Govt Schols: ప్రభుత్వ స్కూళ్లకు రక్షణ కరువు
వీటిలో మన ఊరు – మనబడి కింద 258 పాఠశాలలకు ప్రహరీగోడలు మంజూరయ్యాయి. వీటిలో కొన్ని ప్రగతి దశలో ఉన్నాయి. 223 పీఎస్, యూపీఎస్, జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలకు పూర్తి స్థాయిలో ప్రహరీలు లేవు. మిగిలిన పాఠశాలల్లో పాతగోడలు, మరి కొన్నిచోట్ల ఒకవైపు కొంతమేర నిర్మాణాలు చేపట్టి మిగితా వైపు అసంపూర్తిగా వదిలేశారు.
ప్రహరీలు లేకపోవడంతో ఆవరణలోకే ఆవులు, గేదెలు, పందులు వస్తున్నాయి. ఇతర మూగజీవాలు పాఠశాలల్లోకి ప్రవేశించి పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఉదయం ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాలకు వచ్చి చూస్తే పేడకుప్పలు, చెత్తాచెదారం కనిపిస్తోంది.
ఆవరణ మొత్తం అపరిశుభ్రంగా మారుతుండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులే తొలగించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. స్కూళ్ల ఆవరణలో హరితహారం కింద నాటిన మొక్కలకు రక్షణ లేకుండా పోయింది. మరికొన్ని పాఠశాలలు రాత్రివేళ మందుబాబులకు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయని ఉపాధ్యాయులు, ప్రజలు అంటున్నారు.