గురుకులం వద్ద ఆందోళన
దసరా సెలవులను ముగించుకొని పాఠశాలకు విద్యార్థినులతోపాటుగా తల్లిదండ్రలు వచ్చారు. అయితే ఒక రోజు ఆలస్యంగా రావడంతో గురుకుల ప్రిన్సిపాల్ విద్యార్థినులను పాఠశాల లోపలికి అనుమతించలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల బయటే ఎండలో దాదాపుగా రెండున్నర గంటల పాటు నిలిచారు. చేసేదిలేక పాఠశాల బయట రోడ్డుపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. గురుకుల ప్రిన్సిపాల్ తీరు సరికాదని, ఆమైపె చర్య తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ దనుంజయ్ జోక్యం చేసుకుని, తల్లిదండ్రులకు, ప్రిన్సిపాల్‌కు సర్ది చెప్పారు.
చదవండి: Jobs: సమగ్ర శిక్ష ఐఈఆర్టీ పోస్టుల అభ్యర్థులకు ఇంటర్వ్యూలు
ఆలస్యంగా వచ్చారని, పాఠశాల లోపలికి అనుమతించని గురుకుల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు మారెన్న ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై ప్రిన్సిపాల్ వాణిని వివరణ కోరగా.. ఉదయం 10 గంటలలోపు వచ్చిన వారందరిని లోపలికి అనుమతించామని, 10 గంటల తర్వాత వచ్చిన కొందరిని మాత్రమే ఆపడం జరిగిందని, ఇక్కడి విద్యార్థులకు ఇబ్బంది కల్గించకూడదని తల్లిదండ్రులకు తెలియజేసినట్లు తెలిపారు.