Skip to main content

తెలంగాణలో 700 ఏళ్ల వలస పాలన

తెలంగాణ పోరాటానికి శతాబ్దాల చారిత్రక నేపథ్యం ఉంది. తెలంగాణ పోరాటానికి గల కారణాలను సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే.. 1323లో కాకతీయ రాజుల పాలన అనంతరం జరిగిన వలస రాజ్య స్థాపనల గురించి తెలుసుకోవాలి. 1324 నుంచి 1948 వరకు తెలంగాణ ప్రాంతాన్ని అయిదు ముస్లిం రాజ్య వంశాలు పాలించాయి. వీరి 624 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రజలు దుర్భర పరిస్థితుల్లో జీవించారు. మరో రకంగా చెప్పాలంటే.. మన పూర్వీకులు తమ సొంత ప్రాంతంలోనే ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకులు వెళ్లదీశారు.
కాకతీయుల స్వర్ణయుగం
క్రీ.శ. 1324లో కాకతీయ రాజు రెండో ప్రతాపరుద్రుడిని ఢిల్లీ సుల్తాన్ మహ్మద్‌బిన్ తుగ్లక్ ఓడించడంతో తెలంగాణా ప్రాంతంలో వలస పాలన మొదలైంది. ప్రతాపరుద్రుడి ఓటమితో 300 ఏళ్లకుపైగా సాగిన కాకతీయుల సువర్ణ పాలన అంతమైంది. కాకతీయులు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో పుట్టి, పెరిగి.. సాధారణ తెలంగాణ ప్రజల స్థాయి నుంచి రాజులుగా ఎదిగారు. కాకతీయ రాజులు సాగు కోసం చెరువులు, కాలువలు, బావులను తవ్వించారు. తెలంగాణ ప్రాంతంలో అనేక దేవాలయాలు నిర్మించారు. వీరి పాలనలో తెలంగాణ శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లింది. 
 
వలస పాలనలో రికార్డు
తెలంగాణలో కాకతీయుల పాలన అనంతరం క్రీ.శ. 1324 నుంచి క్రీ.శ. 1347 వరకు మహ్మద్ బిన్ తుగ్లక్ పాలన కొనసాగింది. క్రీ.శ. 1347లో అతని సుబేదారు అల్లావుద్దీన్ హసన్ గంగూ బహమనీ తిరుగుబాటు చేసి స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. బహమనీ సామ్రాజ్యం పేరుతో దక్కన్‌లో తన స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. దక్షిణ భారత దేశంలో ఇది తొలి ముస్లిం రాజ్యం. ఈ పరిణామం తదనంతర కాలంలో దక్షిణ భారతదేశంపై ముస్లిం రాజుల దాడులకు మార్గం వేసింది. బహమనీ రాజ్యంలోని 5 ప్రావిన్సుల్లో గోల్కొండ ఒకటి. తెలంగాణ ఇందులో భాగంగా ఉండేది. బహమనీ సుల్తానులు క్రీ.శ. 1347 నుంచి క్రీ.శ. 1512 వరకూ.. 165ఏళ్లు పరిపాలన సాగించారు. 165 ఏళ్ల బహమనీయుల పాలన చివర్లో ఆయా ప్రావిన్సుల పాలకులు తిరుగుబాటు చేయడంతో క్రీ.శ. 1512లో బహమనీ సామ్రాజ్యం 5 రాజ్యాలుగా విడిపోయింది. వీటిల్లో గోల్కొండ రాజ్యాన్ని సుల్తాన్ కులీ కుతుబ్ షా 1512లో ఏర్పాటు చేశాడు. ఈ గోల్కొండ రాజ్యంలో తెలంగాణ అంతర్భాగం. కుతుబ్‌షాహీ పాలకులు గోల్కొండ రాజ్యాన్ని 1687 వరకూ పాలించారు. కుతుబ్‌షాహీ అయిదో రాజు మహ్మద్ కులీ కుతుబ్ షా క్రీ.శ. 1592లో హైదరాబాద్‌ను, చార్మినార్‌ను నిర్మించాడు. ఆయనను హైదరాబాద్ నగర నిర్మాతగా పేర్కొంటారు. క్రీ.శ. 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండను జయించి తన సామ్రాజ్యంలో కలిపేసుకున్నాడు. మొఘలుల పాలన క్రీ.శ 1723 వరకూ కొనసాగింది.
 1724లో మొదటి నిజాం ఉల్ ముల్క్ అసఫ్‌జా తెలంగాణను జయించి హైదరాబాద్ రాజ్యంలో విలీనం చేశాడు. అసఫ్ జాహీలు క్రీ.శ.1724 నుంచి క్రీ.శ 1948 వరకూ సుదీర్ఘంగా 224 ఏళ్లపాటు పాలించారు. ఇలా తెలంగాణలో పరాయి పాలన 624 ఏళ్ల పాటు నిరాటంకంగా కొనసాగింది. ఇదో రకంగా ప్రపంచ రికార్డు. ఎందుకంటే.. ప్రపంచ చరిత్రలో మరెక్కడా కూడా ఒక ప్రాంతంలో ఇంత సుదీర్ఘ కాలం వలస పాలన సాగిన దాఖలాలు లేవు.
 
పరాయి పాలనలో వివక్షలెన్నో
ముస్లిం పాలకులు తెలుగు భాష స్థానంలో పర్షియన్ భాషను ప్రజలపై బలవంతంగా రుద్దారు. కాకతీయ పాలకులు ప్రోత్సహించిన స్థానిక సంస్కృతి స్థానంలో పర్షియన్ సాహిత్యం, కళలు, సంస్కృతిని ప్రవేశపెట్టారు. సమాజంలోని ఉన్నత వర్గాల వస్త్రాలంకరణ, ఆహారపు అలవాట్లలోనూ మార్పులు వచ్చాయి. వలస పాలకులు స్కూళ్లలో స్థానిక భాష కాకుండా.. పర్షియన్ మాధ్యమంలోనే బోధన విధానాన్ని ప్రవేశ పెట్టారు. అది కూడా ముస్లిం జనాభా అధికంగా ఉండే పట్టణాల్లోనే జరిగేది. పరాయి పాలకులు హిందువులు ఎక్కువగా నివసించే తెలంగాణ గ్రామాలను పూర్తిగా విస్మరించారు. ఈ నిర్లక్ష్యం, పక్షపాత ధోరణి వల్ల ప్రజలు నిరక్షరాస్యులుగా మిగిలిపోయి జీవనోపాధి కోసం వ్యవసాయ పనులకు మాత్రమే పరిమితం అయ్యారు. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో, సైన్యంలో స్థానిక ప్రజలకు స్థానం లేకుండా పోయింది.
అసఫ్ జాహీల కాలంలో 1885 వరకు పర్షియనే అధికార భాషగా కొనసాగింది. 1885లోఅప్పటి ప్రధాని రెండో సాలార్‌జంగ్ పర్షియన్ స్థానంలో ఉర్దూను అధికార భాషగా మార్చాడు. స్థానిక భాష తెలుగుకు బదులు బోధన మాధ్యమంగా ఉర్దూను తప్పనిసరి చేశారు. అప్పటి నుంచి 1948లో అసఫ్ జాహీల పాలన ముగిసే వరకూ.. ఉర్దూ మాధ్యమంలోనే బోధన కొనసాగింది. అంతేకాకుండా ధరించే దుస్తుల విషయంలోనూ పట్టణాల్లోని ముస్లిమేతర ఉన్నత వర్గాలకు షేర్వాణి, పైజామా అనేది హోదాకు గుర్తుగా మారింది. ఇవన్నీ ఇలా ఉంటే.. 1918 లో ఉస్మానియా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ.. పీజీ వరకూ అన్ని స్థాయిల్లో ఉర్దూ మాధ్యమం తప్పనిసరి చేశారు. ఉర్దూ మీడియంలో చదవడం వల్ల తదనంతర కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందే విషయంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వెనుకబడిపోయారు. మరోవైపు 1887లో హైదరాబాద్‌లోని జాగీర్దార్లు ఇంగ్లిష్ మీడియం బోధనతో నిజాం కాలేజీని ఏర్పాటుచేసుకున్నారు. తద్వారా తమ పిల్లలకు ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యను అందించాలనేది వీరి ఆలోచన. సమాజంలోని ఉన్నత వర్గాలకే ఇంగ్లిష్ మీడియం చదువు అందిందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. నిజాం కాలేజీ 1948వరకూ మద్రాస్ యూనివర్సిటీకి అనుబంధంగా కొనసాగింది. ఆరో నిజాం రాజు కాలంలో హైదరాబాద్ స్టేట్‌లోని పట్టణాల, జిల్లాల పేర్లను సైతం మార్చారు. ఎలగందల్‌ను కరీంనగర్‌గా.. ఇందురును నిజామాబాద్‌గా, పాలమూరును మహబూబ్‌నగర్‌గా.. మెతుకును మెదక్‌గా.. మానుకోట పేరు మహబూబాబాద్‌గా.. భువనగిరి పేరను భోంగిర్‌గా; ఎద్దులాపురం పేరును ఆదిలాబాద్‌గా.. పొంచెర్లను హుజూర్‌నగర్‌గా మార్చేశారు. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో వలసపాలకులు మార్చిన పేర్ల స్థానంలో అసలు పేర్లను తిరిగి పెట్టాల్సిన అవసరం ఉంది. 
 
ఏడో నిజాం వలస వాద, మతతత్వ విధానాలు
ఏడో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అసహన, పక్షపాత మతతత్వ ధోరణులకు మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. 1939లో వందేమాతరం గీతంపై నిషేధం విధించడం అనేది నిజాం అసహనం, అణిచివేత విధానాలకు  నిదర్శనం. హిందూ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లలో వందేమాతరం గీతం పాడకుండా నిషేధించారు. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా వందేమాతరం పాడితే వారిని యూనివర్సిటీ నుంచి బహిష్కరించారు. ఇలా బహిష్కరణకు గురైన విద్యార్థులు తమ చదువులు కొనసాగించేందుకు నాగ్‌పూర్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఇలా నాడు బహిష్కరణకు గురైన వారిలో పీవీ నరసింహారావు ఒకరు. అంతేకాకుండా రోజూ ఉదయం తరగతుల ప్రారంభానికి ముందు ఏడో నిజాం రాజును స్తుతిస్తూ ఉర్దూలో ప్రార్థన చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఏడో నిజాం రాజు ముస్లిం జనాభా పెంచుతూ, హిందూ జనాభాను తగ్గించే యోచనతో మతతత్వ జనాభా విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ విషయం 1931 జనాభా లెక్కలను చూస్తే అర్థమవుతుంది. 1931లో హిందూ జనాభా 84 శాతం ఉండగా, ముస్లిం జనాభా 10 శాతం ఉండేది. కానీ 1941లో ముస్లిం జనాభా గణనీయంగా 12.8 శాతానికి చేరగా, హిందూ జనాభా 81.4 శాతానికి తగ్గింది. అదే విధంగా 1941లోనే హిందూ జనాభాను తగ్గించే యోచనతో దళితులను విడిగా నమోదు చేశారు. ఫలితంగా హిందూ జనాభాను 63.5 శాతంగా చూపించారు. అంతేకాకుండా ఉత్తర భాతరదేశానికి చెందిన ముస్లింలు హైదరాబాద్ రాజ్యానికి వచ్చేలా ఉద్దేశపూర్వకంగా, పక్కా ప్రణాళికతో చర్యలు చేపట్టారు. ఉత్తరాది నుంచి వచ్చే ముస్లింలకు ఇక్కడ ప్రత్యేక వేతనాలు, సదుపాయాలు, రాయితీలు అందించి ఉద్యోగాల్లో చేరేలా ప్రోత్సహించారు. దాంతో వర్తక వాణిజ్యాల్లో, విద్యాసంస్థల్లో, రక్షణ, పోలీసు బలగాల్లో వారికి ప్రాధాన్యత లభించింది. ఇలా 60వేల మంది ఉత్తరాది ముస్లింలు హైదరాబాద్ రాష్ట్రానికి వచ్చారు. వీరిలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి వచ్చిన వారున్నారు. ఈ విధానం ద్వారా రాజ్యంలో ముస్లింలను ఉన్నత వర్గంగా ఏర్పరచాలని ఏడో నిజాం భావించాడు. అయితే ఇలాంటి చర్యల ద్వారా 1919 లో నిజాం చేసిన ముల్కీ నిబంధనల చట్టాన్ని స్వయంగా తనే ఉల్లంఘించినట్లయింది. 1947 దేశ విభజన సమయంలో ఉత్తర భారతదేశం నుంచి భారీ సంఖ్యలో ముస్లింలు రాష్ట్రానికి వలస వచ్చారు. వారు ఇక్కడ పునరావాసం ఏర్పరచుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల రాయితీలు కల్పించింది. హైదరాబాద్ రాజ్యంలో ముస్లిం జనాభా పెంచడానికి తీసుకున్న మరో చర్య ఇది. ఇలాంటి మతతత్వ విధానాల వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థలు, వర్తక వాణిజ్యాల్లో హిందువులు అవకాశాలు అందుకోలేకపోయారు. 1931 జనాభా లెక్కల ప్రకారం రక్షణ, పోలీసు, ఇతర సర్వీసుల్లో హిందూ, ముస్లింల గణాంకాలను పరిశీలిస్తే... ముస్లింలు 1,07,737 మంది ఉంటే.. హిందువుల సంఖ్య కేవలం 23,368 మంది. పైన పేర్కొన్న సర్వీసుల్లో ముస్లింల సంఖ్య 1931 నుంచి 1947 మధ్య కాలంలో మరింతగా పెరిగింది. దీన్నిబట్టి ప్రభుత్వ సర్వీసుల్లో ముస్లింలకు అధిక ఆదరణ లభించిందని స్పష్టమవుతోంది. ఇలాంటి వివక్ష ఇతర రంగాల్లోనూ కొనసాగింది. అక్షరాస్యత పరంగానూ హిందూ, ముస్లింల మధ్య స్పష్టమైన వ్యత్యాసాలు, అసమానతలు ఉండేవి. 1921లో ప్రతి వెయ్యిమంది హిందువుల్లో 23 మంది అక్షరాస్యులు ఉంటే.. ప్రతి వెయ్యి మంది ముస్లింలలో 59మంది అక్షరాస్యులు ఉండేవారు. ఇది 1931లో ప్రతి వెయ్యి మంది హిందువుల్లో 33.3గా.. ప్రతి వెయ్యి మంది ముస్లింలలో 103.5గా ఉంది.
 
కాంగ్రెస్ పార్టీపై నిషేధం
రాజకీయ పార్టీల విషయంలోనూ నిజాం పక్షపాత వైఖరి స్పష్టంగా ఉండేది. 1927లో బహదూర్ యార్‌జంగ్ స్థాపించిన ‘ఇత్తెహాదుల్ ముస్లిమీన్’ అనే ముస్లిం సంస్థకు ప్రభుత్వం అనుమతించింది. ఇది ముస్లింల రాజకీయ హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పడింది. అయినప్పటికీ ప్రభుత్వం అన్ని విధాలా సహకారాలు అందించింది. 1937లో ఏర్పడిన కాంగ్రెస్ పార్టీని మతతత్వ సంస్థ అనే కారణంతో నిజాం ప్రభుత్వం నిషేధించింది. బ్రిటిష్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన రాజకీయ పార్టీ. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం స్వాతంత్య్ర పోరాటం చేసింది. అలాంటి పార్టీని నాటి నిజాం ప్రభుత్వం మతతత్వ పార్టీగా ముద్ర వేసింది. అదేసమయంలో మతతత్వ పార్టీ అయిన ‘ఇత్తెహాదుల్ ముస్లిమీన్’ను మాత్రం సమ్మతించింది. ప్రభుత్వ మతతత్వ విధానాలు ముస్లింలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాయనడానికి ఇది మరో ఉదాహరణ. 
 
రాజకీయ నాయకుల నిర్బంధం
హైదరాబాద్ రాష్ట్ర స్వాతంత్ర ఆందోళనలను నియంత్రించేందుకు 1947 ఆగస్టు 25 తర్వాత ఎంతో మంది రాజకీయ నాయకులను, దాశరథి, కాళోజీ నారాయణరావు తదితర కవులను, ప్రముఖులను నిజాం ప్రభుత్వం జైళ్లలో నిర్బంధించింది. 1947 ఆగస్టులో భారతదేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత కూడా 13 నెలలపాటు వీరు జైలు జీవితం గడిపారు. 1948 సెప్టెంబర్‌లో పోలీసు చర్య తర్వాతే వీరు విడుదలయ్యారు. ఏడో నిజాం పాలనలో హైదరాబాద్‌లో పౌరహక్కుల ఉల్లంఘన, అణచివేత చర్యలు ఏ విధంగా ఉండేవో చెప్పడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష నిదర్శనం. 
 
హైదరాబాద్‌లో దుష్పరిపాలన
ఇత్తెహాదుల్ ముస్లిమీన్‌కు చెందిన సాయుధ విభాగం ‘రజాకార్లు’ హిందువులపై తీవ్ర అకృత్యాలకు పాల్పడ్డారు. దీంతో వేల మంది ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ దుష్పరిపాలన తమ దృష్టికి వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం 1948 జూలైలో హైదరాబాద్‌పై ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. ఈ క్రమంలో దుష్పరిపాలనకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. అవి.. ‘హైదరాబాద్‌లో దుష్పరిపాలన, అకృత్యాలకు నిస్సహాయ వీక్షకులుగా చూస్తూ ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావించట్లేదు. ఇప్పటికే క్షీణించే పరిస్థితుల్లో ఉన్న శాంతి భద్రతలు మరింత క్షీణించి శాంతి, సహనాలకు విఘాతం కలిగించే పరిస్థితులు తలెత్తితే భారత ప్రభుత్వం తప్పనిసరిగా సమస్య పరిష్కారానికి జోక్యం చేసుకుంటుంది’ అని పేర్కొంది. మరోవైపు రజాకార్ల దుష్పరిపాలన, అకృత్యాలకు నిరసనగా అప్పటి హైదరాబాద్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జి. రామాచారి 1948 ఫిబ్రవరిలో రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని ఈ విధంగా వర్ణించారు. ‘‘రాజ్యంలో విధ్వంసక శక్తులు, గూండాయిజం విశృంఖలమయ్యాయి. దహన కాండలు, దోపిడీలు, హత్యలు నిత్యకృత్యమయ్యాయి. సాయుధ వ్యక్తులు దేశం మొత్తం తిరుగుతూ విచ్చలవిడిగా హత్యాకాండ సృష్టిస్తున్నారు. ఒక గ్రామం తర్వాత మరో గ్రామం దహనానికి గురవుతోంది. ఈ దమన కాండకు పలు గ్రామాల్లో భీతావాహ పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి జైళ్లలో కూడా గూండా రాజ్యం నడుస్తోంది’’. అకృత్యాలు, దుష్పరిపాలనకు సంబంధించి పేర్కొన్న ఈ పరిణామాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే.. ఇవే 1948 సెప్టెంబర్‌లోని పోలీస్ చర్యకు దారితీసి నిజాం దుష్పరిపాలనకు ముగింపు పలికాయని స్పష్టమవుతోంది. 
 
1948లో పోలీస్ చర్య
1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. బ్రిటిషర్లు భారతదేశాన్ని విడిచి వెళ్లే సమయంలో దేశంలో 1) బ్రిటిష్ ఇండియా, 2) భారతీయ సంస్థానాలు.. అనే రెండు భాగాలు మనుగడలో ఉన్నాయి. భారతీయ సంస్థానాలు మొత్తం 565 ఉండగా.. వాటిలో హైదరాబాద్ అత్యంత పెద్ద రాష్ట్రం. అయితే 1947 ఆగస్టు 15 తర్వాత కూడా హైదరాబాద్, భారత యూనియన్‌లో విలీనం కాలేదు. తన పాలనలోనే హైదరాబాద్  స్వతంత్రంగా కొనసాగుతుందని కూడా ఏడో నిజాం స్పష్టం చేశాడు. దాంతో భారత ప్రభుత్వం హైదరాబాద్‌ను భారత్‌లో విలీనం చేసేందుకు 1948 సెప్టెంబర్‌లో పోలీస్ చర్యకు సిద్ధమైంది. అయిదు రోజుల పాటు సాగిన పోలీస్ చర్య తర్వాత హైదరాబాద్‌కు చెందిన సాయుధ దళాలు 1948 సెప్టెంబర్ 17న భారత సైన్యం ముందు లొంగిపోయాయి. ఫలితంగా హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 18 నుంచి భారతదేశంలో భాగమైంది. 
 
నాన్ ముల్కీ గో బ్యాక్
హైదరాబాద్ రాష్ట్ర పరిపాలన బాధ్యతలు నిర్వహించేందుకు 1948 సెప్టెంబర్ 18న మేజర్ జనరల్ జె.ఎన్.చౌదరిని మిలటరీ గవర్నర్‌గా నియమించారు. మరోవైపు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌ను హైదరాబాద్ రాష్ట్ర అధిపతిగా కొనసాగిస్తూ అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్‌పై పోలీస్ చర్య సమయంలోనూ, ఆ తర్వాత కూడా ప్రభుత్వ కార్యకలాపాల్లో సహకరించేందుకు మద్రాస్ ప్రభుత్వంలోని పలువురు ఆంధ్ర అధికారులను హైదరాబాద్‌కు రప్పించారు. ఈ అధికారులు 1952 వరకు హైదరాబాద్ ప్రభుత్వ సర్వీసులో కొనసాగారు. మరోవైపు 1948 తర్వాత మరెందరో ఇంగ్లిష్ భాష నైపుణ్యం ఉన్న ఆంధ్ర ప్రాంత వాసులు ప్రభుత్వ ఉద్యోగాలు కోరుతూ హైదరాబాద్‌కు వచ్చారు. వేల సంఖ్యలో నాన్-ముల్కీ ఆంధ్రా వ్యక్తులు నకిలీ ముల్కీ సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు పొందారు. దాంతో తెలంగాణ ప్రాంత ప్రజలకు వారి సొంత రాష్ట్రంలోనే అవకాశాలు లభించని పరిస్థితి నెలకొంది. ఈ అసాధారణ పరిస్థితే 1952లో ఉధృతంగా మొదలైన నాన్-ముల్కీ ఉద్యమానికి ఆజ్యం పోసింది. ‘నాన్- ముల్కీస్ గో బ్యాక్’, ‘ఇడ్లీ- సాంబార్ గో బ్యాక్’ నినాదాలు ఈ ఉద్యమంలో విరివిగా వినియోగించిన నినాదాలుగా చెప్పొచ్చు. వాస్తవానికి 1952 జూలైలో వరంగల్‌లో పాఠశాల విద్యార్థులతో మొదలైన ఈ నాన్-ముల్కీ ఉద్యమం తర్వాత క్రమంలో హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు శరవేగంగా విస్తరించింది. ఈ ఉద్యమ సమయంలోనే 1952 సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జరిపిన పోలీస్ కాల్పుల్లో ఏడుగురు మరణించారు. దీన్నే ఆంధ్రా ప్రాంత వాసులకు వ్యతిరేకంగా తెలంగాణ విద్యార్థులు చేపట్టిన తొలి తెలంగాణ ఉద్యమంగా చెప్పొచ్చు.
 
అంతర్గత వలస పాలన
హైదరాబాద్ రాష్ట్రంలో 1949 డిసెంబర్‌లో సైనిక పాలన ముగిసింది. ఇండియన్ సివిల్ సర్వీసెస్ అధికారి ఎం.కె. వెల్లోడిని ఏడో నిజాం ముఖ్యమంత్రిగా నియమించారు. అదే విధంగా ఏడో నిజాం రాష్ట్రానికి అధిపతిగా కొనసాగారు. ముఖ్యమంత్రిగా ఎం.కె. వెల్లోడి పాలన 1952లో జరిగిన సాధారణ ఎన్నికల వరకు కొనసాగింది. సైనిక పాలన అయినా.. ముఖ్యమంత్రిగా ఎం.కె. వెల్లోడి పాలన అయినా.. హైదరాబాద్ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ పాలన కొనసాగించిందని చెప్పొచ్చు. మరో విధంగా చెప్పాలంటే హైదరాబాద్ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ అధికారం మరో నాలుగేళ్లు కొనసాగి, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ప్రజల ఆకాంక్షలను పూర్తిగా విస్మరించింది.
 
బూర్గుల ప్రభుత్వం
1952 సాధారణ ఎన్నికల ఫలితాలతో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. ఆయన మంత్రి వర్గాన్ని కూడా అప్పటికి రాజ్ ప్రముఖ్‌గా వ్యవహరిస్తున్న ఏడో నిజామే నియమించారు. అప్పటికి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఎం.కె. వెల్లోడిని.. బూర్గుల రామకృష్ణారావు సలహాదారుగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. వెల్లోడి సలహాదారుగా బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. వీటన్నిటినీ బట్టి స్థూలంగా ప్రస్ఫుటమయ్యే అంశం ఏమంటే.. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ అంతర్గత వలస పాలన ఎనిమిదేళ్లు (1948 సెప్టెంబర్ నుంచి 1956 అక్టోబర్ వరకు) కొనసాగింది. ఇది హైదరాబాద్ ప్రజల పాలిట అత్యంత దురదృష్టకర పరిణామం. ఇలా వలస రాజ్య పాలన క్రమంలో ఏడో నిజాం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన ఆవశ్యకత ఉంది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు వరకు ఏడో నిజాం హైదరాబాద్ రాష్ట్ర అధిపతిగా కొనసాగారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాజ్యాంగంలో హైదరాబాద్‌ను ‘బి-స్టేట్’గా వర్గీకరించి రాజ్ ప్రముఖ్‌ను రాష్ట్ర అధిపతిగా పేర్కొన్నారు. ఇలా మారిన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మరోసారి ఏడో నిజాంను రాజ్ ప్రముఖ్‌గా నియమించింది. రాజ్ ప్రముఖ్ హోదాలో ఏడో నిజాం ‘ఎ-స్టేట్’ కేటగిరీలో పేర్కొన్న గవర్నర్ హోదాకు సమానమైన రీతిలో విధులు నిర్వహించారు. అంతేకాకుండా ఆయన రాజ్ ప్రముఖ్ హోదాలో 1956  అక్టోబర్ 31వరకు అంటే హైదరాబాద్ రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా వేరు చేసి, ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని విలీనం చేస్తూ 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ పేరుతో కొత్త రాష్ట్రం ఆవిర్భవించే వరకు ఏడో నిజాం రాజ్ ప్రముఖ్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత కూడా ఏడో నిజాంను ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్‌గా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. నిరంకుశ నేపథ్యం ఉన్న వ్యక్తి (ఏడో నిజాం)ని కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్లపాటు హైదరాబాద్ రాష్ట్ర అధిపతిగా కొనసాగించడం ఇప్పటికీ అర్థం కాని విషయం. అంతర్గత వలస రాజ్య పాలనలో దీన్ని మరో రూపంగా పేర్కొనొచ్చు.
 
ఆంధ్ర రాష్ట్రం - 1953
దాదాపు రెండు వందల ఏళ్ల బ్రిటిష్ పాలనలో ఆంధ్ర ప్రజలు మద్రాస్ రాష్ట్రంలోనే ఉన్నారన్నది తెలిసిందే. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మద్రాస్ రాష్ట్రాన్ని తమిళులు పాలించారు. దీంతో ఆంధ్ర ప్రజలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తమిళులు ఎక్కువగా ఉండటం, అన్ని రంగాల్లో వారే ఆధిపత్యం చూపడమే ఇందుకు కారణం. నాటి మద్రాస్ రాష్ట్రంలోని మొత్తం ప్రజల్లో తమిళుల జనాభా 64 శాతం. కాగా ఆంధ్రుల జనాభా కేవలం 36 శాతం. ఈ కారణంతో ఆంధ్ర ప్రజలు మద్రాస్ రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం డిమాండ్ చేశారు. వాళ్ల డిమాండ్‌ను అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం 1953లో కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. మద్రాస్ రాష్ట్రంలోని ఆంధ్ర ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకోవడానికి గల బలమైన కారణాలను అప్పటి ప్రముఖ రాజకీయ వేత్త, ఆంధ్రప్రదేశ్ శాసన సభ తొలి స్పీకర్ ఎ. కాళేశ్వరరావు ఆయన స్వీయ చరిత్ర పుస్తకంలో సుస్పష్టంగా చెప్పారు. ‘మద్రాస్ శాసన వ్యవస్థ, ప్రభుత్వం, హై కోర్ట్‌లలో తమిళులు అత్యంత ప్రాధాన్యం కలిగున్నారు. తమిళుల నేతృత్వంలోని మద్రాస్ ప్రభుత్వ పాలనలో ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవం, వ్యక్తిత్వాలు పూర్తిగా క్షీణించాయి. అది కేవలం తమిళుల ప్రభుత్వమే. ఆంధ్రుల కోసం కాదు. మద్రాస్ ప్రభుత్వ హయాంలో తమిళులు అన్ని రకాల ప్రయోజనాలు అనుభవించారు. ఇదే సమయంలో ఆంధ్రులు తమ ప్రాంతంలో అన్ని రకాలుగా ఉపాధి, విద్య, ఆర్థిక వృద్ధి, పరిశ్రమలు, విద్యుత్ సరఫరా.. ఇలా అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురయ్యారు’- అనేది ఎ.కాళేశ్వరరావు స్వీయ చరిత్రలో పేర్కొన్న మాటలు. కానీ ఆంధ్రులు.. తమిళుల నుంచి తమకు ఎదురైన పరాభవాల నుంచి, అనుభవాల నుంచి ఎలాంటి పాఠం నేర్చుకోకపోగా.. 1956లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాక అంతకంటే దారుణంగా తెలంగాణ ప్రజల విషయంలో వ్యవహరించారు.
 
ఢిల్లీ పెద్దల అండతోనే ఆంధ్రప్రదేశ్
1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటికీ కర్నూలును రాజధానిగా చేయడంపై తీవ్ర నిరాశకు గురయ్యారు. శాశ్వత భవనాలు లేకుండా భారీ టెంట్లలో కార్యాలయాలు నెలకొల్పడం వంటి కారణాలతో రాజధాని నగరంగా కర్నూలు సరితూగదని భావించారు. మరోవైపు అప్పటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా లోటు బడ్జెట్‌తో ఉంది. అప్పటి వార్షిక బడ్జెట్‌లో వసూళ్ల మొత్తం రూ. 17 కోట్లు కాగా రూ. 5 కోట్ల లోటు ఏర్పడింది. కొత్త రాజధాని నిర్మాణానికి, దాని ద్వారా అభివృద్ధి కార్యకలాపాల నిర్వహణకు ఎలాంటి ఆస్కారం లేదని తేలింది. దీంతో తమ వాస్తవ పరిస్థితిని గమనించిన ఆంధ్ర వాసులు హైదరాబాద్‌ను రాజధానిగా కోరుతూ ‘విశాలాంధ్ర’ పేరుతో కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు. దీనికోసం 1955 నుంచి ఉద్యమం ప్రారంభించినా.. తెలంగాణ ప్రాంత నేతలు తీవ్ర వ్యతిరేకత, నిరసన వెలిబుచ్చారు. కానీ ఢిల్లీలోని కాంగ్రెస్ నేతల సహాయ సహకారాలతో వారు తమ ఉద్యమాన్ని విజయవంతం చేసుకోగలిగారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించేలా చేసి తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేసి.. ఆంధ్రప్రదేశ్ పేరుతో 1956లో కొత్త రాష్ట్రం ఏర్పాటులో విజయం సాధించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దల మద్దతు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భావం సాధ్యమయ్యేది కాదు.
 
త్యాగాల ఫలితమే తెలంగాణ
ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నేపథ్యంలో తెలంగాణ విషయంలో ప్రముఖంగా పేర్కొనాల్సిన అంశాలు... హైదరాబాద్ రాష్ట్రంలో మెజారిటీ ప్రాంతంగా ఉన్న తెలంగాణ, రాత్రికి రాత్రే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మైనారిటీ ప్రాంతంగా మారిపోయింది. 1956 నవంబర్ 1నాటికి రెండు ప్రాంతాల్లోని జనాభా నిష్పత్తి వివరాలు.. ఆంధ్ర ప్రదేశ్ 66 శాతం; తెలంగాణ 34 శాతం. ఆంధ్ర ప్రజలు తమకున్న మెజారిటీతో మద్రాస్ రాష్ట్రంలో తమిళుల మాదిరిగానే ఆంధ్ర ప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించారు. తర్వాత సంవత్సరాల్లోనూ దాన్ని కొనసాగించారు. తమకున్న ఆధిపత్యంతో తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసే చర్యలు చేపట్టారు. ఈ చర్యలు 1953కు ముందు మద్రాస్ రాష్ట్రంలో వారు అనుభవించిన వాటికంటే ఎక్కువే. తెలంగాణలోని అంతర్గత వలస రాజ్య పాలనకు తుది దశ 1956 నవంబర్ 1న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం. జనాభా పరంగా మెజారిటీ ఉన్న ఆంధ్ర రాష్ట్రం తమకంటే తక్కువ మెజారిటీ ఉన్న తెలంగాణలో విలీనమైంది. ఇలా భేదాలు, వేర్వేరు చారిత్రక నేపథ్యాలు ఉన్న రెండు రాష్ట్రాల విలీన పర్యవసానంగా తలెత్తే పరిణామాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర్లేదు. గత అరవై ఏళ్లుగా ఆంధ్ర ప్రాంత ప్రజలు తెలంగాణ ప్రాంత వాసులకు చేసిన అన్యాయం.. ఆంధ్రులు మద్రాస్‌లో తమిళుల నుంచి ఎదుర్కొన్న అన్యాయాల కంటే ఎంతో ఎక్కువ.
Published date : 12 Dec 2015 03:53PM

Photo Stories