Skip to main content

Dinesh: చిచ్చరపిడుగు.. పది లక్షల మందిలో ప్రథముడు

సాక్షి, ప్రత్యేకప్రతినిధి/నాగర్‌కర్నూల్‌ : వ్యక్తిగత పరిశుభ్రతపై దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలో నల్లమలకు చెందిన విద్యార్థి ప్రతిభ చాటాడు.
National Test Winner in Personal Hygiene,Dinesh, Hygiene Champion of Nagarkarnool, Top Scorer in Hygiene Test
చిచ్చరపిడుగు.. పది లక్షల మందిలో ప్రథముడు

అపోలో హాస్పిటల్, డెటాల్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన టోటల్‌ హెల్త్‌ కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రతపై పరీక్ష జరగ్గా, ఇందులో నాగర్‌కర్నూల్‌ జిల్లా మన్ననూర్‌ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న దినేష్‌ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచాడు.  

దినేష్‌ బతకడమే కష్టమన్నారు... 

నాగర్‌కర్నూల్‌ జిల్లా మన్ననూరుకు చెందిన దినేష్‌ తండ్రి కరమ్‌చంద్‌ కొన్నాళ్లు కాంట్రాక్ట్‌ టీచర్‌గా పనిచేశాడు. ఈయన భార్య మహేశ్వరి దినేష్‌కు ఊహ తెలియకముందే కన్నుమూసింది. తల్లి ప్రేమకు దూరమై పెరిగిన దినేష్‌ నాలుగేళ్ల వయసులో ఇంట్లో స్టవ్‌ దగ్గర ఆడుకుంటుండగా ప్రమాదం జరిగింది. ముఖం, కాళ్లు, చేతులు 60 శాతం కాలిపోయాయి. చికిత్స చేసే ముందే డాక్టర్లు దినేష్‌ బతకడమే కష్టమన్నారు.

చదవండి: appsc group 1 ranker success story : ఒకే ఇంట్లో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆ అక్కాచెల్లెళ్లు సరస్వతీ పుత్రికలు

ఐదేళ్లకు ఒక ఆపరేషన్, ఆరేళ్ల వయసులో దినేష్‌కు రెండు మేజర్‌ ఆపరేషన్లు జరిగాయి. తర్వాత కొంతవరకు శరీరం సాధారణ స్థితికి వచ్చింది. ఇప్పటికీ ముఖం, చేతులు మామూలు స్థితికి చేరుకోలేదు. కాళ్లు పూర్తి స్థాయిలో పనిచేయడానికి మరో శస్త్రచికిత్స చేయాలని డాక్డర్లు చెప్పారు.  

ఐదో తరగతి నుంచి ‘ట్రైబల్‌ వేల్ఫేర్‌’లోకి 

మన్ననూర్‌ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో దినేష్‌ ఐదోతరగతిలో చేరాడు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. క్లాస్‌లో తనే టాపర్‌. ఆంగ్లంపై ఉన్న మక్కువ, పట్టు గుర్తించిన టీచర్లు ఉదయ్‌కుమార్, ఆంజనేయులు దినేష్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ అతడి పరిజ్ఞానాన్ని పెంచుతున్నారు. ఫలితంగా ట్రైబల్‌ సొసైటీ సారథ్యంలో జరిగిన పలు డిబేట్లు, ఇగ్నైట్‌ ఫెస్‌ల్లో అనేక బహుమతులు పొందాడు.  

చదవండి: ఈ నిరుపేద రైతు కుటుంబంలో నలుగురికి ప్రభుత్వ ఉద్యోగాలు..ఒకరు అమెరికాలో

2500 పాఠశాలలు...పదిలక్షల మంది విద్యార్థులు 

డెటాల్‌ సంస్థ అపోలో ఫౌండేషన్‌తో కలిసి బాలబాలికల్లో స్వీయ, పరిసరాల పరిశుభ్రతతో పాటు కాలుష్య నియంత్రణపై అవగాహనకు ప్రతి ఏటా హైజిన్‌ ఒలింపియాడ్‌ నిర్వహిస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 4–15 తేదీల మధ్య దేశవ్యాప్తంగా ఈ పరీక్ష జరిగింది. ఒకటి నుంచి పదోతరగతి వరకు ప్రతి రెండు తరగతులను ఒక కేటగిరిగా చేసి మొత్తంగా ఐదు కేటగరిలో పరీక్ష నిర్వహిస్తారు. 9–10 తరగతుల కేటగిరిలో దేశ వ్యాప్తంగా 2500 పాఠశాలల నుంచి పది లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.

50 మార్కులకు ఆబ్జెక్టివ్‌ తరహాలో పరీక్ష జరిగింది. దినేష్‌ పూర్తి మార్కులతో పాటు చేతిరాత, పరీక్ష రాసిన విధానం ఆధారంగా అదనపు మార్కులతో కలిపి 51 మార్కులు సాధించాడు. దీంతో జాతీయస్థాయిలో దినేష్‌కు ప్రథమస్థానం వచ్చినట్లు డెటాల్‌ సంస్థ ప్రకటించింది. అక్టోబర్‌ 2న ముంబైలో జరిగే  కార్యక్రమంలో దినేష్‌  రూ. లక్ష నగదుతోపాటు పురస్కారం అందుకోనున్నాడు.

సెప్టెంబర్‌ 30న కలెక్టరేట్‌లో విద్యార్థి దినేష్‌ను నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో మన్ననూర్‌ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ పద్మావతి, ఉపాధ్యాయులు ఆంజనేయులు, చంద్రశేఖర్, గణేష్, విద్యార్థి తండ్రి కరంచంద్‌ పాల్గొన్నారు. 

నిక్‌ వుజిసిక్‌ నాకు స్ఫూర్తి  
తన అంగవైకల్యాన్ని అధిగమించి ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్‌ స్పీకర్‌గా మారిన నిక్‌ వుజిసిక్‌ నాలో స్ఫూర్తి నింపారు. అవకాశాలు అనేవి అందరికీ సమానమే. వాటిని అందిపుచ్చుకోవడమే మనవంతు అని నేర్చుకున్నా. అదే స్ఫూర్తితో ముందుకు వెళుతున్నా. చదువుతోపాటు క్రికెట్‌  నా హాబీ. బెస్ట్‌ కీపర్‌గా నా మార్కు చూపిస్తున్నా. సివిల్స్‌ రాసి ఐఏఎస్‌ సాధించాలని అనుకుంటున్నా.  
 – దినేష్‌ 

Published date : 30 Sep 2023 11:34AM

Photo Stories