పోలీస్ కొలువు కొట్టే మార్గాలు...
విద్యార్హతలు..
2018 జూలై 1 నాటికి జనరల్, బీసీ అభ్యర్థులు తప్పనిసరిగా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇంటర్ లేదా పాలిటెక్నిక్ అర్హతతోపాటు మూడేళ్ల డిగ్రీ కోర్సు చదివి ఉండాలి. గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఓపెన్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
- ఎస్‌ఐ పోస్టులకు 2018 జూలై 1 నాటికి 21 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
- అగ్నిమాపక శాఖలోని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఉద్యోగాలకు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి.
- జైళ్ల విభాగంలోని డిప్యూటీ జైలర్ ఉద్యోగాలకు 21 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి.
- జెళ్ల శాఖలోని అసిస్టెంట్ మాట్రన్ ఉద్యోగాలకు 21 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి.
- బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. రిజర్వేషన్లకు అనుగుణంగా వివిధ వర్గాలకు చెందిన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
- సివిల్ పోస్టుల్లో మహిళలకు మూడో వంతు పోస్టులు రిజర్వ్ చేశారు. అలానే, ఏఆర్ పోస్టుల్లోనూ 10 శాతం సీట్లు కేటాయించారు.
ఎస్‌ఐ, ఆ స్థాయి ఇతర పోస్టులు...
పోస్టు | విభాగం | ఖాళీలు |
ఎస్‌ఐ (పురుష, మహిళా) | సివిల్ విభాగం | 710 |
ఎస్‌ఐ (పురుష, మహిళా) | ఆర్‌్్డ్ రిజర్వ్ | 275 |
ఎస్‌ఐ (పురుష) | ఎస్‌ఏఆర్ సీపీఎల్ | 5 |
ఎస్‌ఐ (పురుష) | టీఎస్‌ఎస్‌పీ | 175 |
ఎస్‌ఐ (పురుష) | 15వ బెటాలియన్ | 16 |
స్టేషన్ ఫైర్ ఆఫీసర్ | అగ్నిమాపక శాఖ | 19 |
డిప్యూటీ జైలర్ | జైళ్ల శాఖ | 15 |
అసిస్టెంట్ మాట్రన్ | జైళ్ల శాఖ | 2 |
ఎంపిక విధానం:
ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదట ప్రాథమిక రాత పరీక్ష, ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులోనూ అర్హత సాధించిన వారికి తుది రాత పరీక్ష నిర్వహిస్తారు. ప్రాథమిక రాత పరీక్షలో... అర్థమెటిక్, రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ సెక్షన్లకు 100 మార్కులు, జనరల్ స్టడీస్ సెక్షన్‌కు 100 మార్కులు ఉంటాయి. మొత్తంగా 200 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షకు కేటాయించిన సమయం మూడు గంటలు. పేపర్ ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మాధ్యమంలో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఓసీ అభ్యర్థులు 40 శాతం మార్కులు, బీసీ విద్యార్థులు 35 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ వర్గాలకు చెందిన అభ్యర్థులు కనీసం 30 శాతం మార్కులు పొందాలి.
- ప్రాథమిక పరీక్షను దాటిన తర్వాత ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్(పీఎంటీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ) నిర్వహిస్తారు. అన్నిపోస్టులకు నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ) :
అన్ని నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి పీఎంటీ దాటిన అభ్యర్థులు పీఈటీకి హాజరుకావల్సి ఉంటుంది. పురుష అభ్యర్థులు సివిల్ ఎస్‌ఐ, ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ పోస్టులకు 800 మీటర్ల పరుగుపందెంతోపాటు పట్టికలో పేర్కొన్న ఏవైనా రెండు ఈవెంట్స్‌ల్లో అర్హత సాధిస్తే సరిపోతుంది. మిగిలిన విభాగాల్లోని ఎస్‌ఐ పోస్టులకు అర్హత సాధించాలంటే.. అన్ని ఈవెంట్స్‌ల్లో ఉత్తీర్ణులవ్వడం తప్పనిసరి.
- మహిళా అభ్యర్థులు సివిల్, అసిస్టెంట్ మాట్రన్ పోస్టులకు 100 మీటర్ల పరుగు పందెంతోపాటు ఏదైనా ఒక ఈవెంట్‌లో అర్హత సాధిస్తే సరిపోతుంది. ఏఆర్ ఎస్‌ఐ పోస్టులకు అర్హత సాధించాలంటే మూడు ఈవెంట్స్‌ల్లో ఉత్తీర్ణులవ్వాలి.
- పీఈటీ దశ దాటిన వారికి ఫైనల్ రిటన్ టెస్ట్ ఉంటుంది. ఇందులో 4 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కి మూడు గంటల సమయం ఉంటుంది.
ఈవెంట్స్ ఒక్కసారే : పలు శాఖల్లో ఎస్‌ఐ, అసిస్టెంట్ ఎస్‌ఐ(ఫింగర్ ప్రింట్ బ్యూరో), కానిస్టేబుల్.. మొదలైన పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులు.. ప్రిలిమ్స్ దాటితే అన్ని పోస్టులకు వేర్వేరుగా ఈవెంట్స్‌కు హాజరయ్యే పరిస్థితి గతంలో ఉండేది. కానీ, ఈసారి అన్ని పోస్టులకు కలిపి ఒకే ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది.
నెగిటివ్ మార్కులున్నాయి...!
ఫైనల్ రిటన్ టెస్టులో భాగంగా నిర్వహించే మొదటి రెండు పేపర్లు.. పేపర్ 1, 2లు...ఇంగ్లిష్, తెలుగు/ఉర్దూలను గతంలో డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహించేవారు. వాటి స్థానంలో ఈసారి ఆబ్జెక్టివ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ రెండు పేపర్లల్లో అర్హత సాధించడం తప్పనిసరి. లేకపోతే అభ్యర్థులను తుది జాబితా ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. పైగా, ఈ రెండు పేపర్లలో మొదటిసారిగా నెగిటివ్ మార్కుల విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రతి తప్పు సమాధానానికి వాటికి కేటాయించిన మార్కుల్లో 25 శాతం కోత విధిస్తారు. అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ పేపర్లు పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. వీటిల్లోనూ కనీస మార్కులు సాధించాలి. ఓసీలు కనీసం 40 శాతం మార్కులు, బీసీలు 35 శాతం మార్కులు, ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు కనీసం 30 శాతం మార్కులు సాధిస్తే అర్హులుగా పరిగణిస్తారు.
ప్రిలిమ్స్, ఫైనల్ పరీక్షల సిలబస్ :
- ఈ రెండు పరీక్షలకు దాదాపు సిలబస్ ఒకటే. ఫైనల్ పరీక్షలో జనరల్ స్టడీస్ పేపర్‌లో అదనంగా పర్సనాలిటీ టెస్ట్ సిలబస్‌ను చేర్చారు. అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని పరీక్షించే విధంగా ఎథిక్స్, జండర్ సెన్సిటివిటీ, వీకర్ సెక్షన్, సోషల్ అవేర్‌నెస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంశాలపై ప్రశ్నలుంటాయి. ఇది తప్ప మిగతా సిలబస్ అంతా ప్రిలిమ్స్, ఫైనల్ పరీక్షలకు ఒకటే!
- అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/మెంటల్ ఎబిలిటీలో... నంబర్ సిస్టమ్, సరళ వడ్డీ, చక్ర వడ్డీ, నిష్పత్తులు, సగటు, శాతాలు, లాభ-నష్టాలు, సమయం-పని, పని-వేతనాలు, కాలం -దూరం, గడియారాలు-క్యాలెండర్లు, భాగస్వామ్యం, బీజగణితం నుంచి ప్రశ్నలు వస్తాయి. రీజనింగ్‌లో వెర్బల్,నాన్ వెర్బల్‌పై ప్రశ్నలు ఉంటాయి. అనాలజీస్, సిమిలారిటీస్-డిఫరెన్సెస్, స్పేషియల్ విజులైజేషన్, స్పేషియల్ ఓరియెంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలసిస్, జడ్‌జమెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమొరీపై ప్రశ్నలు అడుగుతారు.
- జనరల్ స్టడీస్ పేపర్‌లో... జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, భారతదేశ చరిత్ర, భారత భూగోళ శాస్త్రం, ఇండియన్ పాలిటీ, ఎకానమీలతో పాటు 1948 నుంచి 2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమంపై ప్రశ్నలడుగుతారు. ఫైనల్ పరీక్షలో వీటితో పాటు అభ్యర్థి పర్సనాలిటీ పరీక్షించే విధంగా ఎథిక్స్, జండర్ సెన్సిటివిటీ, వీకర్ సెక్షన్, సోషల్ అవేర్‌నెస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంశాలపై ప్రశ్నలుంటాయి.
- ఫైనల్ రాత పరీక్షలోని ఇంగ్లిష్, తెలుగు పేపర్‌లలో అభ్యర్థి భాష పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలడుగుతారు. ఇవి కూడా పదోతరగతి స్థాయిలోనే ఉంటాయి. వ్యాకరణం, పదజాలం, కాంప్రహెన్షన్, భాషను ఎలా ఉపయోగించాలి తదితర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. పేపర్ 2లో తెలుగు లేదా ఉర్దూను ఎంచుకోవచ్చు.
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ) :
ఈవెంట్స్ | జనరల్ | ఎక్స్‌సర్వీస్‌మెన్ | మహిళలకు |
100 మీటర్ల పరుగు | 15 సెకన్లు | 16.5 సెకన్లు | 20 సెకన్లు |
లాంగ్‌జంప్ | 3.80 మీటర్లు | 3.65 మీటర్లు | 2.5 మీటర్లు |
షాట్‌పుట్ (7.26కిలోలు) | 5.60 మీటర్లు | 5.60 మీటర్లు | 3.75 మీటర్లు |
హైజంప్ | 1.20 మీటర్లు | 1.05 మీటర్లు | - |
800 మీటర్ల పరుగు | 170 సెకన్లు | 200 సెకన్లు | - |
(షాట్‌పుట్ బాల్ బరువు పురుషులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు 7.26 కిలోలు, మహిళలకు 4 కిలోలు) |
ఫైనల్ రాత పరీక్ష :
పేపర్ | సబ్జెక్ట్ | ప్రశ్నల సంఖ్య | మార్కులు |
పేపర్1 | ఇంగ్లిష్ (ఆబ్జెక్టివ్ విధానం) | 200 | 100 |
పేపర్2 | తెలుగు/ఉర్దు (ఆబ్జెక్టివ్ విధానం) | 200 | 100 |
పేపర్3 | అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/ మెంటల్ అబిలిటీ | 200 | 200 |
పేపర్4 | జనరల్ స్టడీస్ | 200 | 200 |
గమనిక: ఏఆర్, ఎస్‌ఏఆర్ సీపీఎల్, టీఎస్‌ఎస్‌పీ, టీఎస్‌ఎస్‌పీ 15వ బెటాలియన్ పోస్టులకు రాత పరీక్షలోని అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ పేపర్లల్లో ఒక్కో సబ్జెక్టులో వచ్చిన మార్కులను 100కు కుదిస్తారు. అంటే.. ఈ రెండు పేపర్లల్లో వచ్చిన మార్కులను కలిపి మొత్తంగా 200 మార్కులకు పరిగణించి.. అంతిమంగా ఫైనల్ రాత పరీక్ష + పీఈటీ(125 మార్కులు)లో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
ముఖ్య సమాచారం..
ఎంపిక విధానం: ప్రాథమిక రాతపరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, తుది రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ పద్ధతిలో
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు కానిస్టేబుల్ పోస్టులకు రూ.800, ఎస్సీ/ఎస్టీలకు రూ.400; జనరల్ అభ్యర్థులకు ఎస్‌ఐ పోస్టులకు రూ.1000, ఎస్సీ/ఎస్టీలకు రూ.500
దరఖాస్తు ప్రారంభ తేది: జూన్ 09, 2018
దరఖాస్తుకు చివరి తేది: జూన్ 30, 2018
వెబ్‌సైట్: www.tslprb.in
కమ్యూనికేషన్స్ ఎస్‌ఐ, కానిస్టేబుల్ :
ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ ఎస్‌ఐ-29, కానిస్టేబుల్-142, ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ఏఎస్‌ఐ- 26 పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. వీటికి పురుష, మహిళా అభ్యర్థులు అర్హులు. వీటితోపాటు పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్‌లో కానిస్టేబుల్(మెకానిక్) -19, కానిస్టేబుల్ (డ్రైవర్స్) -70 ఖాళీలు కూడా ఉన్నాయి.
ఎస్‌ఐ, ఏఎస్‌ఐ పోస్టులకు అర్హతలు..
కమ్యూనికేషనన్స్-ఐటీ విభాగంలోని ఎస్‌ఐ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. ఈసీఈ, ఈఈఈ, ఐటీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా తత్సమాన కోర్సుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ (బీఈ/బీటెక్) పూర్తిచేసి ఉండాలి. ఏఎస్సై పోస్టుల కోసం కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ రెండు పోస్టులకు వయసు 21 ఏళ్ల నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి.
కానిస్టేబుల్ అర్హతలు..
- కమ్యూనికేషన్స్ విభాగంలో కానిస్టేబుల్ పోస్టులకు 18ఏళ్ల నుంచి 22 ఏళ్లలోపు వయసు ఉండాలి. పదోతరగతితోపాటు ఐటీ, ఎలక్టాన్రిక్, మెకానిక్, ఐటీ, ఎలక్టాన్రిక్ సిస్టమ్ మెయింటెనెన్స్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, మెకానిక్ కన్జూమర్ ఎలక్టాన్రిక్స్, ఎలక్టీష్రియన్ విభాగాల్లో ఐటీఐ లేదా వొకేషనల్ ఇంటర్ ఇన్ ఈఈటీ, ఈటీ కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
- కానిస్టేబుల్ మెకానిక్ పోస్టులకు 18ఏళ్ల నుంచి 22 ఏళ్లలోపు వయసు ఉండాలి. పదోతరగతితో పాటు ఐటీఐలో వైర్‌మన్ లేదా మెకానిక్, ఫిట్టర్ విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి.
- కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకు 21 ఏళ్ల నుంచి 25 ఏళ్లలోపు వయసు ఉండాలి. పదో తరగతితో పాటు ఐటీఐలో ఎలక్టాన్రిక్ లేదా మెకానిక్ మోటార్ లేదా మెకానిక్ డీజిల్, ఫిట్టర్ విభాగంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టెక్నికల్ అర్హత కింద లైట్ మోటార్ వెహికల్ (ఎల్‌ఎంవీ) లెసైన్స్ తో పాటు బ్యాడ్‌జ నంబర్ కలిగి ఉండాలి. లేదా హెవీ మోటార్ వెహికల్(హెచ్‌ఎంవీ) లెసైన్స్ పొంది, కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
- అభ్యర్థులెవరైనా తగిన విద్యార్హతలుండి ప్రస్తుతం హోంగార్డులుగా పనిచేస్తుంటే.. 40ఏళ్ల వరకు గరిష్ట వయోపరిమితి వెసులుబాటు ఉంటుంది. వారు గత రెండేళ్లలో కనీసం 365 రోజుల పాటు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్స్ విభాగంలో మహిళా కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారికి వయోపరిమితి సడలింపు ఉంది. ఒంటరి మహిళలు/విడాకులు తీసుకున్న మహిళలు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వారికి 18ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు వయసు ఉండాలి. ఇతర కేటగిరీల మహిళా అభ్యర్థులకు 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వయసు ఉండాలి.
కానిస్టేబుల్ పోస్టులు :
క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే కానిస్టేబుల్ ఉద్యోగాలు డిపార్ట్‌మెంట్‌లో అత్యంత కీలకమైనవి. ఈసారి అత్యధికంగా సుమారు 17వేల పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఇంటర్/పదో తరగతి ఉత్తీర్ణతతో చిన్నవయసులోనే ప్రభుత్వ ఉద్యోగంలో చేరే అవకాశం కానిస్టేబుల్ ద్వారా లభిస్తుంది.
ఖాళీల వివరాలు...
పోస్టు | విభాగం | ఖాళీలు |
కానిస్టేబుల్ (పురుష, మహిళా) | పోలీస్ సివిల్ | 5,909 |
కానిస్టేబుల్ (పురుష, మహిళా) | ఆర్మ్‌డ్ రిజర్వ్ | 5,273 |
కానిస్టేబుల్ (పురుష) | ఎస్‌ఏఆర్ సీపీఎల్ | 53 |
కానిస్టేబుల్ (పురుష) | టీఎస్‌ఎస్‌పీ | 4,816 |
కానిస్టేబుల్ (పురుష) | ఎస్‌పీఎఫ్ | 485 |
ఫైర్‌మన్ | అగ్నిమాపక శాఖ | 168 |
వార్డర్స్ (పురుష) | జైళ్ల శాఖ | 186 |
వార్డర్స్ (మహిళ) | జైళ్ల శాఖ | 35 |
మొత్తం | | 16,925 |
విద్యార్హతలు..
ఈ పోస్టులన్నింటికీ జనరల్, బీసీ అభ్యర్థులు ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే పదో తరగతి ఉత్తీర్ణులై ఇంటర్ చదవి ఉండాలి. సెకండ్ ఇయర్ పరీక్షలకు హాజరై ఉండాలి.
వయసు :
18 ఏళ్ల నుంచి 22 ఏళ్ల వయసు ఉండాలి. ప్రస్తుతం హోంగార్డులుగా పనిచేస్తున్నవారైతే గత రెండేళ్లలో కనీసం 365 రోజులు విధులకు హాజరై ఉండాలి. వీరు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు ఉండాలి. ఇక అగ్నిమాపక, జైళ్ల శాఖల్లోని కానిస్టేబుల్ పోస్టులకు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలోపు వయసు ఉండాలి.
మహిళలకు వయోపరిమితి వెసులుబాటు :
మహిళా కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారికి పలు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఒంటరి మహిళలు/విడాకులు తీసుకున్న మహిళలు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వారికి 18 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు వయసు ఉండాలి. ఇతర కేటగిరీల మహిళా అభ్యర్థులకు 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వయసు ఉండాలి.
- బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. రిజర్వేషన్లకు అనుగుణంగా వివిధ వర్గాలకు చెందిన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
- సివిల్ పోస్టుల్లో మహిళలకు మూడో వంతు పోస్టులు రిజర్వ్ చేశారు. ఏఆర్ పోస్టుల్లోనూ 10 శాతం సీట్లు కేటాయించారు.
ఎంపిక ఇలా..
ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదట ప్రాథమిక రాత పరీక్ష, ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులోనూ ఉత్తీర్ణులైన వారికి తుది రాత పరీక్ష నిర్వహిస్తారు. ప్రాథమిక రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో 200 ప్రశ్నలు ఉంటాయి. సమయం 3 గంటలు. ఇంగ్లీష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ, తెలంగాణ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఇందులో కనీస అర్హత మార్కులు పొందితే పీఎంటీ, పీఈటీలకు అనుమతిస్తారు. జనరల్ విద్యార్థులు 40%, బీసీ 35%, ఎస్సీ/ఎస్టీ /ఎక్స్‌సర్వీస్‌మెన్ 30% మార్కులు విధిగా పొందాలి. ఇక పీఈటీ దశ దాటిన వారికి ఫైనల్ రిటన్ టెస్ట్ ఉంటుంది. ఇందులోనూ ఒక పేపర్,మూడు గంటల సమయం ఉంటుంది. ఫైనల్ రాత పరీక్షలో పొందే మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. కానిస్టేబుల్(సివిల్), జైళ్ల శాఖలో వార్డర్, ఫైర్‌మెన్ పోస్టులు తప్ప మిగతా అన్ని పోస్టులకు ఈవెంట్స్‌కు వెయిటేజీ ఇస్తారు. రాత పరీక్షలో వచ్చిన మార్కులను, ఈవెంట్స్‌లో వచ్చిన మార్కులను కలిపి మెరిట్ జాబితా రూపొందిస్తారు.