ముఖ్యమైన పండగలు
తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండగ ప్రసిద్ధమైంది. దీన్ని అత్యంత వైభవంగా జరుపుకొంటారు. ఇది ప్రధానంగా స్త్రీల పండగ. పసుపుతో గౌరీదేవి ప్రతిమను రూపొందించి, కుంకుమబొట్టు పెట్టి పూలతో అలంకరిస్తారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర పూలతో బతుకమ్మలను పేరుస్తారు. వాటిని ఒక చోట పెట్టి మహిళలందరూ వాటి చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ పాటలు పాడతారు. పాట చివరన ‘ఉయ్యాలో’, ‘వలలో’, ‘చందమామ’ లాంటి పదాలను ఉపయోగిస్తారు. ఆడటం పూర్తయిన తర్వాత బతుకమ్మలను గ్రామంలోని చెరువులో నిమజ్జనం చేస్తారు. మలిద (చక్కెర లేదా బెల్లం, రొట్టెతో చేసిన పదార్థం)ను బంధుమిత్రులకు ప్రసాదంగా పంచిపెడతారు. ఆ తర్వాత పాటలు పాడుతూ, బతుకమ్మను కీర్తిస్తూ ఇంటికి చేరుతారు. దీన్ని ప్రకృతి దేవత ఆరాధనకు సంబంధించిన పండగగా అభివర్ణించవచ్చు.
బతుకమ్మ పండగకు ఉన్న విశిష్టత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం 2014 జూన్ 16న దీన్ని ‘రాష్ట్ర పండగ’గా ప్రకటించింది. ఈ పండగను ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు నిర్వహిస్తారు. చివరి రోజు నిర్వహించే పండగను ‘సద్దుల బతుకమ్మ’గా పేర్కొంటారు. ఈ రోజు పెరుగన్నం, చింతపండు పులిహోర, నువ్వుల పొడి అన్నం, నిమ్మకాయ పులిహోర, కొబ్బరి అన్నం మొదలైనవాటితో అయిదు లేదా తొమ్మిది రకాల సద్దులు (భోజనం) రూపొందించి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. బతుకమ్మను పూజించడమంటే లక్ష్మీదేవిని ఆరాధించడమే. లక్ష్మీదేవి మానవాళికి సమస్త భాగ్యాలు, సుఖశాంతులను ప్రసాదిస్తుందని ప్రజల నమ్మకం. తెలంగాణ సంస్కృతికి ప్రతీక ఈ పండగ. ఇది ఐక్యత, సోదర భావం, ప్రేమకు ప్రతిరూపం. వరంగల్‌లోని పద్మాక్షీ గుట్ట, హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద బతుకమ్మను కన్నుల పండువగా నిర్వహిస్తారు.
బొడ్డెమ్మ పండగ
దీన్ని పెళ్లికాని ఆడపడుచులు జరుపుకొంటారు. వినాయకచవితి లేదా భాద్రపద బహుళ పంచమితో మొదలుపెట్టి మహాలయ అమావాస్య వరకు బొడ్డెమ్మ పండగ నిర్వహిస్తారు. ప్రత్యేకమైన పీటపై పుట్టమన్నుతో బతుకమ్మ ఆకారంలో త్రికోణ గోపురం నిర్మించి దాని చుట్టూ తంగేడు, బంతి, చామంతి తదితర పూలతో అలంకరిస్తారు. బొడ్డెమ్మ తల భాగంలో కలశాన్ని పెట్టి బియ్యం పోసి కొత్త రవికపై పసుపు ముద్దతో చేసిన గౌరమ్మను పెడతారు. సాయంకాలం ఆరుబయట పుట్టమన్నుతో అలికిన స్థలంలో ఈ బొడ్డెమ్మలను పెట్టి వాటి చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ పాటలు పాడతారు. చివరకు పప్పు, బెల్లాన్ని ప్రసాదంగా పంచుకుంటారు. దీన్ని కూడా తొమ్మిది రోజులపాటు జరుపుకొంటారు. చివరి రోజున కలశంలో తొమ్మిది రోజులు పోసిన బియ్యంతో పాయసం చేసుకుంటారు.
బతుకమ్మ తొమ్మిది రోజుల పేర్లు- నైవేద్యం
1. ఎంగిలి పూల బతుకమ్మ - నువ్వులు, నూకలు
2. అటుకుల బతుకమ్మ - ఉడకబెట్టిన పప్పు, బెల్లం, అటుకులు
3. ముద్దపప్పు బతుకమ్మ - తడి బియ్యం, పాలు, బెల్లం
4. నానబియ్యం బతుకమ్మ - తడి బియ్యం, పాలు, బెల్లం
5. అట్ల బతుకమ్మ - అట్లు
6. అలిగిన (అలుక) బతుకమ్మ - అట్లు
7. వేపకాయల బతుకమ్మ - వేపపండ్ల ఆకారంలో బియ్యం పిండి
8. వెన్నముద్దల బతుకమ్మ - వెన్న, నువ్వులు, బెల్లం
9. సద్దుల బతుకమ్మ - 5 లేదా 9 రకాల సద్దులు (అన్నం)
బోనాలు
తెలంగాణలో అత్యంత వైభవంగా నిర్వహించే మరో పండగ ‘బోనాలు’. బోనం అంటే భోజనం. వర్షాకాలంలో వచ్చే రోగాల నుంచి ప్రజలను, పశువులను, పంటను కాపాడాలని అమ్మవారిని వేడుకొని, నైవేద్యం సమర్పించే పండగ ఇది. గోల్కొండ దుర్గమ్మ, పోచమ్మలు సహా గ్రామదేవతలందరికీ బోనాలు సమర్పిస్తారు. పరమాన్నం, పప్పన్నంతోపాటు రకరకాల పిండి వంటలు చేస్తారు. ఫలాలు, పూలతో బండ్లను అలంకరించి వాటిని గుడి వద్దకు తీసుకు వస్తారు. ఈ పండగలో పోతురాజు వేషధారణ ప్రత్యేకమైంది. బోనాల పండగలో రెండో రోజు ‘రంగం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో మహిళ ‘భవిష్యవాణి’ వినిపిస్తుంది. అంటే రాబోయే కాలంలో ప్రజలు, ఎదుర్కొనే కష్టసుఖాల గురించి తెలుపుతుంది.
తెలంగాణ ప్రభుత్వం బోనాల పండగను కూడా ‘రాష్ట్ర పండగ’గా ప్రకటించింది. ఈ పండగను హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు తెలంగాణలోని పల్లెల్లో ఎంతో వైభవంగా జరుపుకొంటారు. సాధారణంగా ఈ పండగ ఆషాఢం (జూలై లేదా ఆగస్టు)లో వస్తుంది. మహిళలు పరమాన్నం, పప్పు, పలహారాలను తలపై పెట్టుకొని దుర్గమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ దేవాలయాలకు వెళ్లి సమర్పిస్తారు. కొత్తగా పెళ్లైన కూతురు పుట్టింటికి వచ్చిన విధంగానే ఆషాఢం నెలలో దేవి (అమ్మవారు) తన పుట్టింటికి వస్తుందని జానపదుల నమ్మకం. అందుకే భక్తులందరూ ఈ పండగ సమయంలో గ్రామ దేవతలను దర్శించుకొని వివిధ పిండి వంటలతో బోనాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ విధానాన్ని ‘ఊరడి’ అంటారు.
ఉగాది
చైత్ర శుద్ధ పాడ్యమి (మార్చి - ఏప్రిల్) రోజున నిర్వహించుకునే ఉగాదితో తెలుగు ప్రజల ‘కొత్త సంవత్సరం’ ప్రారంభమవుతుంది. ఈ రోజు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి కొత్తబట్టలు కట్టుకుంటారు. ఈ పండగ రోజు తయారు చేసే ఉగాది పచ్చడికి ప్రత్యేకత ఉంది. మామిడికాయ, చింతపండు, బెల్లం, వేపపూలు, నీరు, ఉప్పు ఉపయోగించి షడ్రుచులతో కూడిన పచ్చడి రూపొందించి ఇంటిల్లిపాది స్వీకరిస్తారు. ఇందులోని పులుపు, చేదు, తీపి, వగరు తదితర రుచులు జీవితం సుఖదుఃఖాలమయం అనే విషయాన్ని సూచిస్తాయి.
ఉగాది పండగ మరో ప్రత్యేకత ‘పంచాంగ శ్రవణం’. సాయంత్రం వేళ ప్రజలందరూ ఆలయాల వద్దకు చేరుకొని పండితులు చెప్పే పంచాంగ వివరాలు తెలుసుకుంటారు. దీని ఆధారంగా కొత్త ఏడాది తమ అదృష్ట, దురదృష్టాలను అంచనా వేసుకొని తదనుగుణంగా నడచుకుంటారు.
ఉగాదితో తెలుగువారితో పాటు కన్నడ, కొంకణి, బాలి ప్రజల కొత్త సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది. దీన్ని వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా వ్యవహరిస్తారు.
వివిధ రాష్ట్రాల్లో నూతన సంవత్సర పండగల పేర్లు
రాష్ట్రం | ప్రజలు | పేరు |
మహారాష్ట్ర | మరాఠీలు | గుడిపాడ్వా |
తమిళనాడు | తమిళులు | పుత్తాండు |
కేరళ | మళయాలీలు | విషు |
పంజాబ్ | సిక్కులు | బైశాఖీ |
పశ్చిమ బెంగాల్ | బెంగాలీలు | పోయ్‌లా బైశాఖీ |
శ్రీరామనమి
శ్రీరాముడితో సీతాదేవికి వివాహం జరిగిన రోజును ‘శ్రీరామనవమి’గా నిర్వహించుకుంటారు. ప్రతి పల్లె, పట్టణాల్లోని రామాలయాల్లో కల్యాణోత్సవాన్ని ఘనంగా జరుపుతారు. మార్చి-ఏప్రిల్‌లో నిర్వహించే ఈ వేడుకల్లో భక్తజనం ఉత్సాహంగా పాల్గొంటారు. ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున భద్రాచల సీతారాములకు పట్టు పీతాంబరాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. ఈ ఆనవాయితీ కుతుబ్‌షాహీల కాలం నుంచే ఉంది.
వినాయక చవితి
భాద్రపద శుద్ధ చవితి (ఆగస్టు-సెప్టెంబర్) రోజు నిర్వహించుకునే పండగ వినాయక చవితి. పార్వతీపరమేశ్వరుల కుమారుడైన గణపతికి ప్రజలు ఘనంగా పూజలు నిర్వహించి తమ ప్రయత్నాలు, పనులు నిర్విఘ్నంగా పూర్తయ్యేలా దీవించాలని వేడుకుంటారు. పొద్దున్నే నిద్ర లేచి స్నానమాచరించి, పొలాల్లోంచి 21 రకాల ఆకులు, పూలను తెచ్చి, మట్టితో చేసిన వినాయకుడిని అందంగా అలంకరిస్తారు. వీధుల్లో పెద్ద మండపాలను నిర్మించి, వినాయక విగ్రహాలను ప్రతిష్టించి తొమ్మిది రోజులు పూజ చేస్తారు. తర్వాత స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. హైదరాబాద్‌లో నిర్వహించే గణపతుల నిమజ్జనోత్సవం కన్నుల పండువగా సాగుతుంది. హుస్సేన్ సాగర్‌లో కొన్ని వేల విగ్రహాలను నిమజ్జనం చేసే ఊరేగింపులో విదేశీ పర్యాటకులు సైతం పాల్గొంటారు.
దసరా
దుర్గ అనే స్త్రీ శక్తిని మహిషాసుర మర్దినిగా కొలుస్తారు. ఇది మహాభారత, రామాయణ కాలాల నుంచి ఆచారంగా వస్తోంది. జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పండుగ మరో ప్రత్యేకత ‘ఆయుధ పూజ’. వివిధ రకాల వృత్తి పనివాళ్లు తమ పనిముట్లు, వాహనాలకు పూజ చేస్తారు. దసరా రోజున వరంగల్ భద్రకాళి దేవాలయంలో ఘనంగా ఉత్సవాలు జరుపుతారు. భద్రకాళి చెరువులో జరిగే హంస వాహన తెప్పోత్సవం పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది.
శివరాత్రి
ఈ పండగ ఫిబ్రవరి లేదా మార్చిలో వస్తుంది. ఈ రోజు దేవాలయాల్లో శివుడు, పార్వతికి కల్యాణం నిర్వహిస్తారు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగరణం చేస్తారు. రాష్ట్రంలోని ప్రధాన శివాలయాలైన వేములవాడ, కీసర గుట్ట, ఏడుపాయల దేవాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు.
మాదిరి ప్రశ్నలు
1. రాష్ట్ర ప్రభుత్వం యోజన విద్య కోసం ‘బతుకమ్మ పండగ’ పుస్తకాన్ని ఎవరితో రాయించి, ముద్రించింది?
1) రసమయి బాలకిషన్
2) గోపు లింగారెడ్డి
3) నందిని సిధారెడ్డి
4) దేశపతి శ్రీనివాస్
- View Answer
- సమాధానం: 2
2. తెలంగాణ ప్రభుత్వం ఏయే పండగలను రాష్ట్ర పండగలుగా ప్రకటించింది?
1) సమ్మక్క- సారక్క జాతర, బోనాలు
2) బతుకమ్మ, బొడ్డెమ్మ
3) బతుకమ్మ, బోనాలు
4) సమ్మక్క సారక్క, మైసమ్మ జాతరలు
- View Answer
- సమాధానం: 3
3. తెలంగాణ ప్రాంతంలో జానపద గేయాలతో ప్రసిద్ధమైన పండగలేవి?
1) బతుకమ్మ, బొడ్డెమ్మ
2) సమ్మక్క-సారక్క, ఏడుపాయల జాతర
3) బతుకమ్మ, బోనాలు
4) సమ్మక్క సారక్క, మైసమ్మ జాతరలు
- View Answer
- సమాధానం: 1
4. ఊరడి, రంగం అనే పదాలు ఏ పండగకు సంబంధించినవి?
1) బతుకమ్మ
2) సమ్మక్క-సారక్క
3) బోనాలు
4) కొండగట్టు జాతర
- View Answer
- సమాధానం: 3
5. పెళ్లికాని యువతులు నిర్వహించుకొనే పండగ ఏది?
1) బతుకమ్మ
2) బొడ్డెమ్మ
3) బోనాలు
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
6. జంట నగరాల్లో జరిగే బోనాల పండగలో భక్తులు ప్రధానంగా పూజించే దేవత?
1) పెద్దమ్మ
2) పోచమ్మ
3) మైసమ్మ
4) మహంకాళి
- View Answer
- సమాధానం: 4
7. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండగను రాష్ట్ర పండగగా ప్రకటించిన రోజు?
1) 2014 జూన్ 2
2) 2014 జూన్ 9
3) 2014 జూన్ 16
4) 2014 జూలై 16
- View Answer
- సమాధానం:3
8. బతుకమ్మ పండగలో భాగంగా 9వ రోజును ఏమని పిలుస్తారు?
1) అటుకుల బతుకమ్మ
2) అట్ల బతుకమ్మ
3) సద్దుల బతుకమ్మ
4) వెన్నముద్దల బతుకమ్మ
- View Answer
- సమాధానం:3