Skip to main content

ముల్కీ నిబంధనలు..మినహాయింపు

హైదరాబాద్ ప్రభుత్వం 1949 నవంబర్ 1న జారీ చేసిన సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్‌‌స (ఏడో ఎడిషన్)లోని ఆర్టికల్ 39, అనుబంధం ‘ఎన్’లో ముల్కీ రూల్స్‌ను పొందుపర్చారు. దీనిలో 1919లో నిజాం జారీ చేసిన ఫర్మానాలోని ముల్కీ నిబంధనలనే మరోసారి ప్రస్తావించారు. దీని ప్రకారం, 1) హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన స్థానికులకు (ముల్కీ) పుట్టిన పిల్లలను, 2) 15 ఏళ్లు హైదరాబాద్ రాష్ట్రంలో స్థిర నివాసం కలిగి ఉన్న వ్యక్తులకు, 3) హైదరాబాద్ ప్రభుత్వ సర్వీసుల్లో 15 ఏళ్లు పూర్తి చేసుకున్నవారి పిల్లలను (ఆ వ్యక్తి పూర్వం నివసించిన ప్రాంతానికి తిరిగి వెళ్లే ఆలోచన వదులుకున్నానని మేజిస్ట్రేట్ ముందు ధ్రువీకరించిన అఫిడవిట్ ఇవ్వాలి), 4) ఇక్కడి ముల్కీని పెళ్లి చేసుకున్న మహిళలను ముల్కీలుగా పరిగణిస్తారు. భారత ప్రభుత్వం 1949 డిసెంబర్ 1న జె.ఎన్.చౌధురీని పుణే మిలిటరీ సర్వీస్‌కు పంపించింది. ఆయన స్థానంలో అదే రోజున సివిల్ సర్వీసెస్ అధికారి వెల్లోడి నేతృత్వంలో ప్రభుతాన్ని ఏర్పాటుచేసింది. వెల్లోడి బాధ్యతలు స్వీకరించడానికి ముందే పోలీసు, విద్య, వ్యవసాయం, రెవెన్యూ మొదలైన రంగాల్లో దాదాపు కొన్ని వేల మంది ఆంధ్ర, ఇతర రాష్ట్రాల వారు ఉద్యోగాల్లో చేరారు. వీరిలో అత్యధికంగా పోలీసు డిపార్టుమెంట్‌లో 4981 మంది చేరారు. వీరిలో 3111 మంది ఆంధ్రప్రాంతం వారు. దీనితో తెలంగాణ ప్రాంతం నాయకుల్లో అసంతృప్తి పెరిగింది. 1950 జనవరి 23న జరిగిన హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో కొండా వెంకట రంగారెడ్డి ముల్కీలకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడారు. నాన్‌ముల్కీలకు కాలపరిమితి విధించి బదిలీ చేయడమో, తొలగించడమో చేయాలని వెల్లోడిని డిమాండ్ చేశారు.
ముల్కీ నిబంధనలకు రాజ్యాంగ రక్షణ
1950 జనవరి 26న రాజ్యాంగాన్ని అమలు చేస్తోన్న సమయంలో హైదరాబాద్‌ను బి స్టేట్స్ జాబితాలో చేర్చారు. అదేరోజు వెల్లోడి ముఖ్యమంత్రిగా, నిజాం రాజ్‌ప్రముఖ్‌గా ప్రమాణం చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 35 (బి) ద్వారా అంతకుముందు అమల్లో ఉన్న ముల్కీ నిబంధనలను యథాతథంగా కొనసాగించాలని రాజ్యాంగంలో పేర్కొన్నారు. ఇది ఆర్టికల్ 16లో ఉన్న ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కాదని తెలిపారు. ఈ విధంగా ముల్కీ నిబంధనలకు రాజ్యాంగ రక్షణ లభించింది.
1950 జూన్ 12న వెల్లోడి కేబినెట్ ఏర్పాటయింది. ఇందులో వి.బి.రాజు, బూర్గుల రామకృష్ణారావు, పూల్‌చంద్ గాంధీ, వినాయక్ విద్యాలంకార్, శేషాద్రి, సీవీఎస్ రావు, నవాబ్ జైన్ యార్ జంగ్ ఉన్నారు. 1950 జూన్ 14న 7325 నంబర్‌తో వెల్లోడి ఒక సర్క్యులర్ జారీచేశారు. అప్పటి వరకు ఉన్న ముల్కీ నిబంధనలను పక్కన పెట్టి ‘రెసిడెంట్స్’ అంటే.. 15 ఏళ్లు నివాసం ఉంటే చాలు అనే ఒక నిబంధనను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలనేది ఈ సర్క్యులర్ సారాంశం. అదేవిధంగా 1951 సెప్టెంబర్ 18న ప్రభుత్వం మరో సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం విద్య, వైద్య అవసరాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లినా ఆ సమయాన్ని కూడా రెసిడెంట్స్ హోదాను నిర్ధారించడంలో కలుపుతారు.
1952లో ప్రజా ప్రభుత్వం
 హైదరాబాద్ రాష్ట్రంలో 1952లో జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం బూర్గుల రామకృష్ణారావును ముఖ్యమంత్రిగా ఎంపికచేసింది. దాంతో 1952 మార్చి 6న  హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. 1955 నవంబర్ 9న భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 309లో ఉన్న నిబంధనలను అనుసరించి అప్పటి హైదరాబాద్ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించిన సర్క్యులర్ జారీ చేసింది. ఇందులో జనరల్ రిక్రూట్‌మెంట్ రూల్స్ ఉన్నాయి. దీంతో అంతకుముందు ఉన్న నిబంధనలన్నీ రద్దయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలంటే.. నివాస అర్హతలు కనీసం 15 ఏళ్లు ఉండాలనే నిబంధనను మాత్రమే పెట్టారు. అదేవిధంగా 1949 నవంబర్ 1న జారీ చేసిన హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్స్‌ను యథాతథంగా దీంట్లో పొందుపర్చారు.
 ఆంధ్రప్రదేశ్ ఉల్లంఘనలు
1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రాల పునర్విభజన చట్టం-1956, సెక్షన్ 119 ప్రకారం.. అంతకు ముందున్న ముల్కీ నిబంధనలు యథాతథంగా అమలు కావాలి. దీని ప్రకారం పార్లమెంట్ 1957 డిసెంబర్ 7న పబ్లిక్ ఎంప్లాయిమెంట్ యాక్ట్-1957 తీసుకొచ్చింది. 1959 మార్చి 21న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ రూల్స్-1959 అమల్లోకి వచ్చాయి. దీని ద్వారా నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల, శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించారు. కానీ పెద్దమనుషుల ఒప్పందంలో పేర్కొన్న దానికి భిన్నంగా గెజిటెడ్ ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించలేదు. ఈ చట్టం కాలపరిమితి అయిదేళ్లుగా నిర్ణయించారు. తర్వాత 1964లో ప్రాంతీయ కమిటీ, స్థానిక ఎమ్మెల్యేల ఒత్తిడి వల్ల మరో అయిదేళ్ల వరకు, 1969లో తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో మరో అయిదేళ్లూ పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ రూల్స్ ప్రకారం.. సచివాలయం, రాష్ట్ర శాఖాధిపతుల కార్యాలయాల్లో ప్రతి మూడు ఉద్యోగ ఖాళీల్లో ప్రతి రెండో ఉద్యోగం స్థానికుడితో భర్తీ చేయాలనే నిబంధన ఉంది. మిగతా రెండు ఉద్యోగాలను ఓపెన్ కోటాలో భర్తీ చేయాలి. కానీ ఆ పోస్టుల్లో 1956 నుంచి 1968 వరకు ఆంధ్రప్రాంతం వారినే నియమిస్తూ వచ్చారని తెలంగాణ ప్రాంతీయ కమిటీ నియమించిన అడ్‌హక్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. తెలంగాణ ప్రాంత ఉద్యోగ నియామకాలకు సంబంధించి స్పష్టమైన విధివిధానాలు, రూల్స్ ఉన్నప్పటికీ వాటిని ప్రతిసారి ఉల్లంఘిస్తూ సచివాలయం, వివిధ శాఖాధిపతుల కార్యాలయాల్లో, వివిధ ప్రభుత్వోద్యోగాల్లో తెలంగాణ ప్రాంతం వారికి అన్యాయం జరిగింది.
అధికారిక మినహాయింపులు
1968 వరకు రూల్స్‌ను అతిక్రమించి ఉద్యోగ నియామకాల్లో అధికారికంగా మినహాయింపులు ఇచ్చారు. అవి ఆరు విధాలుగా ఉన్నాయని ప్రాంతీయ కమిటీ అభిప్రాయపడింది. అవి.. 1) భార్య, భర్త వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నారనే కారణంతో, 2) అర్హత ఉన్న స్థానికులు లభించడం లేదనే కారణంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్  ద్వారా స్థానికేతరుల నియామకం (ఉదాహరణకు ఉద్యోగ అర్హతలకు సంబంధించి తెలంగాణ ప్రాంతంలో లేని కోర్సులను నిబంధనగా పెట్టేవారు. అర్హుడైన స్థానిక వ్యక్తి లేరనే కారణంతో ఆంధ్రప్రాంతం నుంచి ఉద్యోగాల్లో నియమించారు), 3) తాత్కాలిక సర్దుబాటు కోసం జరిగిన నియామకాలు, 4) పరస్పర ఆమోదంతో బదిలీలు, 5) పాకిస్తాన్, బర్మా కాందిశీకులు, సైన్యంలోని అధికారుల కుటుంబాలపై ఆధారపడ్డ వారు, 6)మానవీయ కోణంలో జరిగిన నియామకాలు.
ఈ విధంగా అడుగడుగునా ముల్కీ నిబంధనల ఉల్లంఘనలు జరుగుతూ వచ్చాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం  ఉద్యోగాలకు సంబంధించిన విషయం ప్రాంతీయ కమిటీ  పరిధిలోకి రాదని ప్రభుత్వం చెప్పింది. ఈ కారణంతో ఉద్యోగాలపై ప్రాంతీయ కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు ప్రాతిపదికైన పెద్దమనుషుల ఒప్పందంలో ఉద్యోగాలకు సంబంధించిన విషయం ప్రాంతీయ కమిటీ పరిధిలోకే వస్తుందని ఉంది.
తెలంగాణ రక్షణల ఉద్యమం
ముల్కీ నిబంధనల ఉల్లంఘనలపై అప్పటి టీఎన్‌జీవో యూనియన్ అధ్యక్షుడు కె.ఆర్.ఆమోస్ 1965 నుంచి తెలంగాణకు జరుగుతోన్న అన్యాయాలపై ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తూ వచ్చారు. 1968లో కె.ఆర్.ఆమోస్, టీఎన్‌జీవోలు కలిసి తెలంగాణ రక్షణల ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం 1968 ఏప్రిల్ 30న నాన్‌ముల్కీలను తొలగించి, ఆ స్థానాల్లో ముల్కీలను భర్తీ చేయాలని మెమో జారీ చేసింది. విద్యుత్, పంచాయతీ, అగ్రికల్చర్ శాఖల్లో కొంతమంది నాన్‌ముల్కీలను తొలగించారు. ఈ నాన్ ముల్కీలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు న్యాయమూర్తి కుప్పుస్వామి 1969 జనవరిలో విద్యుత్ బోర్డ్ ఉద్యోగులకు ముల్కీ నిబంధనలు వర్తించవని తీర్పునిచ్చారు.
1969 ఫిబ్రవరి 3న జస్టిస్ చిన్నప్పరెడ్డి పంచాయతీరాజ్ ఉద్యోగుల కేసులో కూడా ముల్కీ నిబంధనలు చెల్లవని తీర్పునిచ్చారు. 1969 ప్రారంభం నాటికే తెలంగాణ రక్షణల ఉద్యమం అన్ని జిల్లాలకు వ్యాపించింది. ఉద్యోగులతో పాటు విద్యార్థులు, రాజకీయ నాయకులు ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.
ప్రత్యేక రాష్ట్ర డిమాండ్
తెలంగాణ రక్షణల అమలు కోసం 1969 జనవరి 8న ఖమ్మం జిల్లాలో కొలిశెట్టి రామదాసు, శాసన సభ్యుడు టి.పురుషోత్తమ రావు ఆధ్వర్యంలో రవీంద్రనాథ్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. జనవరి 15న ఉస్మానియా కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలంగాణ రక్షణల అమలు కోసం నిరవధికంగా తరగతుల బహిష్కరణకు పిలుపునిచ్చాడు. అదే సంఘం కార్యదర్శి మల్లికార్జున్, విద్యార్థి నేత శ్రీధర్ రెడ్డి మొదలైనవారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థి ఉద్యమాన్ని ప్రారంభించారు. తెలంగాణ రక్షణల అమలు కోసం జరిగిన ఉద్యమానికి అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి పరోక్షంగా సహకరించారు. 1969 జనవరి 18 నాటికి మల్లికార్జున్ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ఉధృతమైంది. దీంతో ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి జనవరి 18, 19 తేదీల్లో తన నివాసంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. జనవరి 19న అఖిలపక్ష ఒప్పందం చేసుకున్నారు. జనవరి 21న జీవో నంబర్ 36ను జారీ చేస్తూ దీని ప్రకారం ముల్కీ నిబంధనలు ఉల్లంఘించి నియమితులైన నాన్‌ముల్కీలను 1969 ఫిబ్రవరి 28లోపు తొలగించాలని పేర్కొన్నారు. ఆ ఖాళీల్లో తెలంగాణ స్థానికులను నియమిస్తామనీ ఇచ్చారు.
సుప్రీం కోర్టు తీర్పు
నాన్ ముల్కీలను తొలగించేందుకు జారీ అయిన జీవో నంబర్ 36పై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1969 ఫిబ్రవరి 17న ఈ జీవోపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉండగానే ఫిబ్రవరి 20న జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి, జస్టిస్ ఆవుల సాంబ శివరావులతో కూడిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఫిబ్రవరి 3న జస్టిస్ చిన్నప్పరెడ్డి ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ముల్కీ రూల్స్ సక్రమమే అని తీర్పునిచ్చింది. అప్పటికే సుప్రీంకోర్టు స్టే ఉండటంతో జీవో 36ను అమలు చేయలేదు. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హిదయతుల్లా ఆధ్వర్యంలోని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 1969 మార్చి 28న జీవో 36ను కొట్టివేస్తూ  ముల్కీ రూల్స్ చెల్లవని తీర్పునిచ్చింది. ముల్కీలకు రిజర్వేషన్లు కల్పించిన పబ్లిక్ ఎంప్లాయిమెంట్ యాక్ట్‌లోని సెక్షన్ 3 చెల్లదని తీర్పు చెప్పింది.
వాంఛూ కమిటీ ఏర్పాటు
మరోవైపు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. తెలంగాణ రక్షణల అమలు కోసం ప్రధాని ఇందిరాగాంధీ 1969 ఏప్రిల్ 9, 10 తేదీల్లో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి ఆంధ్ర, తెలంగాణ నాయకులతో చర్చించారు. లోక్‌సభలో 1969 ఏప్రిల్ 11న ఎనిమిది సూత్రాల పథకాన్ని ప్రకటించారు. దీనిలో భాగంగా ముల్కీ రూల్స్ రాజ్యాంగ విరుద్ధమన్న తీర్పును దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ముల్కీలకు న్యాయం జరిగేలా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వాంఛూ ఆధ్వర్యంలో న్యాయ నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ.. కోర్టు తీర్పులను, వివిధ అంశాలను క్షుణ్నంగా పరిశీలించి రాజ్యాంగంలోని 16వ అధికరణం ప్రకారం ఒక రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో ఉద్యోగాల్లో  రిజర్వేషన్లు కల్పించడానికి అవకాశం లేదని తేల్చింది. ఈ విషయంలో రాజ్యాంగాన్ని సవరించడానికి కూడా వీలుకాదని గతంలో గోలక్‌నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించింది. ఇందుకు ప్రత్యామ్నాయంగా జిల్లా, డివిజన్, తాలుకా స్థాయిల్లో, ప్రాంతీయ కార్యాలయాల్లో సబార్డినేట్ ఉద్యోగాలకు స్థానికంగా ఉద్యోగ నియామకాలు జరగాలని వాంఛూ కమిటీ సూచించింది. స్థానికంగా జరిగే ఉద్యోగ నియామకాలకు కూడా రాష్ట్రం మొత్తం నుంచి పోటీ పడొచ్చు కానీ స్థానిక అభ్యర్థులే ఎక్కువగా దరఖాస్తు చేసుకుంటారనీ వాంఛూ కమిటీ పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పు, వాంఛూ కమిటీ నివేదిక ఆధారంగా సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రక్షణల అమలు జరగవని తెలంగాణ ఉద్యోగులు, విద్యార్థులు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమం నడిపారు.
ముల్కీ రూల్స్ సక్రమమే
1970 డిసెంబర్ 9న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కొమరయ్య ఆధ్వర్యంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ఫుల్ బెంచ్... ‘సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పబ్లిక్ ఎంప్లాయిమెంట్ యాక్ట్‌లోని సెక్షన్ 3ను కొట్టివేసింది కాబట్టి ఆ చట్టం అమల్లోకి రాకముందు ఉన్న ముల్కీ రూల్స్ యథాతథంగా అమలవుతాయి. ముల్కీ రూల్స్ సక్రమమే’ అని తీర్పునిచ్చింది. 1949 నవంబర్ 1న జారీ చేసిన రెగ్యులేషన్‌‌సలోని నిబంధనలన్నీ అమల్లో ఉన్నాయనే భావించాలని పేర్కొంది. దీంతో గతంలో వెల్లోడి ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్లు రద్దయ్యాయి. 1955లో బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం ఇచ్చిన జీవో చెల్లదని తీర్పులో పేర్కొన్నారు. ఈ తీర్పుతో గెజిటెడ్ ఉద్యోగులకు కూడా రిజర్వేషన్లు వర్తింపజేయాల్సి ఉంటుంది.
1972 ఫిబ్రవరి 14న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయిదుగురు జడ్జీల ధర్మాసనంలో (ఓబుల్ రెడ్డి, కొండా మాధవ రెడ్డి, కొండయ్య, ఏడీవీ రెడ్డి, శ్రీరాములు) మెజారిటీ జడ్జీలు ముల్కీ నిబంధనలు చెల్లవని తీర్పునిచ్చారు. ఈ బెంచ్‌లో ఉన్న జస్టిస్ మాధవరెడ్డి ముల్కీ రూల్స్ సక్రమమే అని విడిగా తీర్పునిస్తూ నలుగురి జడ్జీలతో విభేదించారు. ఈ తీర్పు వచ్చేనాటికి అప్పటి ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు సుప్రీం కోర్టుకు అప్పీలు చేశారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిక్రి ఆధ్వర్యంలో అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ అప్పీలును విచారించి
1972 అక్టోబర్ 3న ముల్కీ నిబంధనలు సక్రమమేనని తుది తీర్పు చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి కొమరయ్య ఇచ్చిన తీర్పును ఖరారు చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్లో ఇదే చివరిది. దీనిపై ఎలాంటి అప్పీలు ఉండదు.
 సుప్రీం కోర్టు తీర్పు పర్యావసనంగా జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. ఆ తర్వాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. ప్రధాని ఇందిరాగాంధీ ఆరు సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని అమలు కోసం 1975లో భారత రాజ్యాంగంలోని 371వ అధికరణను సవరించి  ఉద్యోగులకు ఉండాల్సిన అర్హతలను, స్థానికతను నిర్దేశిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. దీని ద్వారా అంతకుముందున్న ముల్కీ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పు, ప్రాంతీయ కమిటీ అన్నీ రద్ద్దయ్యాయి!!
Published date : 09 Oct 2015 03:09PM

Photo Stories