Department of Education: పాఠశాల విద్యార్థులకు ‘పరీక్ష’
9, 10 తరగతులకు 2022లో 11 పేపర్లు ఉంటాయని విద్యాసంవత్సరం ఆరంభంలో అధికారులు ప్రకటించారు. ఇందుకు అనుగుణంగానే విద్యార్థులను టీచర్లు సన్నద్ధం చేశారు. ఈ నేపథ్యంలో నవంబర్ 1వ తేదీ నుంచి ఎస్‌ఏ–1 పరీక్షలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే నెల ముందు నుంచి అన్ని జిల్లాల్లో ప్రశ్నపత్రాల రూపకల్పన చేసి ప్రింటింగ్‌కు కూడా పంపారు. ఈ దశలో ఉన్నట్టుండి తెలంగాణ విద్యాశాఖ రూటు మార్చింది.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2022 | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | సిలబస్
2022లో పరీక్షలను ఆరు పేపర్లతోనే నిర్వహిస్తామని ప్రకటించి వారం క్రితం షెడ్యూల్ కూడా ఇచ్చింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అయోమయంలో పడ్డారు. ప్రశ్నపత్రాలను మళ్లీ కూర్పు చేయడం, ప్రింటింగ్ ఇవ్వడం సాధ్యంకాదంటూ ఉన్నతాధికారులకు ఉపాధ్యాయులు తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మళ్లీ యూటర్న్ తీసుకోక తప్పలేదు. ఎస్‌ఏ–1 వరకూ 11 పేపర్లుంటాయని, ఎస్‌ఏ–2 మాత్రం ఆరు పేపర్లతోనే నిర్వహిస్తామని స్పష్టం చేసింది. పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. దీనికి సన్నద్ధమయ్యేందుకు, ప్రశ్నపత్రం మోడల్ తెలియడం కోసమే ఎస్‌ఏ–1 నిర్వహిస్తారని ఉపాధ్యాయులు అంటున్నారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
ఎస్‌ఏ–1కు ఒక మోడల్‌లో పరీక్ష పెట్టి, ఫైనల్‌లో వేరే మోడల్‌లో పరీక్షలు రాయాల్సి వస్తే విద్యార్థులు అయోమయానికి గురవుతారని ఉపాధ్యాయులు అంటున్నారు. పరీక్ష విధానంపై స్పష్టత లేకపోతే విద్యార్థులు సరిగా రాయలేకపోవచ్చని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన నిర్ణయాలు తీసుకునేముందు అన్ని కోణాల్లోనూ చర్చించాల్సిన అవసరం ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. స్కూల్ ఎడ్యు కేషన్ డైరెక్టరేట్‌లో ఈ తరహా కసరత్తు కరువైందని, అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవడం, ఉన్నతాధికారులు ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోకపోవడం గందర గోళానికి దారితీస్తోందని టీచర్లు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.