Skip to main content

కాకతీయుల సామంతులు

రేచర్ల రెడ్డి వంశీయులు, రేచర్ల పద్మనాయకులు, చెరకు రెడ్డి వంశీయులు, కాయస్థులు,మల్యాల, విరియాల, బాణ వంశీయులు, కందూరి చోడులు, నతవాడి, వెన్గొండ వంశీయులు, పొలవాస పాలకులు, నాగ వంశీయులు, యాదవ రాజులు, వైదుంబులు, వావిలాల, త్యాగి, కోట, ఇందులూరి, గోన వంశీయులు కాకతీయ సామంత మాండలికుల్లో ముఖ్యులు. వీరిలో తెలంగాణ భూభాగంతో సంబంధం ఉన్నవారి గురించి తెలుసుకుందాం.

రేచర్ల రెడ్డి వంశం (1051-1289)

ఈ వంశీయులు కాకతీయుల వద్ద సేనాపతులుగా, సామంతులుగా, మంత్రులుగా పనిచేశారు. ఈ వంశంలోని ఒక శాఖ నల్గొండ జిల్లాలోని ఆమనగల్లు, పిల్లలమర్రి, మిర్యాలగూడ, నాగులపాడు, సోమవరం, తాలువాయి, బూరుగుగడ్డ, సిరికొండ, చిలుకూరు ప్రాంతాలను పాలించింది. మరోశాఖ వరంగల్ జిల్లాలోని ఎలకుర్తి, ములుగు, నర్సంపేట, మాచాపూర్‌తో పాటు కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్ తాలూకాలోని ప్రాంతాలను పరిపాలించింది. ఈ ప్రాంతాల్లో వీరు 30 శాసనాలు వేయించారు. 15 దేవాలయాలు నిర్మించారు. విద్యాపీఠాలు, మఠాలు నెలకొల్పారు. ఆమనగల్లు, పిల్లలమర్రి, ఉండ్రుకొండ, ఉర్లుగొండ, ఎలకుర్తి దుర్గాలను నిర్మించారు. రామప్ప చెరువు, నామ సముద్రం మొదలైన 22 చెరువులు, కాలువలను తవ్వించారు.
రేచర్ల బమ్మసేనాని
రేచర్ల రెడ్డి వంశీయులు కాకతీయ సామ్రాజ్య సంరక్షణ భారం వహించి, కాకతీయుల శత్రువులకు సింహస్వప్నంగా మారారు. అనేక యుద్ధాల్లో విజయం సాధించిన రేచర్ల రెడ్డి వంశీయులు కాకతీయ రాజుల అభిమానాన్ని చూరగొన్నారు. రేచర్ల రెడ్డి వంశ మూల పురుషుడు రేచర్ల బమ్మ(బ్రహ్మ)సేనాని. ఇతడినే బమ్మిరెడ్డి(1035-1055) అని పిలుస్తారు. ఇతడు కాకతీయ మొదటి (గరుడ) బేతరాజు వద్ద సేనాధిపతిగా పనిచేసి కాంచీపుర చోళులను జయించాడు. పాలంపేట, పిల్లలమర్రి, చిట్యాలంపాడు, మాచాపూర్ శాసనాలు ఇతడి గురించి తెలుపుతున్నాయి. బమ్మిరెడ్డి తర్వాత అతడి కుమారుడు లేదా మనువడి భావిస్తున్న ముచ్చ సేనాని మొదటి ప్రోలరాజు(1052-1076) వద్ద చమూపతిగా పనిచేశాడు. ముచ్చసేనాని కూడా కాకతీయ రాజ్య విస్తరణలో తోడ్పడ్డాడు. వేములవాడ చాళుక్య రాజైన భద్రగుణ్ని ఓడించి ఆ రాజ్యాన్ని ఆక్రమించడంలో ఇతడు ముఖ్య భూమిక పోషించాడు. ఇతడి కొడుకు ఒకటో కాట సేనాని రెండో బేతరాజు(1076-1108) వద్ద సేనానిగా పనిచేశాడు. కాట సేనాని కుమారుడైన కామ చమూపతి రెండో ప్రోలరాజు(1116-1157)కు చమూపతి అయ్యాడు.
తొలి రాజు రెండో కాట చమూపతి
కాకతీయులు, కందూరి చోడులు, పొలవాస రాజులు, గోవింద దండ నాయకులు తెలంగాణలో కళ్యాణి చాళుక్య సామంతులుగా పనిచేశారు. అనంతర కాలంలో కాకతీయుల విజృంభణను సహించని ఈ ఇతర సామంతులను ఓడించి లొంగదీసుకోవడంలో రెండో ప్రోలరాజుకు కామ చమూపతి సహాయం చేశాడు. పొలవాస రాజైన గుండన(మంథెన)ను సంహరించడం ముఖ్య సంఘటనగా చెప్పవచ్చు. ఇతడికి రెండో కాట చమూపతి, పిల్లలమర్రి బేతిరెడ్డి, నామిరెడ్డి అనే ముగ్గురు కుమారులు, వల్లసాని అనే కుమార్తె ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడైన రెండో కాట చమూపతి రుద్రదేవుడి దండ నాయకుడు అయ్యాడు. రుద్రదేవుడు సింహాసనం అధిష్టించే నాటికి కాలచురి బిజ్జలుని ప్రోత్సాహంతో.. పొలవాస మేడరాజు, నగునూరు(కరీంనగర్ జిల్లా) దొమ్మరాజు కాకతీయ రాజ్యం మీద దండెత్తారు. రుద్రదేవుడు వీరిని ఓడించాడు. ఈ యుద్ధాల్లో తోడ్పడిన రెండో కాట చమూపతికి మహాసామంతాధిపత్యం ఇచ్చి ఎలకుర్తి రాజధానిగా నర్సంపేట, మాచాపూర్, ములుగు ప్రాంతాలను పరిపాలించేందుకు నియమించాడు. ఈ విధంగా రేచర్ల రెడ్డి వంశంలో రెండో కాట చమూపతి మొదటి రాజయ్యాడు.
ఇతడి రెండో తమ్ముడు బేతిరెడ్డి రుద్రదేవుడి సేనాని అయ్యాడు. ఈ లోగా తెలంగాణలో కాకతీయ ప్రత్యర్థులైన కందూరు చోడులు (ఉదయన చోడుడు, భీమ గోకర్ణులు) రాజ్య విస్తరణకు ప్రయత్నించారు. రుద్రదేవుడు వీరిని ఓడించి సామంతులుగా చేసుకున్నాడు. ఈ యుద్ధాల్లో తోడ్పడిన బేతిరెడ్డిని ఆమనగంటి రాజ్యానికి సామంతుడిగా నియమించాడు. ఆమనగల్లు, పిల్లలమర్రి, నాగులపాడు, మిర్యాలగూడ, సోమవరం ప్రాంతాలు ఇతడి రాజ్యంలో ఉన్నాయి. బేతిరెడ్డి పిల్లలమర్రి పట్టణాన్ని నిర్మించి రాజధానిని అక్కడికి మార్చాడు. రుద్రదేవుడు తెలంగాణ ప్రాంత విజయాల తర్వాత తీరాంధ్ర మీద దండెత్తాడు. ఈ యుద్ధాల్లో బేతిరెడ్డి తమ్ముడు నామిరెడ్డి, రెండో కాట చమూపతి కుమారుడైన రెండో ముచ్చ సేనాని తోడ్పడ్డారు. రుద్రదేవుడి మరణానంతరం బేతిరెడ్డి ఆమనగంటి రాజ్యాన్ని నామిరెడ్డికి అప్పగించాడు. ఆ విధంగా వీరిద్దరూ ఒకరి తర్వాత మరొకరు ఆమనగంటి పురవరేశ్వర, శౌర్య సౌపర్ణ మొదలైన బిరుదులు ధరించారు. దీన్ని బట్టి వీళ్లు ఒకరి తర్వాత మరొకరు ఆమనగల్లును పాలించినట్లు తెలుస్తోంది. బేతిరెడ్డి భార్య ఎర్రక్క సాని, నామిరెడ్డి పిల్లలమర్రిలో ఎరకేశ్వర, కాచేశ్వర, కామేశ్వర, నామేశ్వర దేవాలయాలను కట్టించారు.
రేచర్ల రుద్రారెడ్డి
రెండో కాటసేనాని(కాటచమూపతి) రెండో కుమారుడైన రుద్ర సేనాని(రుద్రారెడ్డి) రేచర్ల రెడ్డి వంశంలో సుప్రసిద్ధుడు. ఇతడు రుద్రదేవుడి కాలంలో సేనాపతిగా చేరాడు. ఇతడి వంశం గురించి గోలకొండ పత్రికలో ఆసక్తికర చర్చ జరిగింది. కంభపాటి అప్పన్న శాస్త్రి ఇతడిని రేచర్ల రెడ్డి వంశీయుడిగా పేర్కొనగా, రుద్ర సేనాని వెలమ వీరుడని శేషాద్రి రమణ కవులు(మారుపేరుతో కూడా) తెలిపారు. రుద్ర సేనాని మంత్రి అయిన రాజెనాయకుడి ద్రాక్షారామ శాసనంలోని ‘గుణినఃశ్రీ రుద్రరెడ్డి ప్రభో’ అనే భాగం, సోమవరం, ఉప్పరపల్లి శాసనాలు రుద్ర సేనాని రేచర్ల రెడ్డి వంశీయుడే అని తెలుపుతున్నాయి.
దేవగిరి యాదవ రాజులతో చేసిన యుద్ధంలో రుద్రదేవుడు(1195) మరణానంతరం, మహాదేవుడి కాలంలో, యాదవులతో జరిగిన యుద్ధంలో మహాదేవుడు మరణించి గణపతి దేవుడు యాదవ రాజుల బందీగా ఉన్న సమయంలో... ఈ మూడు సందర్భాల్లో కాకతీయ రాజ్యంలో సంక్షోభం తలెత్తింది. ముదిగొండ చాళుక్యులు, వెలనాటి చోళ పృథ్వీశ్వరుడు, కులోత్తుంగ చోళుడు కాకతీయ రాజ్య భూభాగాలను ఆక్రమించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రేచర్ల రుద్రారెడ్డి వీరిని ఓడించి, ఆంతరంగిక శత్రువులను అణచివేశాడు. కాకతీయ సింహాసనాన్ని గణపతి దేవుడికి అప్పగించి ‘కాకతి రాజ్య భార ధౌరేయు’డిగా ‘కాకతి రాజ్య సమర్థుడు’గా పేరొందాడు. గణపతి దేవుడి(1199-1259) కాలంలో ప్రధాని అయ్యాడు. రుద్రారెడ్డి కుమారులైన లోక సేనాని, పెద్ద గణపతి, నాలుగో కాటసేనాని; మనుమలు గణపతి, వసాయిత చమూనాథ; మునిమనుమడు వీరవసాయితలు కాకతీయ సేవకులుగా ఎలకుర్తి ప్రాంతాన్ని పాలించారు. బేతిరెడ్డి రెండో కుమారుడు లోకిరెడ్డి నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలోని ఊట్కూరు ప్రాంతాన్ని పాలించాడు.
రుద్రమదేవికి బాసటగా..
నామిరెడ్డి కుమారులైన కాట్రెడ్డి, నామిరెడ్డి మేనల్లుడైన చెవిరెడ్డి(బేతాళ రెడ్డి, బేతాళ నాయకుడు), గణపతిదేవుడి వద్ద సేనానులుగా పనిచేశారు. ఆ సమయంలో ఆమనగంటి లేదా పిల్లలమర్రి రాజ్యాన్ని నామిరెడ్డి కుమారులే పరిపాలించారు. గణపతిదేవుడి మరణం తర్వాత చెవిరెడ్డి కుమారులైన ప్రసాదిత్య, రుద్రనాయుడు రుద్రమదేవికి బాసటగా నిలిచారు. నామిరెడ్డి మనుమలు.. గణిపిరెడ్డి, మర్రెడ్డి (కామిరెడ్డి కుమారులు), నామయ, కామయ, మల్లయ (కాట్రెడ్డి కుమారులు) వేయించిన నాగులపాటి శాసనాల్లో వీరికి ఎలాంటి బిరుదులు ఉన్నట్లు తెలపలేదు. దీన్నిబట్టి వీరికి రాజ్యం లేదని భావించవచ్చు. ఆ తర్వాత రేచర్ల రెడ్డి వంశం ప్రశస్తిలోకి రాలేదు. చెవిరెడ్డి వంశీయులే వైష్ణవ మతం స్వీకరించి సంస్కరణ మార్గంలో పయనించి వెలమలై రేచర్ల పద్మనాయకులు అయ్యారని భావించవచ్చు. ఈ తెగకు చెందిన వారే వెంకటగిరి సంస్థానాధిపతులని, ఇతర ప్రాంతాల పాలకులని తెలుస్తోంది. ఈ కాలంలో పిల్లలమర్రి పినవీరన పూర్వీకులైన హరిహరార్యుడు, ఇవటూరి సోమన, మంచి రాజకవి, ప్రదిక్షణం మహాదేవ మంచి, సోమదేవ మంత్రి మొదలైన కవి పండితులు ఉండేవారు. ఈ కాలం నాటి పిల్లలమర్రి దేవాలయంలోని చిత్రాలు అజంతా తర్వాత ప్రాచీనమైనవి.

చెరకురెడ్డి వంశం

కాకతీయ సేనానులు, సామంతుల్లో చెరకురెడ్డి వంశీయులు ప్రసిద్ధి చెందినవారు. వీరు రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుల కాలంలో సామంతులుగా పనిచేశారు. నల్గొండ జిల్లాలోని జమ్మలూరు, మహబూబ్‌నగర్ జిల్లాలోని అమరాబాద్, కర్నూలు జిల్లాలోని వేల్పూరు ప్రాంతాలను పాలించారు.
నల్గొండ జిల్లాలోని దేవరకొండ, నకిరేకల్ తాలూకాల్లో ఉన్న చెరకుపల్లి గ్రామాలు వీరి తొలి నివాసమని భావిస్తున్నారు. వీరి తొలి రాజధాని జమ్మలూరు. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలోని జలాలుపురమే జమ్మలూరు కావచ్చు. జలాలుపురంలో చెరకు బొల్లయ్యరెడ్డి తన వంశీయుల పేరుమీద నిర్మించిన కేతేశ్వర, కోటేశ్వర, మారేశ్వర, సూర్యదేవర ఆలయాలే ఇందుకు నిదర్శనం. వీరు 1158 నుంచి 1323 వరకు పరిపాలించారు. ఈ వంశానికి ఆద్యుడు కాటసేనాని(1080-1140). జలాలుపురం శాసనంలో ఇతడి ప్రస్తావన ఉంది. పొలవాస మేడరాజు, కొలనుపాక జగద్దేవుడు కాకతీయ రాజ్యంపై దండెత్తగా.. వీరిని ఓడించడంలో రెండో బేతరాజుకు కాటసేనాని తోడ్పడ్డాడు. యుద్ధంలో సహాయం చేసిన కాటసేనానికి బేతరాజు చెరకుపల్లి సహా 12 గ్రామాలను ఇచ్చాడు. చెరకుపల్లి ప్రాంతాన్ని పాలించినందువల్ల ఈ వంశీయులు చెరకు రెడ్లు అయ్యారు. కాటసేనాని పెద్దకుమారుడు కేతసేనాని. ఇతడి మొదటి భార్యకు కాట, మార, ఎర్ర అనే ముగ్గురు కుమారులు. చెరకు రెడ్ల సైనిక సహకారానికి మెచ్చిన రుద్రదేవుడు వారికి గుండియపూండి, బెరపూడి, గొట్టిపల్లి, పసువల, తొర్రూరు గ్రామాలను ఇచ్చాడు. కేతసేనాని రెండో భార్యకు కాట, మార, బొల్ల అనే కుమారులు ఉన్నారు. కేతసేనాని, ఈ ముగ్గురు కుమారులు కందూరు చోడులను ఓడించడంలో రుద్రదేవుడికి సహకరించారు. అందువల్ల రుద్రదేవుడు వీరికి జమ్మలూరు రాజ్యమిచ్చి సామంతులుగా నియమించాడు. ఈ ముగ్గురిలో చివరివాడైన బొల్లయరెడ్డి ప్రసిద్ధుడు. తండ్రి తర్వాత ఇతడు జమ్మలూరు రాజ్యాధిపతి అయ్యాడు.
సంక్షోభంలో కూరుకుపోయిన కాకతీయ రాజ్యాన్ని రక్షించడంలో రేచర్ల రుద్రసేనానికి బొల్లయరెడ్డి సహాయం చేశాడు. అందుకే గణపతిదేవుడు సింహాసనం అధిష్టించగానే బొల్లయరెడ్డిని జమ్మలూరు రాజ్యంతోపాటు అమరాబాద్, వేల్పూరు రాజ్యాలకు సామంతుడిగా నియమించాడు. తర్వాత ఇతడి పెద్ద సోదరుడి కుమారులు, మనుమలు, మునిమనమలు ఈ రాజ్యాలను పాలించారు. వీరు ఈ ప్రాంతాల్లో 22 శాసనాలు వేయించారు. జలాలుపురం, కలువకొలను, అమరాబాద్, ఉడిమళ్ల, కూరెళ్ల తదితర ప్రాంతాల్లో దేవాలయాలను నిర్మించారు. వీరి శాసనాలు నాటి తెలుగు భాషా స్వరూపాన్ని తెలుపుతున్నాయి. వీరు శైవ మతాన్ని అవలంభించారు.

మల్యాల వంశం

మల్యాల వంశీయులు కాకతీయులకు విధేయులుగా ఉన్నారు. ఎన్నో యుద్ధాల్లో పాల్గొని కాకతీయుల విజయ సాధనకు తోడ్పడ్డారు. వీరు దుర్జయ కులస్థులు. ఈ వంశానికి ఆద్యుడు దన్నసేనాని. కటుకూరు, కొండిపర్తి, బూదపూర శాసనాలు ఇతడిని కాకతీయ సేనానిగా పేర్కొంటున్నాయి. దన్నసేనానికి ఇద్దరు కుమారులు. పెద్దవాడైన సబ్బసేనాని సంకీసపుర రాజ్యాన్ని, రెండోవాడైన బాచసేనాని బూదపూర రాజ్యాన్ని పొందారు. సబ్బ సేనాని కుమారుడు కాటసేనాని. ఇతడికి ఇద్దరు కుమారులు. చిన్నవాడైన చౌండసేనాని ప్రసిద్ధుడు. ఇతడు గణపతి దేవుడి ఆజ్ఞ మేరకు దివిసీమపై దండెత్తి చోడియ రాజును ఓడించాడు. వెలనాటి పృథ్వీశ్వరుడి కోశాగారాన్ని గణపతిదేవుడికి అప్పగించాడు. విరియాల వంశానికి చెందిన మైలమను వివాహమాడి మల్యాల రాజ్యంతో పాటు విరియాల రాజ్యాన్ని కూడా పాలించాడు. చౌండసేనాని మల్యాల రాజ్య పాలకుడైనప్పటికీ ఓరుగల్లు దుర్గ రక్షణ కోసం ఉంచిన సైన్యాధ్యక్షుడిగా కొండపర్తిలో ఉండేవాడు. రాజ్యపాలనా వ్యవహారాలను ఇతడి అన్న పోతసేనాని చూసుకునేవాడు.
బాచసేనాని కుమారుడు గుండ దండాధీశుడు కూడా ఈ వంశంలో ప్రసిద్ధుడు. ఇతడు గణపతిదేవుడు, రుద్రమదేవి కాలంలో సామంతుడిగా, దండనాయకుడిగా పనిచేశాడు. బూదపుర, వర్థమానపుర ప్రాంతాలపై ఆధిపత్యం వహించి కృష్ణానది ఉత్తర ప్రాంతాలను పాలించాడు. ఇతడి భార్య గోన గన్నారెడ్డి సోదరి అయిన కుప్పాంబిక(కవయిత్రి). 1276లో ఈమె వేయించిన బూదపూర శాసనాన్ని బట్టి గుండ దండాధీశుడు అప్పటికే మరణించాడని తెలుస్తోంది. తర్వాత ఇతడి కుమారులు రాజ్యపాలన చేశారు.

విరియాల వంశం

కాకతీయ మొదటి బేతరాజుకు రాజ్యాన్ని ఇప్పించి కాకతీయ రాజ్యాన్ని నిలబెట్టింది వీరే. ఈ వంశీయులు వీరులైనప్పటికీ స్వతంత్ర పాలకులు కాలేదు. రాష్ర్ట కూటులు, కల్యాణీ చాళుక్యుల వద్ద సామంతులుగా, దండనాయకులుగా పనిచేశారు. వీరు కూడా దుర్జయ కులస్థులే. విరియాల వంశానికి ఆద్యుడు పోరంటి వెన్న సేనాని. ఇతడి తర్వాత ఎర్రభూపతి, భీముడు రాష్ర్ట కూటసేనానులుగా పనిచేశారు. భీముడి కుమారుడైన ఎర్రనరేంద్రుడు విరియాల వంశంలో ప్రసిద్ధుడు. ఇతడి కాలంలోనే రెండో తైలపుడు రాష్ర్టకూటులను ఓడించి 973లో కల్యాణీ చాళుక్య రాజాన్ని స్థాపించాడు. ఎర్రనరేంద్రుడు ఇతడి సేనాని అయ్యాడు. ఆ సమయంలో ముదిగొండ చాళుక్యులు, తొలి కాకతీయులు పరస్పరం ఘర్షణ పడేవారు. అంతకు ముందే కాకతీయ నాలుగో గుండరాజు ముదిగొండ చాళుక్య బొట్టు బేతరాజును ఓడించి తమ పూర్వ రాజ్యమైన కొరవి సీమను ఆక్రమించాడు.
తైలపుడు చక్రవర్తి కాగానే బొట్టు బేతరాజు అతడిని ఆశ్రయించాడు. చక్రవర్తి ఆజ్ఞ మేరకు విరియాల ఎర్రనరేంద్రుడు కాకతీయ నాలుగో గుండరాజును సంహరించి చాళుక్యబొట్టు బేతరాజును కొరవి సీమకు రాజును చేశాడు. ఎర్రనరేంద్రుడి భార్య అయిన కామసాని సోదరుడే గుండరాజు. కామసాని తన భర్త సహకారంతో మేనల్లుడైన మొదటి బేతరాజు(గరుడ)కు రెండో తైలపుడి నుంచి అనుమకొండ రాజ్యాన్ని ఇప్పించింది. ఈ విధంగా విరియాల వంశం కాకతీయ రాజ్యాన్ని నిలబెట్టింది.
ఎర్రసేనాని(నరేంద్రుడు) తర్వాత ఇతడి వంశీయులైన సూరసేనాని, బేతన, రుద్రయ రాజు, సూరన్నపతి, మల్లచమూపతి, అన్నయ మొదలైనవారు సేనానులుగా పనిచేశారు. వీరిలో కొందరు కాకతీయుల దగ్గర పనిచేశారని బి.ఎన్.శాస్త్రి తెలిపారు. కానీ ఇందుకు ఆధారాలు లభించలేదు.

యాదవ రాజులు

తెలంగాణకు పశ్చిమ-ఉత్తరంగా ఉన్న ప్రాంతాన్ని దేవగిరి రాజధానిగా యాదవరాజులు పాలించేవారు. వీరు 9వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు అధికారంలో ఉన్నారు. కాకతీయుల కాలంలో హోయసాల, దేవగిరి బలమైన రాజ్యాలు. దేవగిరి యాదవరాజులు కొంతకాలం కాకతీయులకు పక్కలో బల్లెంలా ఉండేవారు. దేవగిరి యాదవరాజ వంశానికి చెందిన ఒక శాఖ కాకతీయుల సామంతులుగా కొన్ని ప్రాంతాలను పాలించింది.
అద్దంకి శాఖకు చెందిన యాదవ రాజుల్లో మొదటి వాడు మొదటి సారంగధరుడు. ఇతడు కాకతీయ రుద్రదేవుడికి యుద్ధాల్లో తోడ్పడ్డాడు. ప్రతిఫలంగా కాకతీయులు ఇతడిని అద్దంకి రాజ్యానికి సామంతుడిగా నియమించారు. ఈ శాఖకు చెందిన మాధవ దేవుడు, సింగల దేవుడు, రెండో సారంగ దేవుడు వేయించిన శాసనాలను బట్టి వీరు గణపతిదేవుడికి సామంతులుగా ఉన్నారని తెలుస్తోంది.
దేవగిరి యాదవరాజు జైతుగీ(జైత్రపాలుడు) కాకతీయ రాజైన మహాదేవుడిని సంహరించాడు. సింఘన ఇతడి కుమారుడు. సింఘన మూడో కుమారుడైన సారంగపాణి దేవుడు తెలంగాణకు వచ్చి రుద్రమదేవి సామంతుడిగా పానగల్లు రాజధానిగా పరిసర ప్రాంతాలను పాలించాడు. ఇతడు వేయించిన పానగల్లు శాసనం(క్రీ.శ.1267) ద్వారా ఈ విషయాలు తెలుస్తున్నాయి. ఇతడి వంశీయులు పానగల్లు, సూర్యాపేట పరిసర ప్రాంతాలను పాలించారని పాతర్లపాడు శాసనం తెలుపుతోంది.

నాగ వంశస్థులు

ఈ వంశీయులు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలను పాలించారు. ఈ వంశంలోని కొందరు నల్గొండ జిల్లా, కోదాడ ప్రాంతాలను పాలించినట్టు అనంతగిరి శాసనం ద్వారా తెలుస్తోంది.

నతవాడి వంశం

నందిగామ, మధిర తాలూకాలు, మహబూబాబాద్, జనగామ తాలూకాలు నతవాడి రాజ్యపరిధిలో ఉండేవి. ఈ రాజ్యాన్ని నతవాడి వంశం పాలించింది. ఈ వంశీయులు మొదటకల్యాణీ చాళుక్యుల సామంతులుగా ఉండి తర్వాత కాకతీయుల సామంతులయ్యారు.
ఈ వంశానికి ఆద్యుడు బేతరాజు. ఇతడు కాకతీయ రెండో ప్రోలరాజుకు తన కూతురునిచ్చి వివాహం చేశాడు. ఇతడి కుమారుడైన దుర్గరాజు(1104-1157) కల్యాణీ చాళుక్య ఆరో విక్రమాదిత్యుడికి, మూడో సోమేశ్వరుడికి సామంతుడిగా పనిచేశాడు. దుర్గరాజు కుమారుడైన బుద్ధరాజును కాకతి రుద్రదేవుడు, మహాదేవుడు నతవాడి పాలకుడిగా నియమించారు. ఇతడి పెద్ద కుమారుడు రుద్రుడు. కాకతి మహాదేవుడు ఇతడికి తన కూతురునిచ్చి వివాహం చేశాడు. బుద్ధరాజు రెండో కుమారుడు వక్కడి మల్లరుద్రుడు. ఇతడు గణపతిదేవుడి సోదరి అయిన మైలాంబను వివాహం చేసుకున్నాడు. రుద్రమదేవి కాలం వరకు నతవాడి రాజులు కాకతీయ సామంతులుగా పనిచేశారు.

గోనవంశం

రుద్రదేవుడు కందూరి చోడులను పానుగల్లు, దేవరకొండ ప్రాంతాలకు పరిమితం చేసినందువల్ల వారు వర్ధమానపురాన్ని విడిచి వెళ్లారు. మళ్లీ రుద్రదేవుడే వర్ధమానపురం (కందూరినాటి) పాలకుడిగా గోన బుద్ధరాజు(రంగనాథ రామాయణ కర్త)ను నియమించి ఉంటాడని భావిస్తున్నారు. అతడి కుమారుడైన గోన గన్నారెడ్డి గణపతిదేవుడి వల్ల వర్ధమానపుర రాజ్యాన్ని తిరిగి పొందాడు. ఇతడి తమ్ముడు విఠల నరేంద్రుడు. వీరిద్దరూ యాదవ రాజులు ఆక్రమించిన ఆదవాని, తుంబుళాలను జయించి రాయచూరు దుర్గాన్ని ఆక్రమించారు. విఠలుడు హాళువ, మాణువ రాజ్యాలను జయించాడు. కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ప్రదేశాన్ని ఆక్రమించి దక్షిణాంధ్ర భూభాగాలను కాకతీయ సామ్రాజ్యంలో కలిపాడు. గోన గన్నారెడ్డి సోదరి కుప్పాంబిక. ఆమె భర్త మల్యాల గుండ దండాధీశుడు. గోన గన్నారెడ్డి తర్వాత ఇతడు వర్ధమానపుర పాలకుడయ్యాడు. ఇతడు 1245-46లో వర్ధమానపుర శాసనం వేయించాడు. 1259లో బూదపూర శాసనం, 1272లో మరో శాసనం వేయించాడు. ఇతడి మరణానంతరం భార్య కుప్పాంబిక తన భర్త పేరు మీద 1276లో గుండేశ్వరాలయం నిర్మించి శాసనం వేయించింది. ఇందులో ఆమె చిన్న తమ్ముడు గోనబుద్ధయ, గోన విఠయ కుమారుడు గుండయ గురించి పేర్కొన్నారు.

వావిలాల వంశం

వీరు రెడ్డి వంశస్థులు. రుద్రమదేవి కాలంలో ఆమనగల్లు, వంగూరు విషయాల (సీమ) పాలకులుగా ఉన్నారు. చెరకు రెడ్లతో వీరికి వివాహ సంబంధాలు ఉన్నాయి.

కాయస్థ వంశం (1239-1304)

మహారాష్ర్ట నుంచి వచ్చి స్థిరపడిన కాయస్థ వంశస్థుల్లో ఆద్యుడు గంగయ సాహిణి(1239-1257). ఇతడు కాకతి గణపతిదేవ చక్రవర్తికి సామంతుడు, ఆప్తుడు, అశ్వసైన్యాధిపతి. ఇతడి సువిశాల రాజ్యంలో మార్జవాడి, పలనాడు, కడప మొదలైన ప్రాంతాలతో పాటు, నల్లగొండ జిల్లాలోని పానగల్లు కూడా ఉండేవి. ఇతడి రాజధాని కడప జిల్లా వల్లూరు. దేవగిరి యాదవ రాజు ఆజ్ఞ మేరకు అతడి సామంతుడైన దామోదరుడు కాకతీయ భూభాగాలను ఆక్రమించాడు. గణపతిదేవుడి ఆజ్ఞతో గంగయ సాహిణి దామోదరుణ్ని ఓడించాడు. దీంతో గణపతిదేవుడు అతడికి మహామండలేశ్వర పదవిని ఇచ్చాడు.
గంగయ సాహిణి తర్వాత అతడి మేనల్లుడైన జన్నిగదేవుడు గణపతిదేవుడు, రుద్రమదేవి వద్ద సామంతుడిగా పనిచేశాడు. ఇతడి రాజ్యంలో నల్లగొండ మండలం అంతర్భాగంగా ఉండేది. ఇతడి సోదరుడు త్రిపురాంతకుడుకూడా సామంతుడే. తర్వాత ఇతడి సోదరుడు అంబదేవుడు(1275-1302) స్వతంత్రించి కాకతీయులకు శత్రువయ్యాడు. అంబదేవుడి రాజ్యంలో నల్లగొండ జిల్లాలోని కృష్ణానది ఉత్తర ప్రాంతాలు, దోర్నాల ఉండేవి. ఇతడి కుమారుడైన రెండో త్రిపురాంతకుడి కాలంలో ఈ రాజ్యం కాకతీయ రాజ్యంలో కలిసిపోయింది.

సమ్మక్క సారక్క

పగిడిద్దరాజు, సమ్మక్క-సారక్కల తిరుగుబాటు వృత్తాంతానికి చారిత్రక ఆధారాలు లేవు. కానీ శతాబ్దాల నుంచి వీరి గాథలు ప్రజల్లో ప్రచారంలో ఉన్నాయి. వాటి ప్రకారం..
గోదావరి తీర ప్రాంతమైన మేడారం పరగణాను కోయ తెగకు చెందిన పగిడిద్దరాజు పాలించేవాడు. ఇతడు ప్రతాపరుద్రుడి సామంతుడు. కరీంనగర్ రాజధానిగా పాలించే మరో కోయ రాజైన మేడరాజు తన కుమార్తె సమ్మక్కను పగిడిద్దరాజుకిచ్చి పెళ్లి చేశాడు. సారలమ్మ, నాగులమ్మ, జంపన్నలు వారి సంతానం. కొన్నాళ్లకు మేడారం పరగణాలో నాలుగేళ్లపాటు తీవ్రమైన కరువు వచ్చింది. ప్రజలు పన్నులు కట్టలేని దుస్థితి తలెత్తింది. దీంతో పగిడిద్దరాజు కూడా ప్రతాపరుద్రుడికి పన్నులు కట్టలేదు. దీన్ని ధిక్కారంగా భావించిన ప్రతాపరుద్రుడు మంత్రి యుగంధరుడి ఆధ్వర్యంలో అతడిపైకి పెద్ద ఎత్తున సైన్యాన్ని పంపాడు. మేడారం సమీపంలోని సంపెంగవాగు వద్ద పగిడిద్దరాజు సైనికులు కాకతీయ సైన్యంతో వీరోచితంగా పోరాడారు. ఆయుధ బలం, సంఖ్యాబలం ఉన్న కాకతీయ సైన్యాన్ని నిలువరించలేక పగిడిద్దరాజుతో సహా ఆయన బిడ్డలు సారలమ్మ, నాగులమ్మ, అల్లుడు గోవిందరాజు వీరమరణం పొందారు. ఈ పరాజయాన్ని భరించలేక పగిడిద్దరాజు కుమారుడైన జంపన్న వాగులోకి దూకి చనిపోయాడు. అప్పటి నుంచి ఈ వాగుకు జంపన్నవాగు అని పేరొచ్చింది. పగిడిద్దరాజు భార్య సమ్మక్క కాకతీయ సేనతో పోరాడుతుండగా, ఒక సైనికుడు దొంగచాటుగా వచ్చి బల్లెంతో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన సమ్మక్క ప్రస్తుతం జాతర జరుగుతున్న స్థలంలో నేలకొరిగింది.
లక్షలాది మంది పూజలందుకుంటున్న ఈ వీరుల గాథలు, కథనాల్లో చిన్న చిన్న తేడాలున్నాయి. కాకతీయులకు, ఆదివాసీలకు యుద్ధం జరగడానికి సహజవనరుల పంపకాల వివాదం కారణమని కొన్ని కథనాలు, కప్పం చెల్లించకపోవడం కారణమని ఇంకొన్ని కథనాలు చెబుతున్నాయి. వీరి నుంచి కాకతీయులు కప్పం వసూలు చేశారనడానికి ఆధారాల్లేవని చరిత్రకారులు తెలిపారు. కానీ ఎక్కువ కథలు అదే కారణమని చెబుతున్నాయి. కాకతీయులు రాష్ర్ట కూట వంశం వారు కాదని పులింద జాతికి చెందిన వారని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. ఈ యుద్ధానికి పుళింద, కోయజాతి వైరం కారణమా? కప్పమే కారణమా? అన్నది పరిశోధించి తేల్చాల్సి ఉంది.
Published date : 08 Oct 2015 03:23PM

Photo Stories