Telangana TET 2025 : నేటి నుంచి ఆన్‌లైన్‌లో టెట్ దరఖాస్తుల స్వీకరణ ........ టెట్ అర్హత పరీక్ష జనవరి 1 నుంచి 20వ తేదీ వరకూ
హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీ టెట్) 2025 జనవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ జరగనుంది. పాఠశాల విద్య డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి సోమవారం ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవ చ్చు. ఈ ఏడాది టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం ఇది రెండోసారి. జాబ్ క్యాలెండర్‌లో ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది మే 20 నుంచి జూన్ 2 వరకూ టెట్ నిర్వహించారు. ఈ పరీక్షలకు 2.35 లక్షల మంది హాజరయ్యారు.
వీరిలో 1.09 లక్షల మంది అర్హత సాధించారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నేపథ్యంలోనూ బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి టెట్ రాసే అవకాశం కలి్పంచారు. తాజా టెట్‌కు సంబంధించిన విధివిధానాలు, సిలబస్‌తో కూడిన సమాచార బులిటెన్ మంగళవారం https:// schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నట్టు అధికారులు తెలిపారు. అయితే ఇటీవలే 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేయడం, టెట్ నిర్వహించడంతో.. జనవరిలో నిర్వహించే టెట్‌కు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. టెట్‌లో ఒకసారి అర్హత సాధిస్తే జీవితకాలం పాటు చెల్లుబాటు అవుతుంది.
ఇదీ చదవండి: ఆర్‌బీఐలో ఉద్యోగానికి దరఖాస్తుల ఆహ్వానం.. జీతం రూ.2.25 లక్షలకు పైనే..
పేపర్–2లో తక్కువ ఉత్తీర్ణత
రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 నుంచి టెట్ నిర్వహిస్తున్నారు. డీఈడీ అర్హత గల వారు పేపర్–1, బీఈడీ అర్హులు పేపర్–2తో పాటు పేపర్–1 రాసేందుకు కూడా అవకాశం కల్పించారు. పేపర్–1 ఉత్తీర్ణులు ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే అర్హత సాధిస్తారు. పేపర్–2 అర్హులు ఉన్నత పాఠశాలల వరకూ బోధించే వీలుంది. అయితే పేపర్–2లో ఉత్తీర్ణులు గత 8 ఏళ్ళుగా తక్కువగా ఉంటున్నారు. గరిష్టంగా 30 శాతం దాటకపోవడం, జనరల్ కేటగిరీలో ఉత్తీర్ణత శాతం మరీ తక్కువగా ఉండటం కని్పస్తోంది. ఇందుకు బీఈడీలో నాణ్యత లోపమే కారణమనే విమర్శలున్నాయి.