22న అంతర్జాతీయస్థాయి ఎడ్యుకేషన్ ఫెయిర్
ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు సంబంధించిన పోస్టర్‌ను సెప్టెంబర్ 26న మంత్రి ఫాంహౌస్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌కు మొట్టమొదటి సారిగా అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలను ఆహ్వానించి ఉచితంగా ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు విద్యార్థులకు చక్కని అవకాశం లభిస్తుందన్నారు.
విదేశాల్లో ఎం చదవాలి, ఏఏ విశ్వవిద్యాలయాల్లో చదివితే మంచి భవిష్యత్ ఉంటుందో తెలుసుకోవడంతోపాటు ఉపకార వేతనాలు మొదలైన సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ ఫెయిర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గుర్తింపు లేని, పెద్దగా ఉపయోగపడని విశ్వవిద్యాలయాల్లో చదివి అనేకమంది విద్యార్థులు తమ భవిష్యత్‌ను వృథా చేసుకుంటున్నారని, అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ ఫెయిర్ వల్ల అలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని అన్నారు.
ఉన్నత విద్య కోసం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి దేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు హైదరాబాద్ వంటి నగరాల్లో పలు కన్సల్టెన్సీలను ఆశ్రయిస్తారని, అలాంటిది మహబూబ్‌నగర్‌లోనే అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అడిగిన వెంటనే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ హబ్ నిర్వాహకులు ఇక్కడ 20కిపైగా అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో ఎడ్యుకేషన్ ఫెయిర్ ఏర్పాటు చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు.
దసరా సెలవుల్లో ఏర్పాటు చేస్తున్న ఈ సదస్సును హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, ముంబై, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న జిల్లా విద్యార్థులు సద్వినియోగం చేసుకునాలని కోరారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ హబ్ బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్లు వినయ్‌కుమార్, అంకిత్ జైన్ పాల్గొన్నారు.