Skip to main content

జనాభా గణాంకాలు

భారతదేశంలో అనాదిగా అనేక ప్రాంతాల నుంచి అనేకజాతులకు చెందినవారు వచ్చి స్థిరపడ్డారు. కాలక్రమంలో ఈ జాతులన్నీ పరస్పరం కలిసిపోయి ఉపజాతులు, కులాలు, ఉపకులాలు ఏర్పడ్డాయి. తెలంగాణలోనూ ఇదే రకమైన సామాజిక వర్గీకరణ గమనించవచ్చు. భౌగోళికంగా తెలంగాణ దక్షిణ భారతదేశంలో ఉంది. అందువల్ల ఇక్కడ ‘ద్రవిడియన్’ జాతి ప్రబలంగా కనిపిస్తుంది. వీరినే ‘మెడిటరేనియన్లు’ అని కూడా అంటారు.
తెలంగాణలో నివసించే ప్రజలు ప్రధానంగా ‘ద్రవిడ’ జాతికి చెందినవారు. వీరినే ‘ద్రవిడియన్లు’ అంటారు. వీరిది ద్రవిడ భాష. ద్రవిడ భాషలు ప్రధానంగా నాలుగు. అవి:
1) తెలుగు
2) కన్నడ
3) తమిళం
4) మలయాళం
ద్రవిడ భాషల్లో తెలుగు మాట్లాడే వారు ఎక్కువగా ఉన్నారు. తెలుగు భాషకు 2008లో ప్రాచీన హోదా కల్పించారు.

2011 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మతాల వారీగా జనాభా వివరాలు
 • తెలంగాణ రాష్ట్ర మొత్తం జనాభా 3,51,93,978 (ఖమ్మం జిల్లా పూర్తి జనాభాను కలుపుకొని).
 • రాష్ట్రంలో మొత్తం హిందువుల జనాభా 2,99,48,451.
 • రాష్ట్ర మొత్తం జనాభాలో హిందువుల వాటా 85.09 శాతం.
 • రాష్ట్రంలో హిందువులు అధికంగా ఉన్న జిల్లాలు.. 1) రంగారెడ్డి (44.59 లక్షలు), 2) మహబూబ్‌నగర్ (36.73 లక్షలు).
 • హిందువులు తక్కువగా ఉన్న జిల్లాలు.. 1) హైదరాబాద్ (20.46 లక్షలు), 2) నిజామాబాద్ (21.23 లక్షలు).
 • రాష్ట్రంలో మొత్తం ముస్లింల జనాభా 44,64,699.
 • రాష్ట్ర మొత్తం జనాభాలో ముస్లింల వాటా 12.69 శాతం.
 • ముస్లింలు అధికంగా ఉన్న జిల్లాలు.. 1) హైదరాబాద్ (17.13 లక్షలు), 2) రంగారెడ్డి (6.17 లక్షలు).
 • ముస్లిం జనాభా తక్కువగా ఉన్న జిల్లాలు.. 1) ఖమ్మం (1.59 లక్షలు), 2) నల్లగొండ (1.89 లక్షలు).
 • రాష్ట్రంలో మొత్తం క్రైస్తవుల జనాభా 4,47,124.
 • రాష్ట్ర మొత్తం జనాభాలో క్రైస్తవుల వాటా 1.27 శాతం.
 • రాష్ట్రంలో క్రైస్తవులు అధికంగా ఉన్న జిల్లాలు.. 1) రంగారెడ్డి (1.44 లక్షలు), 2) హైదరాబాద్ (0.87 లక్షలు).
 • క్రైస్తవులు తక్కువగా ఉన్న జిల్లాలు.. 1) ఆదిలాబాద్ (0.15 లక్షలు), 2) నిజామాబాద్ (0.19 లక్షలు).
 • రాష్ట్రంలో మొత్తం సిక్కుల జనాభా 30,340.
 • రాష్ట్ర మొత్తం జనాభాలో సిక్కుల వాటా 0.086 శాతం.
 • రాష్ట్రంలో సిక్కులు అధికంగా ఉన్న జిల్లాలు.. 1) హైదరాబాద్ (11,446), 2) రంగారెడ్డి (8,062).
 • సిక్కుల జనాభా తక్కువగా ఉన్న జిల్లాలు.. 1) ఖమ్మం (655 మంది), 2) మహబూబ్‌నగర్ (658 మంది)
 • తెలంగాణ రాష్ట్రంలో మొత్తం బౌద్ధుల జనాభా 32,553.
 • రాష్ట్ర మొత్తం జనాభాలో బౌద్ధుల వాటా 0.092 శాతం.
 • బౌద్ధులు అధికంగా ఉన్న జిల్లాలు.. 1) ఆదిలాబాద్ (25,510 మంది), 2) రంగారెడ్డి (2,041 మంది).
 • బౌద్ధులు అత్యల్పంగా ఉన్న జిల్లాలు.. 1) ఖమ్మం (217 మంది), 2) నల్లగొండ (241 మంది).
 • తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జైనుల జనాభా 26,690.
 • రాష్ట్ర మొత్తం జనాభాలో జైనుల వాటా 0.076 శాతం.
 • జైనులు అధికంగా ఉన్న జిల్లాలు.. 1) హైదరాబాద్ (19,560 మంది), 2) రంగారెడ్డి (3,536 మంది).
 • జైనులు తక్కువగా ఉన్న జిల్లాలు.. 1) నల్లగొండ (250 మంది), 2) కరీంనగర్ (312 మంది).

దేశ జనాభాతో పోలిస్తే మతాల వారీగా తెలంగాణ జనాభా వివరాలు
 • దేశంలోని మొత్తం హిందువుల జనాభాలో తెలంగాణ హిందువుల వాటా 3 శాతం.
 • దేశ ముస్లిం జనాభాలో రాష్ట్ర ముస్లింల వాటా 2.59 శాతం.
 • దేశ క్రైస్తవ జనాభాలో రాష్ట్ర క్రైస్తవుల వాటా 1.58 శాతం.
 • దేశంలోని మొత్తం సిక్కుల జనాభాలో రాష్ట్ర వాటా 0.14 శాతం.
 • దేశ బౌద్ధుల జనాభాలో తెలంగాణ బౌద్ధుల వాటా 0.38 శాతం.
 • దేశంలోని మొత్తం జైనుల జనాభాలో రాష్ట్ర జైనుల వాటా 0.59 శాతం.

తెలంగాణలో మతాల వారీగా జనాభా (2011 గణాంకాల ప్రకారం)

మతం

జనాభా

శాతం

హిందువులు

2,99,48,451

85.09

ముస్లింలు

44,64,699

12.69

క్రైస్తవులు

4,47,124

1.27

సిక్కులు

30,340

0.086

బౌద్ధులు

32,553

0.092

జైనులు

26,690

0.076


పట్టణీకరణ
పట్టణాల్లో జనాభా అధికమవడం, పట్టణాల సంఖ్య పెరిగిపోవడాన్నే ‘పట్టణీకరణ’గా పేర్కొనవచ్చు.
 • 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణం అంటే..
  1) 5000 లేదా అంతకంటే ఎక్కువ జనాభా కలిగి ఉండాలి.
  2) కనీసం 75 శాతం మంది పురుషులు వ్యవసాయేతర రంగాల్లో పనిచేస్తూ ఉండాలి.
  3) జనసాంద్రత చ.కి.మీ. కనీసం 400గా ఉండాలి.
 • తెలంగాణ రాష్ట్రంలో పట్టణ జనాభా 136.09 లక్షలు.
 • రాష్ట్ర మొత్తం జనాభాలో పట్టణ జనాభా వాటా 38.88 శాతం.
 • సంఖ్యా పరంగా, శాతం పరంగా పట్టణ జనాభా అధికంగా ఉన్న జిల్లా ‘హైదరాబాద్’.
 • సంఖ్యా పరంగా, శాతం పరంగా పట్టణ జనాభా తక్కువగా ఉన్న జిల్లా ‘మహబూబ్‌నగర్’.

తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే - 2014

తెలంగాణ ప్రభుత్వం 2014 ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 17 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని 1,01,93,027 కుటుంబాల వివరాలను సేకరించారు. వీటి ఆధారంగా తెలంగాణలో ప్రజల జీవన పరిస్థితి, సామాజిక, ఆర్థిక, స్థితిగతులకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి.
సర్వే ప్రకారం తెలంగాణ జనాభాలో దాదాపుగా సగం మంది వెనకబడిన వర్గాలవారు ఉన్నారు. సుమారు అయిదో వంతు కుటుంబాల్లో మహిళలే పెద్ద దిక్కుగా ఉన్నారు. 30 శాతం కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు లేవని వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం..
 • అత్యధిక కుటుంబాలున్న జిల్లా రంగారెడ్డి.
 • అత్యల్ప కుటుంబాలున్న జిల్లా నిజామాబాద్.
 • సర్వేలో పాల్గొన్న ఎన్యూమరేటర్స్ 3,85,892 మంది.
సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా సామాజిక వర్గాల వారీగా జనాభా వివరాలు

సామాజిక వర్గం

శాతం

అధికంగా ఉన్న జిల్లాలు

అల్పంగా ఉన్న జిల్లా

ఎస్సీ

17.50

రంగారెడ్డి, మహబూబ్‌నగర్

నిజామాబాద్

ఎస్టీ

9.91

ఖమ్మం, ఆదిలాబాద్

హైదరాబాద్

బీసీ

51.08

రంగారెడ్డి, మహబూబ్‌నగర్

ఖమ్మం

ఓసీ

21.50

రంగారెడ్డి

ఆదిలాబాద్

మైనార్టీ

14.46

హైదరాబాద్, రంగారెడ్డి

ఖమ్మం


రాష్ట్రంలోని ముఖ్యమైన గిరిజన తెగలు
తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా గోండులు, కోలమ్, పర్ధాన్, లంబాడా, చెంచు, కోయ తదితర గిరిజన తెగలకు చెందిన ప్రజలున్నారు. వీరు అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో అధికంగా నివసిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని నల్లమల అడవుల్లో చెంచులు నివసిస్తున్నారు.

తెగ

నివసించే ప్రదేశం

మాట్లాడే భాష

ఎరుక

తెలంగాణ మొత్తం

తెలుగు, ఎరుకల

కోలాము

ఆదిలాబాద్

కోలామ్, తెలుగు

గోండులు

ఆదిలాబాద్, కరీంనగర్

తెలుగు, గోండి

తోటీలు

ఆదిలాబాద్

తెలుగు, మరాఠీ

ప్రదానులు

ఆదిలాబాద్

తెలుగు, మరాఠీ, గోండి

నాయక్ (నాయక్ పోడ్)

ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం

తెలుగు

భిల్లులు

ఆదిలాబాద్, హైదరాబాద్, మహబూబ్‌నగర్

తెలుగు

చెంచులు

మహబూబ్‌నగర్

తెలుగు

కోయ

ఖమ్మం, వరంగల్

తెలుగు, కోయ

కొండరెడ్లు

ఖమ్మం

తెలుగు

ఆంధ్

ఆదిలాబాద్

తెలుగు, మరాఠీ


తెలంగాణ రాష్ట్ర జనాభా-2011
భారతదేశంలో 1872 నుంచి 2011 వరకు మొత్తం 15 పర్యాయాలు జనగణన చేశారు. 2011లో 15వ సారి 28 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో జనగణన నిర్వహించారు. అప్పటికి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉంది. భారతదేశంలో తెలంగాణ 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత జనగణన ఒక్కసారి కూడా చేపట్టలేదు.

 1. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోపాలకృష్ణ పిళ్లై, జాతీయ జనాభా గణాంకాల రిజిస్ట్రార్ జనరల్ ‘చంద్రమౌళి’ 2011 జనాభా లెక్కల వివరాలను 2011 మార్చి 30న విడుదల చేశారు.
 2. ప్రపంచ జనాభాలో భారతీయులు 17.7 శాతం ఉన్నారు.
 3. జనాభా పరంగా భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా ఉంది. చైనా మొదటి స్థానంలో ఉంది.
 4. 2011 గణాంకాల ప్రకారం దేశ జనాభా 121 కోట్లు.

2011 జనాభా గణాంకాల ప్రధానాంశాలు
 • 2011 జనాభా లెక్కల రిజిస్ట్రార్ జనరల్ - చంద్రమౌళి
 • 2011 జనాభా లెక్కల నినాదం ‘అవర్ సెన్సస్ - అవర్ ఫ్యూచర్’.
 • 2011 జనగణన స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏడోసారి నిర్వహించింది.
 • దేశంలో మొట్టమొదటిసారిగా జనాభా వివరాలను 1872లో లార్డ్ మేయో కాలంలో లెక్కించారు.
 • 1881 నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా గణాంకాలు సేకరిస్తున్నారు.

రాష్ట్ర జనాభా - 2011
 • 2011 గణాంకాల ప్రకారం భారతదేశ జనాభా 1,21,05,69,573.
 • తెలంగాణ రాష్ట్ర జనాభా 3,51,93,978. గమనిక: ప్రస్తుతం తెలంగాణ జనాభా 3,50,03,674. ఖమ్మం జిల్లాలో 327 గ్రామాలను (7 మండలాలు) ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. దీంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 1.90 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వచ్చారు. ఫలితంగా జనాభా సంబంధిత విషయాల్లో మార్పులు జరిగాయి.
 • రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనాభా ఉన్న జిల్లాలు 1) రంగారెడ్డి, 2) మహబూబ్‌నగర్.
 • రాష్ట్రంలో అత్యల్ప జనాభా ఉన్న జిల్లాలు 1) నిజామాబాద్, 2) ఖమ్మం.

తెలంగాణ రాష్ట్ర జనాభా
సం. జనాభా (కోట్లలో) జన సాంద్రత లింగ నిష్పత్తి
1961 1.27 111 975
1971 1.58 138 961
1981 2.02 176 971
1991 2.61 227 967
2001 3.10 270 971
2011 3.51 307 988
ప్రస్తుతం 3.50 312

భాష ఆధారంగా జనాభా వివరాలు
 • రాష్ట్రంలో తెలుగు మాట్లాడేవారు 76 శాతం మంది ఉన్నారు.
 • తెలంగాణలో ఉర్దూ మాట్లాడేవారు 12 శాతం ఉన్నారు.
 • ఇతర భాషలు మాట్లాడేవారు 12 శాతం ఉన్నారు.
గమనిక: 1948కు ముందు హైదరాబాద్ ప్రాంతంలో అధికార భాష ‘ఉర్దూ’.
జనాభా పరిమాణం: రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభాను ‘రాష్ట్ర జనాభా పరిమాణం’ అంటారు.
జనసాంద్రత: ఒక చదరపు కిలోమీటర్ వైశాల్యంలో నివసించే వారి సంఖ్యను లేదా జనాభాను ‘జనసాంద్రత’గా పేర్కొంటారు.
 • 2011 లెక్కల ప్రకారం రాష్ట్ర జనసాంద్రత 307 (ప్రస్తుతం 312).

గమనిక:
ఖమ్మం జిల్లా జనసాంద్రత 175 నుంచి 197కు పెరిగింది.
లింగ నిష్పత్తి: ప్రతి వేయి మంది పురుషులకు ఉండే స్త్రీల సంఖ్యనే ‘లింగ నిష్పత్తి’ అంటారు.
 • 2011 లెక్కల ప్రకారం రాష్ట్ర లింగ నిష్పత్తి 988 (1000 : 988).
 • 2011 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో స్త్రీ, పురుష నిష్పత్తి అధికంగా ఉన్న జిల్లాలు - 1) నిజామాబాద్ (1040), 2) ఖమ్మం, కరీంనగర్ (1008).
 • 2011 లెక్కల ప్రకారం రాష్ట్రంలో స్త్రీ, పురుష నిష్పత్తి తక్కువగా ఉన్న జిల్లాలు.. 1) హైదరాబాద్ (954), 2) రంగారెడ్డి (961).

గమనిక:
దేశంలో స్త్రీ, పురుష నిష్పత్తి 943.
 • దేశంలో అధిక స్త్రీ, పురుష నిష్పత్తి ఉన్న రాష్ట్రం కేరళ (1084).
 • దేశంలో అత్యల్ప స్త్రీ, పురుష నిష్పత్తి ఉన్న రాష్ట్రం - హర్యానా (879).
 • తెలంగాణలో అత్యధిక జనసాంద్రత ఉన్న జిల్లాలు 1) హైదరాబాద్ (18,172), 2) రంగారెడ్డి (707).
 • రాష్ట్రంలో అత్యల్ప జనసాంద్రత ఉన్న జిల్లాలు 1) ఆదిలాబాద్ (170), 2) ఖమ్మం 175 (ప్రస్తుతం - 197).

గమనిక:
భారతదేశ సగటు జనసాంద్రత 382.
 • దేశంలో అత్యధిక జనసాంద్రత ఉన్న రాష్ట్రం బిహార్ (1106).
 • దేశంలో అత్యల్ప జనసాంద్రత ఉన్న రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్ (17).
 • దేశంలో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాలు 1) ఉత్తరప్రదేశ్, 2) మహారాష్ట్ర.
 • దేశంలో అత్యల్ప జనాభా ఉన్న రాష్ట్రాలు 1) సిక్కిం, 2) మిజోరాం.

జిల్లాల వారీగా జనసాంద్రత, లింగ నిష్పత్తి
జిల్లాలు జనసాంద్రత లింగ నిష్పత్తి
మహబూబ్‌నగర్ 220 977
రంగారెడ్డి 707 961
హైదరాబాద్ 18,172 954
మెదక్ 313 992
నిజామాబాద్ 321 1,040
ఆదిలాబాద్ 170 1,001
కరీంనగర్ 319 1,008
వరంగల్ 273 997
ఖమ్మం 197 1,008
నల్లగొండ 245 983
మొత్తం 312 988
గమనిక: ఖమ్మం జిల్లాలోని ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడానికి ముందు తెలంగాణ జనసాంద్రత 307.

జనాభా వృద్ధిరేటు
ఒక నిర్దిష్ట ప్రదేశంలో నిర్దిష్ట కాలంలో పెరిగే జనాభాను ‘జనాభా వృద్ధి’ అంటారు. ఏడాది కాలంలో ప్రతి వంద మంది జనాభాకు అదనంగా ఎంత మంది చేరుతున్నారో తెలిపే రేటును ‘జనాభా వృద్ధిరేటు’గా పేర్కొంటారు.
 • రాష్ట్రంలో 2001-11 మధ్య కాలంలో జనాభా వృద్ధిరేటు 13.58 శాతం.
 • తెలంగాణలో 2001-11 దశాబ్ద కాలంలో అధిక జనాభా వృద్ధిరేటు ఉన్న జిల్లాలు.. 1) రంగారెడ్డి (48.16 శాతం), 2) మహబూబ్‌నగర్ (15.34 శాతం).
 • రాష్ట్రంలో 2001-11 దశాబ్ద కాలంలో అల్ప జనాభా వృద్ధిరేటు నమోదైన జిల్లాలు.. 1) హైదరాబాద్ (2.97 శాతం) 2) నల్లగొండ (7.41 శాతం).
గమనిక: 2001-11లో భారతదేశ జనాభా వృద్ధిరేటు 17.7 శాతం.
 • దేశంలో అధిక జనాభా వృద్ధిరేటు ఉన్న రాష్ట్రం మేఘాలయ (27.9 శాతం)
 • దేశంలో అల్ప జనాభా వృద్ధిరేటు ఉన్న రాష్ట్రం నాగాలాండ్ (-0.6 శాతం).
 • తెలంగాణలో పురుషుల జనాభా 1.77 కోట్లు. రాష్ట్ర మొత్తం జనాభాలో 50.2 శాతం పురుషులు ఉన్నారు.
 • రాష్ట్రంలో పురుషుల జనాభా అత్యధికంగా ఉన్న జిల్లాలు.. 1) రంగారెడ్డి (27.01 లక్షలు), 2) మహబూబ్‌నగర్ (20.50 లక్షలు).
 • రాష్ట్రంలో పురుషుల జనాభా తక్కువగా ఉన్న జిల్లాలు.. 1) నిజామాబాద్ (12.50 లక్షలు), 2) ఆదిలాబాద్ (13.69 లక్షలు).
 • రాష్ట్రంలో స్త్రీల జనాభా 1.74 కోట్లు. మొత్తం జనాభాలో 49.8 శాతం స్త్రీలు ఉన్నారు.
 • రాష్ట్రంలో అత్యధిక స్త్రీ జనాభా ఉన్న జిల్లాలు 1) రంగారెడ్డి (25.95 లక్షలు), 2) మహబూబ్‌నగర్ (20.03 లక్షలు).
 • రాష్ట్రంలో అత్యల్ప స్త్రీ జనాభా ఉన్న జిల్లాలు 1) నిజామాబాద్ (13.00 లక్షలు), 2) ఆదిలాబాద్ (13.71 లక్షలు).

తెలంగాణ జనాభా వృద్ధిరేటు
దశాబ్దం వృద్ధిరేటు (శాతాల్లో)
1961-71 24.43
1971-81 27.58
1981-91 29.27
1991-2001 18.77
2001-2011 13.58

తెలంగాణలో జిల్లాల వారీగా జనాభా పరిమాణం
జిల్లాలు పురుషులు స్త్రీలు మొత్తం జనాభా
మహబూబ్‌నగర్ 20,50,386 20,02,642 40,53,028
రంగారెడ్డి 27,01,008 25,95,733 52,96,741
హైదరాబాద్ 20,18,575 19,24,748 39,43,323
మెదక్ 15,23,030 15,10,258 30,33,288
నిజామాబాద్ 12,50,641 13,00,694 25,51,335
ఆదిలాబాద్ 13,69,597 13,71,642 27,41,239
కరీంనగర్ 18,80,800 18,95,469 37,76,269
వరంగల్ 17,59,281 17,53,295 35,12,576
ఖమ్మం 12,98,543 13,08,523 26,07,066
నల్లగొండ 17,59,772 17,29,037 34,88,809
మొత్తం 3,50,03,674 1,73,92,041 3,50,03,674

అక్షరాస్యత రేటు
ఏదో ఒక భాషలో చదవడం, రాయడం తెలిసి ఉండటాన్ని ‘అక్షరాస్యత’ అంటారు. అక్షరాస్యత రేటు గణనలో ఏడేళ్ల పైబడిన వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అక్షరాస్యత రేటు విషయంలో దేశంలో తెలంగాణ రాష్ట్రం 25వ స్థానంలో ఉంది.
అక్షరాస్యత రేటు = (మొత్తం అక్షరాస్యులు ÷ మొత్తం జనాభా) × 100

వివిధ జనగణనల ప్రకారం తెలంగాణ రాష్ర్ట అక్షరాస్యత రేటు
సం. స్త్రీల అక్షరాస్యత రేటు (%) పురుషుల అక్షరాస్యత రేటు (%) మొత్తం అక్షరాస్యత రేటు (%)
1961 8.55 25.91 17.34
1981 16.79 35.90 26.49
2001 49.90 68.80 58.00
2011 57.92 74.95 66.46
 • తెలంగాణ రాష్ట్ర సగటు అక్షరాస్యత రేటు 66.46 (ప్రస్తుతం 66.54) శాతం.
 • దేశ సగటు అక్షరాస్యత రేటు 73 శాతం.
 • రాష్ట్రంలో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 207.84 లక్షలు. (ప్రస్తుతం 206.96 లక్షలు). ఇందులో పురుషులు 117.49 లక్షల (ప్రస్తుతం 117 లక్షలు) మంది, స్త్రీలు 90.35 లక్షల (ప్రస్తుతం 89.95 లక్షలు) మంది ఉన్నారు.
 • రాష్ట్రంలో పురుషుల సగటు అక్షరాస్యత రేటు 74.95 (ప్రస్తుతం 75.04) శాతం. స్త్రీల సగటు అక్షరాస్యత రేటు 57.92 (ప్రస్తుతం 57.99) శాతం.
 • రాష్ట్రంలో అక్షరాస్యులు అధికంగా ఉన్న జిల్లా రంగారెడ్డి.
 • రాష్ట్రంలో అక్షరాస్యులు అతి తక్కువగా ఉన్న జిల్లా నిజామాబాద్.
 • తెలంగాణలో అక్షరాస్యత రేటు అధికంగా ఉన్న జిల్లా హైదరాబాద్ (83.25 శాతం).
 • రాష్ట్రంలో అక్షరాస్యత రేటు తక్కువగా ఉన్న జిల్లా మహబూబ్‌నగర్ (55 శాతం).
 • పురుషుల్లో అక్షరాస్యత అధికంగా ఉన్న జిల్లా రంగారెడ్డి, తక్కువగా ఉన్న జిల్లా నిజామాబాద్.
 • స్త్రీలలో అక్షరాస్యత అధికంగా ఉన్న జిల్లా రంగారెడ్డి కాగా, అతి తక్కువగా ఉన్న జిల్లా నిజామాబాద్.
 • పురుషుల అక్షరాస్యత రేటు అధికంగా ఉన్న జిల్లా హైదరాబాద్ (86.99), తక్కువగా ఉన్న జిల్లా మహబూబ్‌నగర్ (62.21).
 • స్త్రీల అక్షరాస్యత రేటు అధికంగా ఉన్న జిల్లా హైదరాబాద్ (79.35 శాతం), తక్కువగా ఉన్న జిల్లా మహబూబ్‌నగర్ (44.72 శాతం).

షెడ్యూల్డ్ కులాల అక్షరాస్యత రేటు
 • రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) సగటు అక్షరాస్యత రేటు 58.90 శాతం.
 • షెడ్యూల్డ్ కులాల్లో పురుషుల సగటు అక్షరాస్యత రేటు 68.04 శాతం, స్త్రీల సగటు అక్షరాస్యత రేటు 49.90 శాతం.
 • ఎస్సీల్లో అక్షరాస్యత రేటు అధికంగా ఉన్న జిల్లా హైదరాబాద్ (77.28 శాతం).
 • ఎస్సీల్లో అక్షరాస్యత రేటు తక్కువగా ఉన్న జిల్లా మహబూబ్‌నగర్ 47.72 శాతం.

షెడ్యూల్డ్ తెగల అక్షరాస్యత రేటు
 • రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) అక్షరాస్యత రేటు 49.51 శాతం.
 • ఎస్టీల్లో పురుషుల సగటు అక్షరాస్యత రేటు 59.49 శాతం, స్త్రీల అక్షరాస్యత రేటు 39.44 శాతం.
 • ఎస్టీల్లో సగటు అక్షరాస్యత రేటు అధికంగా ఉన్న జిల్లా హైదరాబాద్ (69.34 శాతం).
 • ఎస్టీల్లో సగటు అక్షరాస్యత రేటు అల్పంగా ఉన్న జిల్లా మహబూబ్‌నగర్ (42.29).
 • భారతదేశంలో అక్షరాస్యత రేటు అధికంగా ఉన్న రాష్ట్రం కేరళ.
 • దేశంలో అక్షరాస్యత రేటు తక్కువగా ఉన్న రాష్ట్రం బిహార్.

అక్షరాస్యత రేటు
 • తెలంగాణలో గ్రామీణ అక్షరాస్యత రేటు 57.25 (ప్రస్తుతం 57.30) శాతం.
 • రాష్ట్రంలో గ్రామీణ అక్షరాస్యత రేటు అధికంగా ఉన్న జిల్లా రంగారెడ్డి.
 • రాష్ట్రంలో గ్రామీణ అక్షరాస్యత రేటు తక్కువగా ఉన్న జిల్లా మహబూబ్‌నగర్.

పట్టణ అక్షరాస్యత రేటు
 • తెలంగాణలో పట్టణ అక్షరాస్యత రేటు 81.09 శాతం.
 • రాష్ట్రంలో పట్టణ అక్షరాస్యత రేటు అధికంగా ఉన్న జిల్లా హైదరాబాద్.
 • పట్టణ అక్షరాస్యత రేటు తక్కువగా ఉన్న జిల్లా ఆదిలాబాద్.

తెలంగాణ అక్షరాస్యత - 2011 లెక్కల ప్రకారం (వివిధ జిల్లాలు)
జిల్లా స్త్రీల అక్షరాస్యతా రేటు పురుషుల అక్షరాస్యత రేటు మొత్తం అక్షరాస్యతా రేటు
హైదరాబాద్ 79.35 86.99 83.25
రంగారెడ్డి 69.40 82.11 75.87
వరంగల్ 55.69 74.58 65.11
ఖమ్మం 58.30 73.30 65.75
నల్లగొండ 54.19 74.10 64.20
కరీంనగర్ 54.79 73.65 64.15
మెదక్ 51.37 71.43 61.42
నిజామాబాద్ 51.54 71.47 61.25
ఆదిలాబాద్ 51.31 70.81 61.01
మహబూబ్‌నగర్ 44.72 65.21 55.04
మొత్తం 57.99 75.04 66.54

పట్టణ, గ్రామీణ జనాభా
దేశంలో, రాష్ట్రంలో కాలానుగుణంగా పట్టణ జనాభా పెరుగుతోంది. 2011 లెక్కల ప్రకారం భారత్‌లో సగటు పట్టణ జనాభా శాతం 31.2 ఉండగా, రాష్ట్రంలో పట్టణ జనాభా శాతం 38.67గా ఉంది. అంటే రాష్ట్ర పట్టణ జనాభా జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నట్లు గమనించవచ్చు.
 • రాష్ట్రంలో గ్రామీణ జనాభా 215.85 లక్షల (ప్రస్తుతం 213.95 లక్షలు) మంది.
 • రాష్ట్ర మొత్తం జనాభాలో గ్రామీణ జనాభా వాటా 61.33 (ప్రస్తుతం 61.12) శాతం.
 • సంఖ్యా పరంగా, శాతం పరంగా గ్రామీణ జనాభా అధికంగా ఉన్న జిల్లా మహబూబ్‌నగర్, తక్కువగా ఉన్న జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి.
 • తెలంగాణ రాష్ట్ర పట్టణ జనాభా 136.09 లక్షల మంది.
 • రాష్ట్ర మొత్తం జనాభాలో పట్టణ జనాభా వాటా 38.67 శాతం.
 • సంఖ్యా పరంగా, శాతం పరంగా పట్టణ జనాభా అధికంగా ఉన్న జిల్లా హైదరాబాద్, తక్కువగా ఉన్న జిల్లా మహబూబ్‌నగర్.
 • దేశంలో గ్రామీణ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్.
 • దేశంలో పట్టణ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర.

తెలంగాణ రాష్ర్టంలోని గ్రామీణ, పట్టణ జనాభా శాతం
సం. పట్టణ జనాభా శాతం జనాభా శాతం
1971 20.99 79.01
1981 25.27 74.73
1991 30.18 69.82
2001 31.79 68.21
2011 38.67 61.33

రాష్ట్రంలో పిల్లల (0-6 ఏళ్ల మధ్య వయసు వారు) జనాభా
 • తెలంగాణ రాష్ట్రంలో పిల్లల జనాభా 39.20 లక్షలు. ఇందులో బాలురు 20.28 లక్షల మంది కాగా, బాలికలు 18.92 లక్షల మంది ఉన్నారు.
 • రాష్ట్ర మొత్తం జనాభాలో పిల్లల వాటా 11.14 శాతం.
 • సంఖ్యా పరంగా పిల్లల జనాభా అధికంగా ఉన్న జిల్లా రంగారెడ్డి.
 • సంఖ్యా పరంగా పిల్లల జనాభా తక్కువగా ఉన్న జిల్లా ఖమ్మం.
 • శాతం పరంగా పిల్లల జనాభా అధికంగా ఉన్న జిల్లా మహబూబ్‌నగర్.
 • శాతం పరంగా పిల్లల జనాభా తక్కువగా ఉన్న జిల్లా కరీంనగర్.

రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జనాభా
 • రాష్ట్రంలో ఎస్సీల మొత్తం జనాభా 54,32,680 మంది.
 • రాష్ట్ర జనాభాలో ఎస్సీ జనాభా శాతం 15.44
 • రాష్ట్ర మొత్తం ఎస్సీ జనాభాలో గ్రామీణ ప్రాంతంలో ఉండేవారి శాతం 75.40.
 • రాష్ట్ర మొత్తం ఎస్సీ జనాభాలో పట్టణ ప్రాంతాల్లో ఉండే వారి శాతం 24.60.
 • సంఖ్యా పరంగా, శాతం పరంగా ఎస్సీ జనాభా అధికంగా ఉన్న జిల్లా కరీంనగర్.
 • సంఖ్యా పరంగా, శాతం పరంగా రాష్ట్రంలో ఎస్సీ జనాభా తక్కువగా ఉన్న జిల్లా హైదరాబాద్.
 • భారతదేశ మొత్తం జనాభాలో ఎస్సీ జనాభా వాటా 16.6 శాతం.
 • సంఖ్యా పరంగా దేశంలో ఎస్సీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్.
 • శాతం పరంగా దేశంలో ఎస్సీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం పంజాబ్.
 • సంఖ్యా పరంగా, శాతం పరంగా దేశంలో ఎస్సీ జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం మిజోరాం.

షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జనాభా
 • తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీల జనాభా 32.87 లక్షల మంది.
 • రాష్ట్ర మొత్తం జనాభాలో ఎస్టీల వాటా 9.34 శాతం.
 • సంఖ్యా పరంగా, శాతం పరంగా ఎస్టీ జనాభా అధికంగా ఉన్న జిల్లా ఖమ్మం.
 • సంఖ్యా పరంగా, శాతం పరంగా ఎస్టీ జనాభా తక్కువగా ఉన్న జిల్లా హైదరాబాద్.
 • రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న షెడ్యూల్డ్ తెగ ‘లంబాడి’.
 • రాష్ట్రంలో ఉన్న మొత్తం షెడ్యూల్డ్ తెగల సంఖ్య 32.
 • భారతదేశ మొత్తం జనాభాలో ఎస్టీ జనాభా వాటా 8.6 శాతం.
 • దేశంలో సంఖ్యా పరంగా అత్యధిక ఎస్టీ జనాభా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్.
 • దేశంలో సంఖ్యా పరంగా ఎస్టీ జనాభా అల్పంగా ఉన్న రాష్ట్రం సిక్కిం.
 • దేశంలో శాతం పరంగా ఎస్టీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం మిజోరాం.
 • దేశంలో శాతం పరంగా ఎస్టీ జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం గోవా.
 • దేశంలో ఎస్టీ జనాభా లేని రాష్ట్రాలు పంజాబ్, హర్యానా.

జనన రేటు
ఒక సంవత్సర కాలంలో 1000 మంది జనాభాకు ఉన్న జననాల నిష్పత్తిని ‘జనన రేటు’ అంటారు.
 • తెలంగాణ రాష్ట్ర సగటు జనన రేటు 17.4.
 • రాష్ట్రంలో అత్యధిక జనన రేటు ఉన్న జిల్లా హైదరాబాద్ (19.4).
 • రాష్ట్రంలో అత్యల్ప జనన రేటు ఉన్న జిల్లా వరంగల్ (16.2).

శిశు మరణాల రేటు
ప్రతి 1000 మంది జీవించి ఉన్న పిల్లలకు మరణించే పిల్లల సంఖ్యను ‘శిశు మరణాల రేటు’ అంటారు.
 • తెలంగాణ రాష్ట్రంలో శిశు మరణాల రేటు 39గా ఉంది.
 • రాష్ట్రంలో అత్యధిక శిశు మరణాల రేటు ఉన్న జిల్లా మహబూబ్‌నగర్ (53).
 • అత్యల్ప శిశు మరణాల రేటున్న జిల్లా హైదరాబాద్ (20).

ప్రసూతి మరణాల రేటు
ప్రతి లక్ష మంది జననాలకు మరణించే తల్లుల సంఖ్యను ‘ప్రసూతి మరణాల రేటు’ అంటారు.
 • తెలంగాణ రాష్ట్రంలో ప్రసూతి మరణాల రేటు 92.
 • రాష్ట్రంలో అత్యధిక ప్రసూతి మరణాల రేటు ఉన్న జిల్లా ఆదిలాబాద్ (152).
 • అత్యల్ప ప్రసూతి మరణాల రేటు ఉన్న జిల్లా హైదరాబాద్ (71).
Published date : 28 Dec 2015 12:04PM

Photo Stories