Skip to main content

Schools Inspection: ఉపాధ్యాయుల‌కు వణుకు పుటిస్తున్న ఎమ్మెల్యే!

సాక్షి, కామారెడ్డి: విధులకు ఎగనామం పెడుతూ సొంత వ్యాపారాల్లో మునిగి తేలుతున్న ఉపాధ్యాయుల్లో వణుకు మొదలైంది.
Kattipalli Venkataramana Reddy visit govt schools

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి బిజినెస్‌ టీచర్లపై ఫోకస్‌ చేశారు. వారం రోజులుగా స్కూళ్లను ఆకస్మికంగా తనిఖీలు చేస్తుండడంతో హడలిపోతున్నారు. మార్చి 13న రాజంపేట మండలం ఆరెపల్లి తండాలో ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. అక్కడ పనిచేసే ఉపాధ్యాయుడు అయిత బాలాజీ అధికారుల అనుమతి లేకుండా, సెలవు పెట్టకుండా పాఠశాలకు రావడం లేదని గుర్తించారు.
ఆయనకు బదులు తండాకు చెందిన ఓ మహిళ విధుల్లో ఉండడంతో ఆశ్చర్యపోయిన ఎమ్మెల్యే అధికారులకు ఫోన్‌చేసి నిలదీశారు. దీంతో విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి అప్పటికప్పుడు సదరు టీచర్‌ బాలాజీని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొందరు బిజినెస్‌ టీచర్లు అధికారులను మచ్చిక చేసుకుని విధులకు హాజరుకావడం లేదనే విమర్శలున్నాయి.

చదవండి: Collector Turns As Teacher: టీచర్‌గా మారిన హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి
ఎమ్మెల్యే తనిఖీ చేసేదాకా టీచర్లు రోజుల తరబడి స్కూళ్లకు రావడం లేదన్న విషయం అధికారులకు తెలియకపోవడం విస్మయం కలిగిస్తోంది. కొందరు టీచర్లు హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.
భిక్కనూరు, రాజంపేట, బీబీపేట, దోమకొండ, మాచారెడ్డి, కామారెడ్డి, తాడ్వాయి, సదాశివనగర్‌, రామారెడ్డి తదితర మండలాల్లో పనిచేసే ఉపాధ్యాయులు కొందరు హైదరాబాద్‌ నుంచి వచ్చి వెళ్తున్నారు.

ప్రతి ఉపాధ్యాయుడు ప్రార్థనా సమయానికి పాఠశాలకు చేరుకోవాల్సి ఉన్నా.. చాలా మంది ఆలస్యంగా వస్తున్నట్లు తెలుస్తోంది. ఒంటిపూట బడులు మొదలైన నేపథ్యంలో ఉదయం ఎనిమిది గంటలకే స్కూళ్లకు ఎలా చేరుకుంటారో వారికే తెలియాలి!

తనిఖీలతో తల్లడంమల్లడం..

ఎమ్మెల్యే స్కూళ్లను తనిఖీ చేస్తుండడంతో డుమ్మా మాస్టర్లు తల్లడంమల్లడం అవుతున్నారు. కొందరు టీచర్లు బిజినెస్‌లు చేస్తూ విధులకు డుమ్మా కొడుతుండగా, మరికొందరు డీఈవో కార్యాలయం చుట్టే తిరుగుతున్నారు. ఏదో ఒక పని పేరుతో స్కూళ్లకు వెళ్లడం లేదు.
రోజుల తరబడిగా స్కూళ్ల ముఖం చూడని వారున్నారు. జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమాలకు సంబంధం లేకున్నా, కొందరు విధులకు ఎగనామం పెట్టి ఆయా కార్యక్రమాలకు హాజరవుతున్నారు.

మరికొందరు ఉపాధ్యాయులు రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులతో అంటకాగుతూ వాళ్లతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. రాజకీయ నాయకుల అండ ఉందని అధికారులను లెక్కచేయడం లేదు. ఎమ్మెల్యే తనిఖీల నేపథ్యంలోనైనా అధికారులు తమ బాధ్యతలు గుర్తెరిగి, స్కూళ్లను తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది.

వ్యాపారాలతో బిజీబిజీ..

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు చాలామంది రెగ్యులర్‌గా విధులకు హాజరవుతూ, పిల్లలకు మంచి బోధన అందిస్తున్నారు. అలాంటి టీచర్ల వల్లే ఇప్పటికీ ప్రభుత్వ బడులు మనుగడ సాధించగలుగుతున్నాయి. కానీ కొందరు మాత్రం విధులకు ఎగనామం పెడుతూ సొంత వ్యాపారాల్లో తలమునకలవుతున్నారు.
ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణరంగం, హోటళ్లు, లాడ్జీల నిర్వహణ, ప్రైవేటు కాలేజీలు, స్కూళ్లు, ఫైనాన్స్‌, చిట్స్‌ ఆఖరుకు మద్యం దందాలోనూ కొందరు భాగస్వాములుగా ఉన్నారు. మరికొందరు టీచర్లు బిజినెస్‌ పార్టనర్లతో కలిసి రెగ్యులర్‌గా విదేశీ టూర్లకూ వెళ్తున్నారు. టూర్లకు వెళ్లే సమయంలో కూడా కొందరు సెలవులు కూడా పెట్టుకోలేదన్న ఆరోపణలున్నాయి.

వారం రోజులుగా ఎమ్మెల్యే తనిఖీలు

ఎమ్మెల్యే కేవీఆర్‌ వారం రోజులుగా నియోజకవర్గంలో స్కూళ్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నా రు. అందులో భాగంగా మార్చి 12న నియోజక వర్గంలోని విద్యాశాఖ అధికారులు, క్లస్టర్‌ హె డ్మాస్టర్లు, హెడ్‌ మాస్టర్లతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి సమయపాలన పాటించేలా చూడాలని స్పష్టం చేశారు. తాను తనిఖీలు నిర్వహిస్తానని చెప్పి పంపించారు. కాగా ఎమ్మెల్యే తనిఖీ చేసిన సమయంలో దోమకొండలో పనిచేసే ఓ ఉపాధ్యాయ సంఘం నాయకుడు విధులకు గైర్హాజరైనట్లు గుర్తించి వార్నింగ్‌ ఇచ్చారు.

కామారెడ్డి మండలంలోని క్యాసంపల్లిలో పనిచేసే ఉపాధ్యాయుడు డీఎస్‌వో పేరుతో విధులకు గైర్హాజరైన విషయంలో సీరియస్‌ అయ్యారు. మాచారెడ్డి, బీబీపేట, భిక్కనూరు తదితర మండలాల్లోనూ పలు పాఠశాలలను తనిఖీ చేశారు. కాగా ఎమ్మెల్యే తనిఖీల నేపథ్యంలో టీచర్లలో వణుకు మొదలైంది. దీంతో రెగ్యులర్‌గా విధులకు హాజరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
 

Published date : 15 Mar 2024 02:56PM

Photo Stories