Government Jobs: సిలబస్ పట్టు.. ఉద్యోగం కొట్టు..
చదవడం.. సమీక్షించుకోవడం.. పట్టు సాధించడం ఇవే ప్రభుత్వ ఉద్యోగానికి తొలిమెట్టు. ఈ మెట్టు ఎక్కడానికి ప్రణాళిక అవసరం. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భర్తీ చేస్తున్న గ్రూప్–1, 2, ఉపాధ్యాయ, పోలీసు, ఇతర శాఖల పోస్టుల సాధనలో పైచేయి సాధించడానికి అభ్యర్థులు సంసిద్ధులవుతున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అనుసరించాల్సిన వ్యూహాలపై నిపుణులు సూచనలు అందిస్తున్నారు.
సిలబస్‌ను..
పరీక్ష ఏదైనా సిలబస్‌ను ఔపోసన పట్టాలని.. సిలబస్ ప్రామాణిక పత్రంగా పెట్టుకొని సన్నద్ధం కావాలని నిపుణులు పేర్కొంటున్నారు. అభ్యర్థులు రాయబోయే పరీక్ష సిలబస్, పరీక్ష స్వరూపాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు గత పరీక్ష ప్రశ్న పత్రాలు పరిశీలించి, వాటిపై కసరత్తు చేస్తే ఉపయోగకరంగా ఉంటాయి.
‘తెలంగాణ’కు ..
రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోటీ పరీక్షల నిర్వహణకు ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) సిలబస్‌లో మార్పులు చేసింది. పోటీ పరీక్షల్లో తెలంగాణ ప్రాంత రాజకీయ–సామాజిక చరిత్రకు అధిక ప్రాధాన్యాన్ని ఇస్తూ సిలబస్ రూపొందించారు. తెలంగాణ చారిత్రక నేపథ్యం మొదలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు వరకు చోటుచేసుకున్న అనేక అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమం, నక్సలిజం, రాష్ట్ర ఏర్పాటులో వివిధ రాజకీయ పార్టీల పాత్ర, టీఆర్‌ఎస్ ఏర్పా టు మొదలైన అంశాలపై కూడా పట్టు సాధించాలి.
గ్రూప్స్ పరీక్షల్లో నెగ్గాలంటే..ఇవి తప్పక చదవాల్సిందే..
పోటీ పరీక్షల బిట్‌బ్యాంక్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
జనరల్ స్టడీస్‌పై ..
రాబోతున్న ఉద్యోగ పరీక్షల్లో ‘జనరల్ స్టడీస్’ ప్రతి పరీక్షలోనూ కనిపించే సబ్జెక్ట్. జీఎస్‌పై పట్టు సాధిస్తే గ్రూప్ –1 నుంచి మొదలు పంచాయతీ సెక్రటరీ పోస్టుల వరకు సగం సన్నద్ధత లభించినట్లే. అభ్యర్థులు తాము రాయబోయే పరీక్షల సిలబస్‌లో జీఎస్‌కు ఎలాంటి సిలబస్ ఇచ్చారో ఒకసారి క్షుణ్నంగా పరిశీలించి ప్రామాణిక పుస్తకాలు ఎంచుకొని సన్నద్ధమవ్వాలి. పాలిటీ, ఎకానమీ, చరిత్ర, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంట్, జాగ్రఫీ మొదలైన జనరల్ స్టడీస్ సబ్జెక్టులకు సమకాలీన అంశాలను జోడిస్తూ చదువుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
చదవాల్సిన పుస్తకాలు..
ఇక పుస్తకాల ఎంపికలోనూ జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్‌లో లభించే ప్రతి పుస్తకం కాకుండా తెలుగు అకాడమీ పుస్తకాలు, ఏదైనా ప్రముఖ రచయితల పుస్తకాలు సేకరించుకొని చదువుకోవాలి. ప్రతి సబ్జెక్టుకు ఏదైనా ఒక్కటే పుస్తకాన్ని పలుమార్లు రివిజన్ చేయడం మేలు. ఇటీవల కాలంలో యూట్యూబ్‌లో కొన్ని చానల్స్ ఉచితంగా పోటీ పరీక్షల సిలబస్‌ను బోధిస్తున్నాయి.
TSPSC & APPSC Groups Questions : గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుంది..?
పోస్టులను సులువుగా..
పోటీ పరీక్ష ఏదైనా సిలబస్, ఎగ్జామ్ ప్యాట్రన్, గత ప్రశ్నపత్రాలు చూడాలి. ముఖ్యంగా పోలీసు పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఫిజికల్ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలి. కానిస్టేబుల్, ఎస్సైలకు ప్రిలిమ్స్ వరకు సిలబస్ కామన్‌గా ఉంటుంది కాబట్టి ఒకేసారి సన్నద్ధమవ్వచ్చు. ప్రధాన పరీక్ష సిలబస్ కూడా ఒకేలా కనిపిస్తున్నా మరింత లోతుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఏఆర్, టీఎస్‌ఎస్పీ, ఎస్పీఎఫ్ పోస్టులకు రాత పరీక్షతో పాటు ఫిజికల్ ఈవెంట్స్ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఈవెంట్స్‌లో మెరిట్ ఆధారంగా ఈ పోస్టులను సులువుగా దక్కించుకోవచ్చు.
– రాజశేఖర్, ఐరైజ్ ఫౌండర్
గ్రంథాలయంలో చదువుకునేందుకు..
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయనున్న నేపథ్యంలో బేగంపేట బ్రాహ్మణవాడీలోని స్వామి రామానందతీర్థ మెమోరియల్ కమిటీలో పీవీ నరసింహారావు స్మారక గ్రంథాలయంలో ఉద్యోగార్థులు చదువుకునేందుకు అనుకూలమైన వాతావరణం కల్పించనున్నట్లు ఎమ్మెల్సీ, కమిటీ చైర్‌పర్సన్ వాణీదేవి తెలిపారు. కమిటీ ప్రాంగణంలోని ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆమె మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఇక్కడి గ్రంథాలయంలో అవసరమైన సమాచారం, పుస్తకాలను అందుబాటులో ఉంచుతామన్నారు. గ్రంథాలయంలో చదువుకునేందుకు అనువైన వాతావరణం కల్పించినట్లు తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పీవీ స్మారక గ్రంథాలయం తెరిచి ఉంటుందని ఆమె తెలిపారు.