Skip to main content

Department of Education: మళ్లీ ఇంటింటా మొబైల్‌ బాట!

పాఠశాల విద్యార్థులు మళ్లీ ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను చేతుల్లోకి తీసుకునే సమయం వచ్చింది.
Department of Education
మళ్లీ ఇంటింటా మొబైల్‌ బాట!

కోవిడ్‌ కాలంలో వినియోగించిన సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లకు పని కల్పించబోతున్నారు. ఈ దిశగా రాష్ట్ర విద్యాశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. కరోనా సమయంలో రూపొందించిన ‘ఇంటింటా చదువుల పంట’యాప్‌ను మళ్లీ తెరమీదకు తెచ్చింది. ఈసారి దీన్ని మరింత ఆధునీకరించామని అధికారు లు తెలిపారు. 3–10 తరగతులు చదివే విద్యార్థులకు బోధన తీరును మెరుగుపర్చడమే దీని ఉద్దేశమని అధికారులు అంటున్నారు. అయితే, ఇప్పుడిప్పుడే దారికొస్తున్న విద్యార్థులను మళ్లీ సెల్‌ఫోన్లకు అలవాటు చేయడం సరికాదని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి.

చదవండి: టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2022 | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | సిలబస్

ఎలా పనిచేస్తుంది?

ఇది పూర్తిగా సర్వర్‌ అనుసంధానమై పనిచేస్తుంది. ప్రతీ పాఠం నుంచి కొన్ని ప్రశ్నలు, సమాధానాలు ఇందులో పొందుపరుస్తారు. రాష్ట్రస్థాయిలో హైదరాబాద్‌ కేంద్రంగా వీటిని రూపొందిస్తారు. ప్రతీ స్కూల్లోనూ ఒక వాట్సాప్‌ నంబర్‌ ఇస్తారు. ఆ నంబర్‌ను విద్యార్థి సెల్‌ఫోన్‌లో ఫీడ్‌ చేసుకోవాలి. ఆ నంబర్‌ నుంచి వాట్సాప్‌కు ఒక సందేశం ద్వారా కొన్ని ప్రశ్నలు వస్తాయి. వాటికి ఆన్‌లైన్‌లోనే సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన సమాధానాలు సరైనవా? కాదా? అనేది వెంటనే తెలుస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం మానవరహితంగా, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ ద్వారా పనిచేస్తుంది. దీన్ని ఒక అసైన్‌మెంట్‌గా భావించి, ఇంటర్నల్‌ మార్కులిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలంగాణ విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. విద్యార్థిలో పఠనాశక్తి పెంపొందించడం, హోంవర్క్‌ను సైతం నవీన ధోరణిలో చేయించడానికి వీలుంటుందని చెప్పారు. ప్రతీ శనివారం ఈ తరహా ప్రశ్నలు విద్యార్థులు పొందవచ్చని తెలిపారు. వాట్సాప్‌కు సందేశం రాకపోతే ఒక లింక్‌ లేదా క్యూఆర్‌ కోడ్‌ ఇస్తారని, దీని ద్వారా విద్యార్థులు ప్రశ్నలను పొందవచ్చని అధికారులు తెలిపారు.

చదవండి: టెన్త్ క్లాస్ - బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

ఇది సరైన నిర్ణయం కాదు: పి.రాజభాను చంద్రప్రకాశ్‌ (రాష్ట్ర గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు)
ఇంటింటా చదవుల పంట కార్యక్రమం ఉద్దేశం మంచిదే అయినా, ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు అది నష్టమే కల్గిస్తుంది. కోవిడ్‌ సమయంలో విద్యార్థులకు ప్రత్యక్ష బోధన లేని కాలంలో డిజిటల్‌ రూపంలో విద్యను అందించడానికి, వారి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రస్తుతం విద్యార్థుల సందేహాలను తీర్చడానికి ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారు. ఇప్పుడిప్పుడే విద్యార్థులు ఆన్‌లైన్‌ ప్రపంచం నుంచి తరగతి గది వైపు మరలుతున్నారు. ఇప్పుడు మళ్లీ విద్యార్థులకు మొబైల్‌ ఫోన్లు ఇస్తే వారి దృష్టికి మరలించినట్లవుతుంది.

Published date : 01 Nov 2022 12:35PM

Photo Stories