Skip to main content

తెలంగాణ - శీతోష్ణస్థితి

కర్కటరేఖకు దిగువ భాగంలో, సముద్ర తీరానికి దూరంగా, పీఠభూమి ప్రాంతంలో ఉండటం వల్ల తెలంగాణ రాష్ట్రంలో సాధారణంగానే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. సముద్ర ప్రభావంలేని తెలంగాణ రాష్ట్రానికి అధిక ఉష్ణోగ్రతలు, అధిక చలి ఉంటుంది. సముద్ర మట్టానికి సుమారు 600 మీటర్ల ఎత్తులో ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి లాంటి జిల్లాల్లో మిగిలిన జిల్లాల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
ఒక ప్రాంతంలో నిర్దిష్ట కాలానికి చెందిన సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, పవనాలు, ఆర్ధ్రత, మేఘాలు, అవపాతం మొదలైన అంశాలన్నింటినీ కలిపి ‘వాతావరణం’గా పేర్కొంటారు. కొన్ని సంవత్సరాల పాటు ఒక విశాల ప్రాంతంలో ఒక మాదిరిగా కనిపించేలా ఉన్న వాతావరణ పరిస్థితులను ‘శీతోష్ణస్థితి’ అంటారు.
తెలంగాణ రాష్ట్రం ‘ఆయనరేఖా రుతుపవన శీతోష్ణస్థితి’ని కలిగి ఉంటుంది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ‘ఉప ఆర్ధ్ర శీతోష్ణస్థితి’ నుంచి దక్షిణ తెలంగాణలో ‘ఆర్ధ్ర శుష్క శీతోష్ణస్థితి’ వరకు వివిధ శీతోష్ణస్థితులు విస్తరించి ఉంటాయి. తెలంగాణలో వాతావరణం పొడిగా, వేడిగా ఉంటుంది.
సాధారణంగా తెలంగాణ శీతోష్ణస్థితి భారతదేశ శీతోష్ణస్థితిని పోలి ఉంది. భారత వాతావరణ శాఖ విభజించిన నాలుగు రుతువులు తెలంగాణకు కూడా వరిస్తాయి. అవి..
1. వేసవికాలం (మార్చి నుంచి మే): ఈ కాలంలో రాష్ట్రమంతటా ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయి. మే నెలలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. రాష్ర్టంలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 34.5 డిగ్రీల సెంటీగ్రేడ్, ఒక్కోసారి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటుతుంది. కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది.
  • రామగుండం (కరీంనగర్), కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ (ఖమ్మం), మంచిర్యాల (ఆదిలాబాద్) మొదలైన ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది.
  • ఈ కాలంలో ‘క్యుములోనింబస్’ మేఘాల వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురు గాలులు సంభవిస్తాయి. దీన్నే ‘సంవహన వర్షపాతం’ అంటారు. ఈ కాలంలో పిడుగులు పడి ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. దీని ప్రభావం ప్రధానంగా రైతులపై ఉంటుంది. ఈ కాలంలో వచ్చే వర్షాలను మ్యాంగో షవర్స్ లేదా ముంగారు వర్షాలు అంటారు.
  • మే నెల రెండో, మూడో వారాల్లో వడగాలులు వీస్తాయి. వీటివల్ల మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
  • తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం - కొత్తగూడెం (ఖమ్మం జిల్లా). ఇక్కడ సుమారు 50 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదైంది.
2. నైరుతి రుతుపవన కాలం (జూన్ నుంచి సెప్టెంబర్ వరకు): జూన్ రెండో వారంలో నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశిస్తాయి. జూన్ చివరి నాటికి రాష్ట్రమంతటికి విస్తరిస్తాయి. ఈ రుతుపవనాల మూలంగా తెలంగాణలో అధిక వర్షపాతం సంభవిస్తుంది. వీటి ద్వారా ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదవుతుంది. ఈ కాలంలో వచ్చిన వర్షాన్ని ‘పర్వతీయ వర్షపాతం’ అంటారు. ఇది ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా కురుస్తుంది.
  • నైరుతి రుతుపవనాల మూలంగా సంభవించే సాధారణ వర్షపాతం 715. మి.మీ.
  • ఈ కాలంలో అల్పంగా వర్షపాతం పొందే ప్రాంతం - మహబూబ్‌నగర్.
3. ఈశాన్య రుతుపవన కాలం లేదా తిరోగమన రుతుపవన కాలం (అక్టోబర్ నుంచి నవంబర్ వరకు): ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల నవంబర్, డిసెంబర్ నెలల్లో వర్షం కురుస్తుంది. ఈ కాలంలో ‘చక్రవాతాల’ వల్ల వర్షాలు సంభవిస్తాయి.
  • ఈశాన్య రుతుపవనాల మూలంగా సాధారణంగా తక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఈ పవనాల మూలంగా సంభవించే సాధారణ వర్షపాతం 129 మి.మీ.
  • ఈశాన్య రుతుపవనాల వల్ల అధికంగా వర్షపాతం పొందే ప్రాంతం హైదరాబాద్, అల్పంగా పొందే ప్రాంతం కరీంనగర్.
4. శీతాకాలం (డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు): దక్కన్ పీఠభూమిలో భాగమైన తెలంగాణలో చలి ఎక్కువగా ఉంటుంది. రాత్రిళ్లు మంచు కురుస్తుంది. ఈ కాలంలో కర్ణాటక పీఠభూమికి దగ్గరగా ఉన్న నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాలు మిగతా జిల్లాల కంటే చల్లగా ఉంటాయి. రాష్ర్టంలో ఉష్ణోగ్రతలు 29 నుంచి 12 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తగ్గుతాయి.
మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో మేలో అత్యధిక ఉష్ణోగ్రతలు, డిసెంబర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
వర్షపాతం
తెలంగాణలో సగటు వర్షపాతం ఏడాదికి 906.6 మి.మీ. ఇందులో 80 శాతం వర్షపాతం నైరుతి రుతుపవనాల వల్ల, 20 శాతం ఈశాన్య రుతుపవనాల వల్ల సంభవిస్తుంది.
  • 2004-05 నుంచి 2013-14 వరకు పరిశీలిస్తే 2009-10లో అతి తక్కువ వార్షిక వర్షపాతం (643.9 మి.మీ.) నమోదైంది.
  • 2013-14లో వార్షిక వర్షపాతం 1162.4 మి.మీ.గా నమోదైంది.
  • 2009-10లో అతి తక్కువ వర్షపాతం కారణంగా అత్యధిక శాతం విస్తీర్ణం బీడు భూమిగా ఉండిపోయింది.
  • నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలు సంవత్సరానికి 1000 మి.మీ. పైగా వర్షపాతం పొందుతాయి.
  • కరీంనగర్, మెదక్, నల్గొండ జిల్లాలు 850 మి.మీ. నుంచి 1000 మి.మీ. వర్షపాతం పొందుతాయి.
  • రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలు 850 మి.మీ. కంటే తక్కువ వర్షపాతం పొందుతాయి.
  • నైరుతి రుతుపవనాల కాలంలో సంభవించే సగటు వర్షపాతం 715 మి.మీ.
  • ఈశాన్య రుతుపవనాల కాలంలో లభించే సగటు వర్షపాతం 129 మి.మీ.
  • తెలంగాణ రాష్ర్టంలో 24 గంటల్లో అత్యధిక వర్షపాతం ఖమ్మం జిల్లాలోని ‘పేరూర్’లో 58.12 సెం.మీ. నమోదైంది.
  • తెలంగాణలో అత్యధిక వర్షపాతం ఉన్న ప్రాంతం శబరి నది, సీలేరు ప్రాంతం. సుమారు 152 సెం.మీ.
మాదిరి ప్రశ్నలు
Published date : 09 Sep 2015 05:05PM

Photo Stories