Tenth Class Public Exams 2024: పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు
![పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు](/sites/default/files/images/2024/05/22/examspreparations-1716364361.jpg)
సుల్తానాబాద్(పెద్దపల్లి) : జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగే పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 7,728 మంది విద్యార్థులు హాజరవుతారని, వీరికోసం వివిధ ప్రాంతాల్లో 45 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. మాస్ కాపీయింగ్ నిరోధానికి, పారదర్శక పరీక్షల కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రశ్నపత్రాలు ఇప్పటికే ఆయా పోలీస్‌స్టేషన్లలో భద్రపర్చినట్లు అధికారులు వివరించారు.
హాల్‌టికెట్ల జారీ షురూ..
పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు గత బుధవారం నుంచి హాల్‌టికెట్లు జారీచేస్తున్నారు. వివిధ యాజమాన్యాలు హాల్‌టికెట్ల ఇవ్వకుంటే సమీపంలోని ఆన్‌లైన్ కేంద్రం నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని ఉన్నతాధికారులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. ఫీజు బకాయిలు, ఇతర ఏమైనా కారణాలతో హాల్‌టికెట్లు ఇవ్వని ప్రైవేట్ యా జమాన్యాలపై తమకు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.
Also Read : TS EM 10th Class Study material
మూడు నెలలుగా ప్రత్యేక తరగతులు..
ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మూడు నెలలుగా ఈ ప్రక్రియ నిరంతరం ప్రణాళిక బద్ధంగా కొనసాగుతోంది. ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. ఫలితాల్లో జిల్లా అగ్రస్థానంలో నిలిచేలా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ విద్యార్థులతో నేరుగా మాట్లాడు తూ ఉత్సాహ పరుస్తున్నారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలతోపాటు జిల్లా విద్యాధికారి మాధవితో మెరగైన ఫలితాల సాధనపై ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారు.
45 పరీక్ష కేంద్రాలు..
రెగ్యులర్ విద్యార్థుల కోసం జిల్లాలో 45 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 32 ప్రభుత్వ, 13 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 7,728 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. ఇందులో సప్లిమెంటరీ విద్యార్థులు కూడా ఉన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులను గంట ముందే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు.
45మంది చీఫ్ సూపరింటెండెంట్లు..
45 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, మరో 45 మంది డిపార్టుమెంటల్ అధికారులు, ముగ్గురు కస్టోడియన్లను నియమించారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్‌తో పాటు జిల్లావ్యాప్తంగా 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను నియమించారు. దూర ప్రాంత విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది.
అందుబాటులో వైద్యసిబ్బంది..
ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్త గ్లూకోస్ పౌడర్, ఫస్ట్‌ఎయిడ్ బాక్స్‌తో అందుబాటులో ఉంటారు. వీరు అత్యవసర వైద్య సేవలు అందిస్తారు. తాగునీటి సౌకర్యం కల్పిస్తారు. అవసరమైనచోట షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు.