోగాల్లో నియమించారు. ఉత్తరాది నుంచి వచ్చిన నాన్ ముల్కీలు స్థానికుల మీద ఆధిపత్యం చెలాయించటం మొదలు పెట్టారు. నాన్‌ముల్కీల ఆధిపత్య ధోరణితో జమీందార్లు, దేశ్‌ముఖ్‌లు, రాజ కుటుంబ సభ్యులు ఆత్మనూన్యతకు లోనయ్యారు. ఉత్తర భారత దేశ ముస్లిం, దక్కన్ ముస్లింల సంస్కృతుల్లో చాలా వ్యత్యాసాలుండేవి.

ఉర్దూను వ్యతిరేకించిన సాలార్‌జంగ్..
ఉత్తర భారతదేశంలో 1830 నాటికే అధికార భాష పర్షియన్ నుంచి ఉర్దూకి మారింది. కానీ ఇక్కడ పర్షియన్ అధికార భాషగా ఉండేది. పాత పద్ధతి పట్ల గౌరవం ఉన్న దివాన్ మొదటి సాలార్‌జంగ్ నాన్‌ముల్కీలు తమ సంస్కృతిని కలుషితం చేస్తున్నారని భావించి వారి ఆధిపత్య ధోరణిని వ్యతిరేకించాడు. 1868 నుంచి నాన్‌ముల్కీలను ఉద్యోగాల్లో నియమించవద్దని ఆదేశాలు జారీ చేశాడు. ఒకవేళ నాన్‌ముల్కీలను తీసుకోవాల్సి వస్తే తన అనుమతి తీసుకొని నియమించాలని 1882లో ప్రకటన చేశాడు.
1868 తర్వాత స్కూళ్లు స్థాపించి ఇంగ్లిష్ మాధ్యమంలో బోధనకు అనుమతిచ్చాడు. సికింద్రాబాద్‌లో క్రిస్టియన్ స్కూళ్లకు అనుమతినిచ్చి, ప్రోత్సహించాడు. 1883లో సాలార్‌జంగ్ మరణించాడు.  సాలర్ జంగ్ కొడుకు రెండో సాలార్ జంగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాడు.

అధికార భాషగా ఉర్దూ
సాలార్‌జంగ్ మరణించేనాటికి ఆరో నిజాం రాజు మీర్ మహబూబ్ అలీ ఖాన్ మైనర్. కాబట్టి 18 ఏళ్లు నిండిన తర్వాత 1884 ఫిబ్రవరి 5న మహబూబ్ అలీ ఖాన్ అధికారాన్ని స్వీకరించాడు. అదే రోజున రెండో సాలార్‌జంగ్ ప్రధానమంత్రిగా నియమితుడయ్యాడు. రెండో సాలార్‌జంగ్, మీర్ మహబూబ్ అలీ ఖాన్ కలిసి చదువుకున్నారు. వారు మంచి మిత్రులు. రెండో సాలార్‌జంగ్‌కు, నాన్‌ముల్కీలకు స్నేహం ఉండటంతో 1884లో పర్షియన్ స్థానంలో ఉర్దూను అధికార భాషగా ప్రవేశపెట్టాడు. రెండేళ్లలో అన్ని విభాగాల్లో దీన్ని అమలుపరిచాడు. దీంతో ఉత్తర భారత దేశం నుంచి ముస్లింలు ఎక్కువ సంఖ్యలో హైదరాబాద్ సంస్థానానికి వచ్చారు.

రెండో సాలార్‌జంగ్ రాజీనామా
1884-1886 మధ్య నిజాం రాజు మీర్ మహబూబ్ అలీ ఖాన్ ముల్కీ నిబంధనలను మరింత కఠినం చేస్తూ ఎప్పటికప్పుడూ ఫర్మానాలు జారీచేశాడు. కానీ రెండో సాలార్‌జంగ్ వీటిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. 1884లో జరిగిన మొదటి హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో సెలెక్ట్ అయిన జాబితాను మహబూబ్ అలీ ఖాన్ పరిశీలించాడు. ముల్కీలు 246, నాన్‌ముల్కీలు 230 మంది అంటే 52:48 నిష్పత్తిలో ఎంపికయ్యారు. కానీ వీరి వేతనాలు మాత్రం 42:58  నిష్పత్తిల్లో ఉన్నాయి. నాన్‌ముల్కీల్లో  ఉత్తర భారత దేశం నుంచి 97 మంది, బొంబాయి రాష్ర్టం నుంచి 36 మంది, 31 మంది ఇతర దేశస్థులు (24 యురోపియన్లు, 7 ఇతర దేశస్థులు) ఎంపికయ్యారు. అదేవిధంగా కింది స్థాయి ఉద్యోగుల జాబితాను కూడా పరిశీలించిన నిజాం రాజు అందులో 274 మంది ముల్కీలు, 147 మంది నాన్‌ముల్కీలు అంటే 65:35 నిష్పత్తిలో ఉన్నప్పటికీ..  వారి జీతభత్యాలు మాత్రం 37:63 నిష్పత్తిలో ఉన్నాయని గమనించాడు. అన్ని రంగాల్లో నాన్‌ముల్కీల ఆధిపత్యం చెలామణి అయింది. అప్పటికే రాజును రెండో సాలార్‌జంగ్ గౌరవించటం లేదని రాజ కుటుంబీకులు కోపంతో ఉన్నారు. దానికి తోడు ముల్కీ నిబంధనలను ఉల్లఘించిన కారణంతో రాజు రెండో సాలార్‌జంగ్‌ను 1887లో రాజీనామా చేయించాడు.

పెరిగిన నాన్‌ముల్కీల సంఖ్య..
కొన్ని రోజుల వరకు ప్రధాని బాధ్యతలను రాజే నిర్వర్తించాడు. తర్వాత దివాన్‌గా 1888లో అస్మాన్‌జా బాధ్యతలు స్వీకరించాడు. అతడు కూడా నాన్‌ముల్కీలు ఉద్యోగాల్లోకి రాకుండా ఉండటాన్ని నిలువరించడంలో విఫలమయ్యాడు. 1886-1894 మధ్యకాలంలో సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల సంఖ్య ఒకటిన్నర రెట్లు పెరిగింది. దాంతో పాటు నాన్‌ముల్కీల సంఖ్య 48 శాతం నుంచి 66 శాతం అయింది. 12 ఏళ్లు ఇక్కడ సర్వీస్ చేస్తే వాళ్ల పిల్లలు ముల్కీలు అవుతారనే నిబంధనతో వీరి సంఖ్య పెరిగింది.  స్థానిక ప్రజలు మాత్రం వీరిని నాన్‌ముల్కీలుగానే పరిగణించారు. దీనిపై ఆనాటి స్థానిక పత్రికలు హైదరాబాద్ రికార్డ్ లాంటివి నాన్‌ముల్కీల కట్టడీలో ప్రభుత్వం విఫలమైందని రాశాయి. ది మహ్మద్దీన్ అనే నాన్‌ముల్కీలకు చెందిన పత్రిక మొదటి సాలార్‌జంగ్ కోరిక మేరకే ఇక్కడికి వచ్చినట్లు సంపాదకీయాలు రాసింది. ఈ నేపథ్యంలో ముల్కీ ముస్లింలకు, నాన్‌ముల్కీ ముస్లింలకు విద్వేషాలు మొదలయ్యాయి. నాన్‌ముల్కీ ముస్లింలు అహంభావం ప్రదర్శించేవారు. నాన్ ముల్కీలకు చెందిన ఇలాహి బక్ష్ అనే పత్రిక 1899లో ఈ విధంగా రాసింది. ‘హైదరాబాద్‌లో పరిపాలనా బాధ్యతలు అప్పగించాలంటే తెలివిగల ముల్కీని ఎక్కడని వెతకాలి’ అని ప్రశ్నించింది. ఇలాంటి అహంభావ చర్యల  వల్ల విద్వేషాలు వచ్చాయి. మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో 4 రకాల ముల్కీలు ఉండేవారు.
1) బోనఫైడ్ ముల్కీలు
2) హైదరాబాద్‌లో జన్మించిన భూమి పుత్రులైన ముల్కీలు
3) 15 ఏళ్లు స్థిర నివాసం ఉన్న ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి పిల్లలు
4) 12 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న నాన్‌ముల్కీల పిల్లలు
నిజాం ప్రభుత్వం 1887లో నిజాం కళాశాల ఏర్పాటు చేసింది. ఇది మొదటి ఇంగ్లిష్ మీడియం కళాశాల. మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేసింది. 20వ శతాబ్ద ప్రారంభంలో మహారాజ కిషన్ ప్రసాద్ ప్రధాని అయ్యారు. అప్పటికి హిందువుల్లో విద్యావంతుల సంఖ్య పెరిగింది. అప్పటివరకు నాన్‌ముల్కీలపై ముల్కీ ముస్లింలకు మాత్రమే ఉన్న అసంతృప్తి హిందువుల్లోనూ ప్రబలింది. దాంతో ప్రధాని మహారాజ కిషన్ ప్రసాద్ ముల్కీ నిబంధనలను మరింత కఠినతరం చేశాడు. హైదరాబాద్ సంస్థానం, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని కూడా ముల్కీలుగానే పరిగణించే విధంగా చేశాడు. ముల్కీ ఉల్లంఘనలను నియంత్రించడానికి కృషి చేశాడు.

ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్
మీర్ మహబూబ్ అలీ ఖాన్ 1911 ఆగస్టులో మరణించాడు. అనంతరం అతని కుమారుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సింహాసనం అధిష్టించాడు. రాజ్యాంగ సంస్కరణల్లో భాగంగా 1919లో ముల్కీ ఫర్మానాను జారీ చేశాడు. ముల్కీ నిబంధనలు మరింత పటిష్టం చేశాడు.  దీని ప్రకారం హైదరాబాద్ రాష్ట్రంలో జన్మించిన పౌరులు, రాష్ట్రంలో 15 ఏళ్లు నివసించిన వారు ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి అర్హులు.
1918 సెప్టెంబర్ 22న ఉస్మానియా విశ్వవిద్యాలయన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఫర్మానా జారీ చేశాడు.  ఇక్కడ చదివిన మొదటి బ్యాచ్ విద్యార్థులే 1920 ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి తెలంగాణలో విద్యావ్యాప్తి కోసం కృషి చేశారు.
తదనంతర కాలంలో నిజామ్స్ సబ్జెక్ట్స్ లీగ్ అనే సంస్థ ఏర్పాటైంది. దీన్నే 1935 నుంచి ముల్కీ లీగ్‌గా వ్యవహరించారు. నిజామ్స్ స్కాలర్‌షిప్‌పై లండన్‌లో చదువుకొని అక్కడే 1926లో సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ అనే సంస్థను స్థాపించారు. వీరే ముల్కీలీగ్‌లో ముఖ్య బాధ్యతలు చేపట్టారు. వీరు భారత్‌కు వచ్చి ఇక్కడి పరిస్థితిని పరిశీలించి ముల్కీలీగ్‌లో పాల్గొన్నారు. దీనిలో ముఖ్యంగా సర్ నిజామత్ జంగ్, అబుల్ హసన్ సయ్యద్ అలీ, సయ్యద్ ఆబీద్ హసన్, జాగీర్దారు బహదూర్ యార్ జంగ్, ఉర్దూ పత్రిక ఎడిటర్ మీర్ అక్బర్ అలీ ఖాన్ ఉన్నారు. వీళ్లతో పాటు బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావు, మందుముల నర్సింగరావు, జాగీర్దార్ వామన్ నాయక్, కాశీనాథ్ వైద్య, పద్మజానాయుడు ముల్కీలీగ్‌లో చురుకైన పాత్ర పోషించారు. వీరి ప్రధాన డిమాండ్ నాన్ ముల్కీలను తొలగించి ముల్కీలను ఉద్యోగాల్లో నియమించాలి.1937లో ముల్కీలీగ్‌లో చీలిక ఏర్పడి  హైదరాబాద్ పీపుల్స్ కన్వెన్షన్ (1937) ఏర్పాటుకు దారి తీసింది. ఇదే 1938కి స్టేట్ కాంగ్రెస్ అయింది. రాజ్యాంగ సంస్కరణలను సూచించడానికి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దివాన్ బహదూర్ అరవముదు అయ్యంగార్ చైర్మన్‌గా 1937లో కమిటీ వేశాడు. ఈ కమిటీ తన నివేదికను 1937 జూలై 19న సమర్పించింది. ఇది వివిధ సంస్కరణలను సూచిస్తూ, ముల్కీ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని నివేదికలో పేర్కొంది.

పోలీస్ చర్య
1948 సెప్టెంబర్ 17 పోలీస్ చర్య అనంతరం జేఎన్ చౌధురీ నేతృత్వంలో మిలిటరీ ప్రభత్వం ఏర్పడింది. ఆయన ఒక పెన్ను పోటుతో వేలాది మంది ముస్లిం ఉద్యోగులను బర్త్ చేశాడు. 16 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, చీఫ్ సెక్రటరీ, అన్ని డిపార్టుమెంట్‌లో ఉద్యోగులను తొలగించాడు. చాలామందిని జైళ్లో పెట్టించాడు. వీరి స్థానాల్లో మద్రాసు నుంచి వచ్చిన ఆంధ్ర ప్రాంతం వారిని నియమించాడు. దీనితో అప్పటికే నిరుద్యోగం పెరిగిపోవడంతో స్థానిక హిందువులు, ముస్లింల్లో అసంతృప్తి పెరిగింది.
Published date : 03 Oct 2015 03:38PM

Photo Stories