Schools: ఇక్కడి స్కూళ్లలో ఔట్‌డోర్ బంద్.. ఈ తరగతి పిల్లలకు ఆన్‌లైన్‌లోనే క్లాసులు..
‘పాఠశాలల ప్రాంగణాల్లో చిన్నారుల ఆటపాటలు, ఇతరత్రా కార్యక్రమాలు ఉండబోవు. గదుల్లో శ్వాస సంబంధ, యోగా తరగతులు నిర్వహిస్తాం. విద్యాసంవత్సం దెబ్బతినకుండా ఉండేందుకు బోధనను కొనసాగిస్తాం. స్కూళ్ల మూసివేత ఉండదు’ అంటూ కొన్ని పాఠశాలలు నిర్ణయం తీసుకున్నాయి. స్కూళ్లో ఎయిర్ ప్యూరిఫయర్లు, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నాయి. గాలి కాలుష్యం రోజురోజుకూ పెరుగుతుండటంతో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఢిల్లీలో స్కూళ్లు మూసేయాలన్న చిన్నారుల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్(ఎన్‌సీపీసీఆర్) సూచనపై విద్యార్థుల తల్లిదండ్రులు స్పందించారు.
చదవండి: AP: విద్యలో అగ్రగామి.. తొలిసారి ‘లెవెల్–2’ సాధించిన ఆంధ్రప్రదేశ్
‘పాఠశాల టైమింగ్స్ పెంచడంతో పెద్దగా ఉపయోగం లేదు. స్కూళ్లు మూసేయాలి. వాయు కాలుష్యంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు’ అని ఢిల్లీ స్కూల్ విద్యార్థుల సంఘం అధ్యక్షులు అపరాజితా గౌతమ్ డిమాండ్ చేశారు. అయితే, ‘ స్కూళ్లు కొనసాగాల్సిందే. లాక్‌డౌన్‌లతో ఇప్పటికే చదువులు దెబ్బతిన్నాయి. పదో తరగతి పరీక్షలు దగ్గరపడుతున్నాయి. ఇంకొంత సేపు స్కూల్ టైమింగ్స్ పెంచాలి’ అని కొందరు తల్లిదండ్రులు వాదిస్తున్నారు. కాగా, నవంబర్ 8వ తేదీ వరకు 8వ తరగతి దాకా పిల్లలకు ఆన్‌లైన్‌లోనే క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.