TS Jr Lecturer Exam Syllabus: తెలంగాణ జూనియర్ లెక్చరర్ పేపర్–1 సిలబస్ ఇదే....
వీటిలో వర్తమానాంశాలు, అంతర్జాతీయ అంశాలు, జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, జనరల్ సైన్స్, విపత్తు నిర్వహణ, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్ ముఖ్యమైనవి. టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తోన్న అన్ని పోటీ పరీక్షలకంటే ఈ పేపర్‌లో అత్యధిక విభాగాలున్నాయి. అభ్యర్థులు దీన్ని గమనించాలి. ఈ పరీక్షలో మంచి మార్కులు రావడానికి మొదటి పేపర్ కీలకం. ఉద్యోగాన్ని నిర్ణయించేది ఈ పేపరేనని గమనించాలి. చాలామంది ఈ పేపర్‌ను నిర్లక్ష్యం చేస్తుంటారు. సిలబస్ ఎక్కువనే భయంతో సరిగా సన్నద్ధం కారు.
ప్రతీ మార్కు ముఖ్యమైనదే...
ఇంతకుముందు ఏ పోటీ పరీక్షకూ ప్రిపేర్ కానివారు పేపర్–1తో సన్నద్ధత ఆరంభించాలి. కష్టంగా భావించేవాటిని మొదట ప్రారంభించి.. చివరికి సులువుగా ఉండేవి చదవడం మేలు. పరీక్షకు 7 నెలల సమయం ఉన్నందున ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. కష్టమైన కొన్ని విభాగాలను వదిలేయడం సరైంది కాదు. అన్ని విభాగాలూ ముఖ్యమైనవే. పోటీ పరీక్షలో ప్రతి మార్కూ ముఖ్యమైనదేనని మర్చిపోకూడదు. చాలాకాలం నుంచి పోటీ పరీక్షలకు తయారవుతున్నప్పటికీ జనరల్ స్టడీస్ సిలబస్‌ను తేలిగ్గా తీసుకోకూడదు.
ఆర్ట్స్ అభ్యర్థులు ఇలా మొదలు పెట్టండి...
ఆర్ట్స్ అభ్యర్థులు ముందుగా తమకు పట్టులేని సైన్స్, పర్యావరణం, విపత్తు నిర్వహణ, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ లాంటివి బాగా చదవాలి. సైన్స్ అభ్యర్థులు ముందుగా హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ లాంటి వాటితో సన్నద్ధత సాగించాలి. ఈ పద్ధతిని పాటిస్తే త్వరగా పేపర్–1 సన్నద్ధతను పూర్తిచేయొచ్చు. కొంతమంది ఇప్పటికే గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–4, సివిల్స్ లాంటి పోటీ పరీక్షలకు చదువుతుంటారు. వీరికి పేపర్–1 సన్నద్ధత కొంత తేలిక. వీరు పేపర్–1లో ఉన్న 15 విభాగాల్లో కష్టంగా భావించేవాటిని ముందుగా చదివి, తర్వాత అన్ని విభాగాల్లో పట్టు సాధించాలి. ఇప్పటికే ఈ పేపర్‌లో బాగా పట్టు సంపాదించివుంటే.. తరచుగా మర్చిపోతున్న అంశాల సినాప్సిస్ రాసుకుని ప్రిపరేషన్ సాగించాలి.