School Facility Maintenance Grant: బడుల్లో స్వచ్ఛత
ఇందుకోసం ఆగస్టు నుంచి అన్ని ప్రభుత్వ, లోకల్ బాడీ పాఠశాలలకు ‘స్కూల్ ఫెసిలిటీ మెయింటెన్స్ గ్రాంట్’ను ప్రభుత్వం విడుదల చేయనుంది. అందుకోసం జీఓ నం.21 విడుదల చేసింది. అయితే నాలుగేళ్ల క్రితం ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తరగతి గదులు, పరిసరాలను శుభ్రం చేసేందుకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం కొద్దిపాటి నిధులు విడుదల చేస్తే వాటి ద్వారా తాత్కాలిక సిబ్బందిని నియమించేవారు.
ఆ తర్వాత ఆ బాధ్యతలను గ్రామ పంచాయతీ, మున్సిపల్ సిబ్బందికి అప్పగించారు. దీంతో వారు పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వహించడం లేదన్న ఆరోపణలు వచ్చాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇటీవల ప్రభుత్వం పాఠశాలల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం పాఠశాలల పరిశుభ్రత, పారిశుద్ధ్య చర్యలు వంటి అంశాలను కూడా ఆయా సంఘాలకే అప్పగించింది.
చదవండి: CM Breakfast Scheme: అల్పాహారం.. అందని ద్రాక్షేనా?
పార్ట్‌టైం, ఫుల్‌టైం వర్కర్లు..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా మొత్తం 3,225 ప్రభుత్వ పాఠశాలల ఉన్నాయి. వీటిలో మరుగుదొడ్లు, తరగతి గదులు, పాఠశాల ఆవరణలో పరిశుభ్రత, మొక్కల సంరక్షణ వంటి అంశాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రాంట్ ఇవ్వనుంది. పాఠశాలల నిర్వహణ కోసం ఇప్పటికే సమగ్ర శిక్ష అభియాన్ కింద కాంపోజిట్ స్కూల్ గ్రాంట్‌ను ప్రభుత్వం అందిస్తుంది.
వాటికి అదనంగా స్కూల్ ఫెసిలిటీ మెయింటెన్స్ గ్రాంట్‌ను కూడా ఈ నెల నుంచి ఇవ్వనున్నారు. వీటిని పూర్తిగా విద్యార్థుల సంఖ్య ఆధారంగా కేటాయిస్తుంది. ఈ నిధులు నేరుగా అమ్మ ఆదర్శ కమిటీ ఖాతాలో జమ చేయనున్నారు. ఈ కమిటీలు అనుమతి లేకుండా ఏ ఒక్క వ్యక్తి పేరు మీద నిధులు డ్రా చేయడానికి అవకాశం లేదు. కమిటీల ఆధ్వర్యంలో పార్ట్‌టైం, ఫుల్‌టైం వర్కర్లను నియమించుకోవాల్సి ఉంటుంది. వీరికి వేతనాల బాధ్యత కూడా కమిటీలకే అప్పగించింది.
నిధుల కేటాయింపు ఇలా..
- తరగతి గదులు, ఆవరణ, మరుగుదొడ్లలో పరిశుభ్రత పాటించేలా చర్యలు
- ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్మికుల నియామకానికి అవకాశం
- అమ్మ ఆదర్శ కమిటీలకు నేరుగా నిధుల విడుదల
- పాఠశాలల నిర్వహణగ్రాంట్ సైతం వారి ఖాతాల్లోనే జమ
- విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు కేటాయించనున్న ప్రభుత్వం
కమిటీల ఆధ్వర్యంలోనే..
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం జీఓ నం.21 ద్వారా పారిశుద్ధ్య కార్మికులను నియమించేందుకు అవకాశం కల్పించింది. వీటి నిర్వహణ మొత్తం పూర్తిగా అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో జరుగుతుంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుంది.
– రవీందర్, డీఈఓ, మహబూబ్‌నగర్