ప్రాథమిక పాఠశాలకు తాళం వేసిన కాంట్రాక్టర్
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో సెప్టెంబర్ 6న జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ప్రాథమిక పాఠశాల భవనానికి ‘మన ఊరు–మన బడి’పథకం కింద స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) చైర్మన్ శ్రీకాంత్ రూ.4.30 లక్షల అంచనా వ్యయంతో పనులు దక్కించుకుని పూర్తి చేశారు. మంచినీటి సంప్, మరుగుదొడ్లు, తరగతి గదులకు మరమ్మతులు చేయించారు. పనులు చివరిదశకు చేరుకున్నాయి. ఇప్పటివరకు చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తే ఆ డబ్బులతో పూర్తి చేస్తానని అధికారులకు విన్నవించారు. బిల్లు పొందేందుకు తిరిగి తిరిగి విసిగిపోయారు. గత్యంతరం లేక సెప్టెంబర్ 6న పాఠశాలకు తాళం వేసి విద్యార్థులను, అధ్యాపకులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీనితో విద్యార్థులు, అధ్యాపకులు చేసేది ఏమిలేక ఇళ్లకు వెళ్లారు. పాఠశాలకు తాళం వేసిన విషయం అధికారుల దృష్టికి రావడంతో మండల విద్యాధికారి శ్రీనివాస్ హుటాహుటిన పాఠశాలను సందర్శించి జిల్లా విద్యాధికారి, కలెక్టర్‌కు సమాచారం అందజేశారు. స్పందించిన కలెక్టర్ రెండురోజుల్లో పనులు చేసిన మొత్తానికి బిల్లులు చెల్లిస్తామని చెప్పడంతో కాంట్రాక్టర్ తాళాన్ని తీసివేశారు. ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులు పనులను పర్యవేక్షించి ఆఫ్‌లైన్‌లో బిల్లులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎంఈవో శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కాంట్రాక్టర్‌పై కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.