Telangana: ప్రాక్టికల్స్‌కు రసాయనాలు కరువు
చాలా కళాశాలల్లో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్మీడియట్‌లో ప్రయోగ పరీక్షలు ప్రధాన భూమిక పోషిస్తాయి. వంతశాతం మార్కులు సాధించేందుకు ఇవి దోహదపడతాయి. అంతటి ప్రాధాన్యమున్న ప్రయోగ పరీక్షలపై నిర్లక్ష్యం చూపుతుండటంతో ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థులు నష్టపోవాల్సి వస్తుంది.
పాఠాలను ప్రయోగపూర్వకంగా వివరిస్తే పూర్తి స్థాయిలో అవగాహన కలుగుతుంది. జిల్లాలో చాలా కళాశాలల్లోని ప్రయోగశాలల్లో పరికరాలు, రసాయనాలు లేవు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరగునున్నాయి.
ప్రయోగాలకు అవసరమయ్యే రసాయనాలు, సామగ్రి కళాశాలలకు సరఫరా కాలేదు. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు ప్రయోగాలు చేయడానికి ఏటా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చదవండి: ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్
నిధులు రాకపోవడంతో..
ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ప్రయోగ పరీక్షలకు ఉపయోగపడే రసాయనాలు, పరికరాలకు సంబంధించిన నిధులు నాలుగైదు ఏళ్లుగా ప్రభుత్వం విడుదల చేయడం లేదు. దీంతో ఉన్న వాటితోనే సర్దుకోవాల్సి వస్తోంది. అరకొర ఉండే రసాయనాలతో ప్రయోగాలు చేస్తున్నారు.
ముఖ్యంగా విద్యార్థులకు ప్రాక్టికల్స్ సమయంలో ఉపయోగపడే బ్యూరెట్, పిప్పెట్, క్లోనికల్ గ్లాసు తదితర పరికరాలు కొన్ని కళాశాలల్లో చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే రసాయనాల్లో తాజాగా ఉండాల్సిన హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రికామ్లం అందుబాటు లేవు. పాతవి కావడంతో ఆమ్లాలలోని గాఢత తగ్గిపోయి నిర్ధిష్టంగారావడం లేదు. జీవశాస్త్రానికి సంబంధించి క్రొమటోగ్రఫీలో ఎసిటోన్, ఇథైల్ ఆల్కహాల్, ఫినాప్తలీన్ ముఖ్యమైనవి.
భౌతిక, రసాయనశాస్త్రంలోనూ వీటి అవసరం ఉంటుంది. ఈ ఆమ్లాల సీసాల బిరడాలను ఒక సారి తీసేస్తే మరోసారి ప్రయోగానికి పనికిరావు. ఇవన్నీ ఆవిరయ్యే గుణాలు కలిగి ఉంటాయి. ఏళ్ల తరబడి రసాయనాలు అందకపోతే విద్యార్థులు ప్రయోగాలు ఎలా చేస్తారని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్
జిల్లాలో ప్రయోగ పరీక్షలను ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకు 44 సెంటర్లను ఏర్పాటు చేశారు.
జిల్లాలో మొత్తం ఏడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కేబీజీవీలు ఐదు, మోడల్ స్కూల్స్ 9, సోషల్ వెల్ఫేర్ కళాశాలలు 8, ట్రైబల్ వెల్ఫేర్‌లు మూడు, బీసీ గురుకులాలు 8, మైనార్టీ కళాశాలలు నాలుగు, రెసిడెన్షియల్ కళాశాల ఒకటి ఉంది. వీటిలో ద్వితీయ సంవత్సరం 9,500 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరంతా ప్రాక్టికల్స్‌కు హాజరుకానున్నారు.
అయితే కొన్ని కళాశాలల్లోని ప్రయోగశాలల్లో సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్టు పలు ఆరోపణలు ఉన్నాయి. గతంలో సైతం అరకొర నిధులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ప్రతి కళాశాలకు రూ. 25వేల వరకు నిధులు ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ అరకొర నిధులు కూడా రాక విద్యార్థులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.