Education System: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం: సీఎం
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన, ఇంటర్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రితో కలిసి సీఎం డిసెంబర్ 9న విద్యా రంగంపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కేజీ టు పీజీలో ప్రస్తుత పరిస్థితి, తీసుకోవలసిన చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు. అన్ని స్థాయిల్లో ఖాళీల వివరాలను అధికారుల ద్వారా సీఎం తెలుసుకున్నారు. పాఠశాల, ఉన్నత విద్య పరిధిలో ప్రస్తుతం ఉన్న సిబ్బంది, ఖాళీలను నవీన్ మిట్టల్ వివరించారు. పాఠశాల విద్యా విభాగంలో దాదాపు 22 వేల ఖాళీ పోస్టులను ఇటీవల గుర్తించిన విషయాన్ని సీఎం దృష్టికి ఆయన తీసుకెళ్లారు. ఉన్నత విద్య పరిధిలో దాదాపు వెయ్యి వరకూ ఖాళీలున్నాయని వివరించారు. ఇంటర్మీ డియెట్ కళాశాలల్లో ఈ సంవత్సరం ప్రవేశాలు పెరిగాయని, సిలబస్ దాదాపు పూర్తవబోతోందని అధికారులు తెలిపారు. కోవిడ్ పరిణామాలు, విద్యా సంస్థల్లో శానిటైజేషన్ అమలు తీరుపై కాసేపు సమీక్ష జరిగినట్టు సమాచారం. జాతీయ, అంతర్జాతీయ పోటీని తట్టుకునేలా ఉన్నత విద్యలో మార్పులు తేవాలని సీఎం ఆకాంక్షించినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఏ జిల్లాలో ఎన్ని కళాశాలలున్నాయి? వాటి పరిస్థితి ఏమిటి? ఎలాంటి మార్పులు తీసుకు రావలసిన అవసరం ఉందో సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం కోరినట్టు తెలిసింది. ఖాళీల భర్తీపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని సీఎం సంకేతాలు ఇచ్చినట్టు అధికారులు తెలిపారు.
చదవండి:
Justice NV Ramana: విద్యార్థుల నుంచి పెద్ద నేతలేరీ?