Inter Exams: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
నిమిషం నిబంధన అమలులో ఉన్నందున విద్యార్థులు అరగంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. పరీక్షల నిర్వహణపై పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమై ఏర్పాట్ల గురించి వివరించారు. ఈసారి ఆంగ్లంలో 20 శాతం మార్కులతో ప్రాక్టికల్ పరీక్షలను ఇంటర్ బోర్డు నిర్వహించింది. దీంతో ఉత్తీర్ణత శాతం పెరగడమే కాకుండా ఈసెబ్జెక్టులో అధిక మార్కులు సాధించే అవకాశం లభించింది.
జిల్లాలో 32 పరీక్ష కేంద్రాలు..
ఫిబ్రవరి 28వ తేదీ (బుధవారం) నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మార్చి 19వ తేదీ వరకు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. నాగర్ కర్నూల్ జిల్లాలో 15 ప్రభుత్వ, 28 ప్రభుత్వ సెక్టార్, 24 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. మొదటి సంవత్సరం పరీక్షలకు 6,837 మంది, రెండో సంవత్సరం 7,034 మందితో కలిపి మొత్తం 13,871 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరి కోసం 32 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ప్రశ్నపత్రాలను తెరిచే ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు.
సెంటర్ లోకేటర్ యాప్..
పరీక్ష కేంద్రాల చిరునామాను సులభంగా తెలుసుకోవడానికి ఈఏడాది ఎంసెట్ తరహాలో సెంటర్ లోకేటర్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. హాల్ టికెట్ జారీ సమయంలో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులు పెడతాయన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఇంటర్ విద్యార్థులు ఆన్‌లైన్‌లో నేరుగా హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్రిన్సిపాల్ సంతకం లేకుండానే పరీక్షలకు హాజరు కావచ్చు. దీనిపై ఇప్పటికే అన్ని పరీక్ష కేంద్రాల చీప్ సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీచేశారు.
Intermediate Exams 2024: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం
● పరీక్ష కేంద్రాలకు దూరంగా ఉన్న గురుకులాలు, మోడల్, మైనార్టీ వెల్ఫేర్ కళాశాలల విద్యార్థులకు అర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఉచితంగా పరీక్ష కేంద్రాలకు వెళ్లి, వచ్చే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.
● పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఇప్పటికే ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాలు కళాశాలలకు రాగా.. వాటిని పోలీస్‌స్టేషన్లలో భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు. కళాశాల సమీపంలోని బుక్‌స్టాల్స్, జిరాక్స్ సెంటర్లు ఓపెన్ చేయొద్దని నిర్వాహకులకు సూచించారు.
● కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్, మెడిసిన్ అందుబాటులో ఉంచనున్నారు. ప్రథమ చికిత్స అందించేందుకుగాను ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, సూపర్‌వైజర్లను నియమించారు.
పకడ్బందీగా నిర్వహిస్తాం..
ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశాం. హాల్‌టికెట్లు అందని విద్యార్థులు ఇంటర్ బోర్డు వెబ్‌సైట్ ద్వారా నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నిర్ణీత సమయం కంటే గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. పరీక్ష కేంద్రాలను సులభంగా గుర్తించేందుకు లోకేటర్ యాప్‌ను వినియోగించుకోవాలి. – వెంకటరమణ, ఇంటర్ విద్య నోడల్ అధికారి